Diwali in USA: అమెరికాలోనూ దీపావళి.. న్యూయార్క్‌లో బాణసంచా వెలుగులు జిగేల్‌!

భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో అమెరికా ప్రజాప్రతినిధులు......

Published : 05 Nov 2021 01:49 IST

వాషింగ్టన్‌: భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో అమెరికా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్‌ డెమోక్రటిక్‌ క్లబ్‌లో పలువురు ప్రముఖులు దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భారత సంతతి అమెరికన్లు, అమెరికన్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై తొలిసారిగా దీపావళి థీమ్‌ని ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదీ తీరంలో మూడు రోజుల దీపావళి వేడుకల సందర్భంగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.

శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. చీకటిని తొలగించే సత్యం, జ్ఞానాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ఫొటోను షేర్‌ చేసుకున్నారు.

జపాన్‌లోనూ ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. టోక్యోలోని ఓ పార్కులో బాణసంచా కాల్చి కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. పెద్దలు, పిల్లలు ఇంటిల్లిపాదీ టపాకాయలు పేలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు, హాంకాంగ్‌, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా, తైవాన్‌ తదితర దేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి హిందూ దేవాలయాలకు వెళ్లి ప్రవాస భారతీయులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

అలాగే, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళి మనందరికీ ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు. కఠిన సమయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామన్న బోరిస్‌.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే చాలా ముందుకు వచ్చామన్నారు. ఈ సంతోష సమయాన్ని కుటుంబం, స్నేహితులతో గడపాలన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని