Published : 11 Sep 2021 16:57 IST

Ganesh Chaturthi: సింగపూర్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్‌: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో సింగపూర్‌లో వినాయక చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. వర్చువల్‌గా నిర్వహించిన ఈ వేడుకల్లో మహా సహస్రావధాని, ప్రఖ్యాత కవి పండితులు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  సుమారు గంటన్నర పాటు ఆయన ప్రవచనామృతాన్ని అందించినట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా అందరూ పాడుకునే ఆదిశంకర విరచితమైన "ముదాకరాత్తమోదకం" అనే గణేశ పంచరత్న స్తోత్రానికి ప్రత్యేక అర్థ విశ్లేషణ అందిస్తూ ఆయన ప్రవచించడం అందరికీ ఎంతో జ్ఞానదాయకంగా అనిపించింది. ఆ స్తోత్ర వివరణ ఆధారంగా మధ్యలో ఎన్నో జీవిత మర్మాలను వివరిస్తూ, నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే నైతిక విధానాలను కూడా చక్కటి ఛలోక్తులతో వివరించారు.

వినాయక చవితి పర్వదిన సందర్భంగా భగవంతుని అనుగ్రహంతో పాటు గరికపాటివారి ఆశీస్సులను కూడా పొందడం, 'గణేశ పంచరత్న స్తోత్రం' విశిష్టతను భాష్యాన్ని వారి నుంచి తెలుసుకోగలగడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. సింగపూర్‌లో వివిధ తెలుగు లోగిళ్ళలో కొలువై పూజలందుకున్న వినాయక విగ్రహాలను, అంతర్జాలం ద్వారా అందరూ వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. దీంతో అన్ని దేశాల వారు తమ ఇంటి నుంచే సింగపూర్ వినాయక ప్రతిమల దర్శనాన్ని చేసుకోగలిగారు.

ఈ కార్యక్రమంలో ఇతర నిర్వాహకులు రాధిక మంగిపూడి, భాస్కర్ ఊలపల్లి, చామిరాజు రామాంజనేయులు, సాంకేతిక నిపుణులు గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, సంస్థ సభ్యులు అనంత్ బొమ్మకంటి, వేణు మల్లవరపు, రాజశేఖర్ తంగిరాల, సుబ్బు పాలకుర్తి, సురేష్ చివుకుల తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది  మంది ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్లుగా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈగ జూస్ మొదలైన సంస్థలు సహకారం అందించాయి.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని