టెక్సాస్ మెడిక‌ల్ బోర్డులో డాక్టర్‌ జ‌య‌రామ్‌ నాయుడు 

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక టెక్సాస్ మెడిక‌ల్ బోర్డులో ప్రవాసాంధ్రులు, తెలుగు తేజం, అనంత‌పురం జిల్లాకు చెందిన డాక్టర్‌ జ‌య‌రామ్ నాయుడు మ‌రోసారి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. మొత్తం ఏడుగురు...

Updated : 08 Oct 2021 00:32 IST

ఏడుగురిలో ప్రవాసాంధ్రులు డాక్టర్‌ జ‌య‌రామ్‌ నాయుడు పున‌ర్నియామ‌కం 

బోర్డును నియ‌మించిన గ‌వ‌ర్నర్‌ ఎబాట్

టెక్సాస్‌: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక టెక్సాస్ మెడిక‌ల్ బోర్డులో ప్రవాసాంధ్రులు, తెలుగు తేజం, అనంత‌పురం జిల్లాకు చెందిన డాక్టర్‌ జ‌య‌రామ్ నాయుడు మ‌రోసారి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. మొత్తం ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన ఈ బోర్డును టెక్సాస్ గ‌వర్నర్‌ గ్రెగ్ ఎబాట్ నియ‌మించారు. ఏడుగురు స‌భ్యుల్లో అదా బూత్ (ఎం.డి), ఎబొనీ టాడ్‌, మైఖేల్ కొకినాస్‌, కాండేస్ ఫార్మర్‌ (డీఓ), మోర్గాన్ (ఎం.డి), డా.జ‌య‌రామ్ నాయుడు(ఎం.డి), ష‌రీఫ్ జాఫ్రాన్ (ఎం.డి) ఉన్నారు. ఈ బోర్డు 2027, ఏప్రిల్ 13 వ‌ర‌కు ప‌నిచేయ‌నుంది. టెక్సాస్ వైద్య అవ‌స‌రాలు, ఇత‌ర వైద్య సంబంధ‌మైన సేవ‌ల విష‌యంలో ఈ బోర్డు కీల‌కంగా వ్యవహరించనుంది.  

కృషి, ప‌ట్టుద‌లే విజ‌య ర‌హ‌స్యం!

టెక్సాస్ మెడిక‌ల్ బోర్డులో స్థానం సంపాదించుకున్న డాక్టర్‌ జ‌య‌రామ్‌ నాయుడు వైద్య రంగంలో సుదీర్ఘ కాలంగా ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఈ స్థాయికి రావడం వెనక కొన్నేళ్ల కృషి, ప‌ట్టుద‌ల‌ ఉంది. టెక్సాస్ ప‌శ్చిమ ప్రాంత‌మైన ఒడెస్సాలో ఫిజిషియ‌న్‌గా ఆయ‌న సేవ‌లందిస్తున్నారు. అదే స‌మ‌యంలో నాయుడు క్లినిక్ అధ్యక్షుడిగా, టెక్సాస్ టెక్ యూనివ‌ర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంట‌ర్ అసిస్టెంట్ క్లినికల్‌ ప్రొఫెస‌ర్‌గా సేవ‌లు అందిస్తున్నారు. సుమారు 40 ఏళ్లపాటు వైద్య నిపుణులుగా ఆయ‌న ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. టెక్సాస్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స‌భ్యులుగా కూడా డాక్టర్‌ జ‌య‌రామ్‌ నాయుడు వ్యవహరించారు. అదేవిధంగా ఎక్టార్ కౌంటీ మెడిక‌ల్ సొసైటీ, టెక్సాస్ టెక్ హెల్త్ సైన్సెస్ సెంట‌ర్ స‌ల‌హా బోర్డు స‌భ్యునిగా కూడా ఉన్నారు. గ‌తంలో ఒడెస్సా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స‌భ్యులుగా పనిచేశారు. 2010-2013 మ‌ధ్య గ‌వ‌ర్నర్‌ రిక్ పెర్రీ, జ‌య‌రామ్‌ను ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ టాస్క్ ఫోర్స్’ స‌భ్యునిగా నియ‌మించారు. 2017-22 వ‌ర‌కు టెక్సాస్ మెడిక‌ల్ బోర్డు స‌భ్యులుగా నియామ‌కం పొందారు. తాజాగా ఈ బోర్డులో మ‌రోసారి నియామ‌కం పొంద‌డం విశేషం. 

బోర్డు విధులు ఇవే..

టెక్సాస్ మెడిక‌ల్ బోర్డుకు కొన్ని విధులు ఉన్నాయి. వీటిలో ప్రజారోగ్య, భద్రత, పరిరక్షణలకు పెద్దపీట వేయాలి. నిబంధ‌న‌ల‌ను తూ.చ‌. తప్పకుండా పాటించేలా చూడాల్సి ఉంటుంది. టెక్సాస్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవ‌లు అందేలా పర్యవేక్షించాలి.  

ఇంతింతై.. అన్నట్టుగా!

డాక్టర్‌ జ‌య‌రామ్‌ నాయుడు ఇంతింతై అన్నట్టుగా వైద్య రంగంలో విక‌సించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంత‌పురం జిల్లాకు చెందిన ఆయ‌న 1966లో గుంటూరు మెడిక‌ల్ కళాశాలలో వైద్య శాస్త్రంలో ప‌ట్టా(డిగ్రీ) పొందారు. అనంతర కాలంలో అమెరికాకు చేరుకున్న ఆయ‌న‌ న్యూయార్క్‌లోని ఏసీ లగాన్ మెమోరియ‌ల్ హాస్పిటల్‌లో రెసిడెన్సీ ఇంట‌ర్నల్‌ మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం వైద్య రంగంలో ఎంతో సేవ చేసి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts