Published : 02/11/2020 19:45 IST

దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం

సింగపూర్‌: దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేసిన ‘మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం’ కార్యక్రమానికి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.  సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

తానా, వంగూరి ఫౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సి.పి.బ్రౌన్ తెలుగు సమాఖ్య లండన్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, వేగేశ్న ఫౌండేషన్ వారి సమిష్టి సౌజన్యంతో, కళాప్రపూర్ణ పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా ‘మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం’ అంతర్జాలం వేదికగా నవంబరు 1న అత్యంత వైభవంగా జరిగింది.

కళాబ్రహ్మ వంశీ రామరాజు స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ సభకు దేవులపల్లి వారి మనుమరాళ్ళు రేవతి అడితం, రేఖ సుప్రియ, జ్యోతి ప్రజ్వలన చేసి, తమ తాతగారి జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సాహితీవేత్త కె.వి. రమణ దేవులపల్లి వారి రచనా వైశిష్ట్యం గురించి అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన రాసిన ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ’ పాటకు జాతీయగీతం కావాల్సిన స్థాయి ఉంది’ అన్నారు. సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ ‘దేవులపల్లి వంటి మహానుభావులకు నివాళిగా ఇటువంటి కార్యక్రమం చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవం’ అన్నారు. భారత్‌తో పాటు, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌, సింగపూర్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్, హాంకాంగ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా తదితరదేశాల నుంచి 58 మంది గాయనీ గాయకులు పాల్గొని దేవులపల్లి వారు రచించిన 100 పాటలతో శతగీతార్చన చేశారు.

ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనా గీతం ఆలపించగా దేవులపల్లి వారిపై వీరుభొట్ల హరి శ్రీనివాస్ రచించిన గీతాన్ని బాల సుబ్రహ్మణ్యం పాడిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణశాస్త్రి అభిమానులకు ఈ కార్యక్రమం వీనులవిందు చేసింది. రాధిక మంగిపూడి, సురేఖ మూర్తి, సీతారత్నాకర్, విజయలక్ష్మి, శశికళ తదితరలు కృష్ణశాస్త్రి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి అలరించారు.  సింగపూర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్షర మరో ఇద్దరు చిన్నారులు కలసి ‘నారాయణ నారాయణ’ అనే బృందగానం ఆకట్టుకుంది. సాహితీవేత్త, ప్రముఖ సినీ రచయిత భువనచంద్రకి ‘దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం’ సగౌరవంగా అందజేశారు.

ఈ సందర్భంగా భారత్ నుంచి సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు,  వెన్నెలకంటి, మహాభాష్యం చిత్తరంజన్, వంగూరి చిట్టెన్ రాజు(అమెరికా) , తోటకూర ప్రసాద్, జయశేఖర్, శారద, దేవులపల్లి వారి కుటుంబ సభ్యులు రత్నపాప, కొంచాడ రావు, మధు(ఆస్ట్రేలియా), శ్రీలత(న్యూజిలాండ్) జొన్నలగడ్డ మూర్తి, వి పి కిల్లీ(లండన్), సీతారామరాజు(దక్షిణాఫ్రికా) తదితరులు ప్రసంగించి దేవులపల్లి వారికి నివాళులర్పించి, భువనచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.  రాధిక మంగిపూడి(సింగపూర్), విజయ గొల్లపూడి(ఆస్ట్రేలియా), జయ పీసపాటి(హాంకాంగ్), రాధికా నోరి(అమెరికా)లు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అద్భుతంగా సమన్వయపరిచారు.

 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని