Updated : 22 Nov 2020 14:45 IST

ట్రంప్‌ తీసుకున్న డ్రగ్‌కు అత్యవసర అనుమతి!

వాషింగ్టన్‌‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ అంతమొందించేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధాల కోసం విశేష కృషి జరుగుతోంది. ఇప్పటికే పలు రకాల చికిత్సా విధానాలు కొంత మేర ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ డ్రగ్‌’ భారీ ఆశలు రేకెత్తిస్తోంది. కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దీన్ని ‘స్వర్గం నుంచి వచ్చిన బహుమతి’గా అభివర్ణించారు. వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో ఆయనకు ఈ డ్రగ్‌ను ఇచ్చారు. దాని వల్లే ఆయనలో కొవిడ్‌ తీవ్రరూపం దాల్చలేదని వైద్యులు భావిస్తున్నారు.  కరోనా వ్యాక్సిన్‌ కోసం భారీ నిధులు సమకూరుస్తున్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సైతం దీన్ని అత్యంత సమర్థమైన చికిత్సగా పేర్కొన్నారు. దీంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరిపిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ రీజెనెరాన్‌ కంపెనీ రూపొందించిన యాంటీబాడీ డ్రగ్‌ అత్యవసర వినియోగానికి అనుమతించింది. వ్యాక్సిన్‌ అందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పలేని ఈ పరిస్థితుల్లో ఈ డ్రగ్‌ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

యాంటీబాడీ డ్రగ్స్‌ ఎలా పనిచేస్తాయి...

ఏదైనా వ్యాధి సోకినప్పుడు దాన్నుంచి రక్షించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే ప్రోటీన్లే యాంటీబాడీలు. అవి వైరస్‌కు అతుక్కుని మానవ కణాల్లోకి చొరబడకుండా అడ్డుకుంటాయి. అయితే, టీకా ఇచ్చినప్పుడు లేదా సహజంగా వ్యాధి సోకినప్పుడు యాంటీబాడీలు విడుదల కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అదే, తాజా డ్రగ్‌లో ప్రయోగశాలల్లో లేదా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేసిన యాంటీబాడీలను వినియోగిస్తున్నారు. ఇవి నేరుగా శరీరంలోకి ఎక్కించడం ద్వారా వైరస్‌పై తక్షణమే ప్రభావం చూపుతాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. 

వ్యాక్సిన్‌, యాంటీబాడీ డ్రగ్స్‌ మధ్య తేడా ఏంటి?

యాంటీబాడీ డ్రగ్స్‌ తక్షణమే వైరస్‌పై పోరాడతాయి. అదే వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని మేల్కోలిపి వైరస్‌ను అంతమొందించేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. దీనికి కాస్త సమయం పడుతుంది.  అలాగే యాంటీబాడీ డ్రగ్స్‌ కేవలం వైరస్‌ సోకిన వారికి చికిత్సగా మాత్రమే వినియోగిస్తారు. అదే వ్యాక్సిన్‌ను వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇస్తారు. 

ఎవరు తయారుచేస్తున్నారు?

ప్రస్తుతం ఈ డ్రగ్స్‌ను అమెరికాకు చెందిన రీజెనెరాన్‌, ఎలీ లిల్లీ అనే సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా కొందిరికి అందజేశారు. అందులో ట్రంప్ ఒకరు. ట్రంప్, బిల్‌ గేట్స్‌ వంటి ప్రముఖుల మద్దతు లభించడంతో వీటిని అత్యవసర వినియోగం కింద బాధితులకు ఇచ్చేందుకు అనుమతించాలని ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోగా.. గతవారం ఎలీ లిల్లీకి.. తాజాగా రీజెనెరాన్‌కు అనుమతులు జారీ చేశారు. 

అమెరికాలో కొవిడ్‌ తీవ్రత నానాటికీ తీవ్రమవుతుండడంతో ఎఫ్‌డీఏ అప్రమత్తమైంది. ప్రయోగదశలో ఉన్న అనేక ఔషధాలు, చికిత్స విధానాలకు ప్రాథమిక ఆధారాలతో అనుమతులిచ్చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా యాంటీబాడీ డ్రగ్‌కు కూడా అనుమతి లభించింది. తక్షణమే మూడు లక్షల మందికి ఇవ్వడానికి సరిపడా ఔషధాలు ఉన్నాయని రీజెనెరాన్‌ ప్రకటించింది.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని