అంతరించిపోతున్న కళలకు ఊపిరిపోసేలా ‘తెలుగు నడక’

డిజిటల్‌ యుగంలో ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. కాలంతో పాటు మనిషి గమ్యం ఎరుగని రీతిలో పరుగులు తీస్తూనే......

Published : 07 Sep 2022 17:37 IST

అమెరికా: డిజిటల్‌ యుగంలో ప్రపంచం శరవేగంగా మారిపోతోంది. కాలంతో పాటు మనిషి గమ్యం ఎరుగని రీతిలో పరుగులు తీస్తూనే ఉన్నాడు. మనిషి జీవన శైలిలో వస్తోన్న విప్లవాత్మకమైన మార్పుల కారణంగా మాతృభాషతో పాటు ఆచార వ్యవహారాలు, కళలు, వృత్తులు, జానపద రుచులు, అభిరుచులూ మారిపోతున్నాయి. ఈ కారణంగా తరతరాలుగా వస్తోన్న కళలు, సంస్కృతులు అనేకం మరుగున పడిపోతున్నాయి. అక్షర రూపం దాల్చిన కళలను భద్రపరిచే ప్రయత్నాలు చరిత్రలో కొంతవరకు జరిగినా.. అచ్చమైన తెలుగు జానపద కళారూపాలు, చేతివృత్తులను చారిత్రక విలువగా భద్రపరుచుకొనే అవకాశం ఇంచుమించూ లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్‌సీ) ఓ బృహత్తర ఉద్యమాన్ని చేపట్టింది. తెలుగు జాతి కళలను, జీవన విధానాలను భావితరాల కోసం భద్రపరిచే ఓ చారిత్రక బాధ్యతను తీసుకుంది. అంతరించిపోతున్న మన కళలు, సంస్కృతులను రికార్డు చేసి నవతరానికి అందించాలనే  సంకల్పంతో ‘తెలుగు నడక’ పేరుతో ఓ ప్రత్యేక క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది.

కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని దృశ్య, శ్రవణ రూపాల్లో అన్ని రకాల ప్రదర్శన కళలు, చేతి కళలు, కుల వృత్తులు, చేతి వృత్తులను జాగ్రత్తగా సేకరించి భావితరాల కోసం భద్రపరిచి అందరికీ అందుబాటులో ఉంచాలి సంకల్పంగా తీసుకుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల మొదలుపెట్టి కొన్ని వీడియోలను రూపొందించారు. ఈ మహా కార్యానికి డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను చూస్తుండగా.. దీనికి ప్రధాన సలహాదారు, నిర్వహణకర్తగా స.వెం. రమేశ్‌ వ్యవహరిస్తున్నారు. తెలుగు నడక (https://telugunadaka.in) క్యాంపెయిన్‌ భారత్‌లో నిర్వహించేందుకు సికింద్రాబాద్‌లోని లాభాపేక్షలేని సంస్థ వాటర్‌షెడ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివిటీస్‌ నెట్‌వర్క్‌ (WASSAN) సహకరిస్తుండగా.. మైరా మీడియా సాంకేతిక సహాయం అందిస్తోంది. విషయ సేకరణ కోసం పల్లెపల్లెకూ తిరిగే వారికి వేతనాలు, ఆయా కళలు, చేతి పనులు ప్రదర్శించే వారికి అయ్యే ఖర్చులు, ప్రదర్శనలు చేసేవారికి ఇచ్చే మొత్తం తప్ప మిగతా పనులన్నీ స్వచ్ఛంద సేవగానే జరుగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సేకరణలో భాగస్వాములు కావాలనుకొనేవారు డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు నడక ఉద్యమంలో భాగంగా రూపొందించిన కొన్ని వీడియోలను https://www.youtube.com/c/DetroitTeluguLiteraryClub/videos ఇక్కడ చూడొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని