
క్వాడ్‌కు అందరి ప్రశంసలు
బైడెన్ వ్యాఖ్య
వాషింగ్టన్, బీజింగ్: ‘క్వాడ్’ దేశాల తొలి సదస్సు చాలా బాగా సాగిందని, అందరూ దీన్ని మెచ్చుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు కలిసి ‘చతుర్భుజ భద్రత సంభాషణలు’ (క్వాడ్రలేటరల్ సెక్యూరిటీ డైలాగ్- క్వాడ్) బృందంగా ఏర్పడ్డాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహాయ సహకారాల నిమిత్తం ఇది ఏర్పాటయింది. శుక్రవారం ఈ బృందం ప్రథమ శిఖరాగ్ర సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగా పాల్గొన్నారు. ఈ భేటీ జరిగిన తీరుపై బైడెన్ ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు. ‘‘మా బాధ్యతలు ఏమిటో తెలుసు. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాలు, విశ్వవ్యాప్త విలువల ఆధారంగా పరిపాలన ఉంటుంది. నిర్బంధ రహితంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ ప్రాంతంపై ఆధిపత్యం తనదేనని చైనా చెబుతున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్య చేశారు.
ప్రత్యేక బృందాలు ఎందుకు?: చైనా
మరోవైపు క్వాడ్ భేటీని చైనా తప్పుపట్టింది. తమను బూచిగా చూపి ఈ ప్రాంతంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి ఝావో లిజియన్ ఆరోపించారు. ఇలాంటి ప్రత్యేక బృందాలు అవసరం లేదని, దీనివల్ల సాధించేది ఏమీ ఉండదని అన్నారు. పరస్పర విజయాలు, శాంతి, సహకారమే ప్రస్తుత ప్రపంచ విధానంగా నడుస్తోందని, అయితే అందుకు వ్యతిరేకంగా క్వాడ్ తీరు ఉందని విమర్శించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశానికి వ్యతిరేకంగా కూటమి కట్టడం అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకమని అన్నారు.