
అమ్మ తోడుగా అగ్రగామిగా!
అగ్రదేశంలో ఉన్నా..నీరాటాండన్ జీవితం వడ్డించిన విస్తరి కాదు... అమ్మనాన్న మధ్య హాయిగా బాల్యం సాగిపోలేదు. ఆర్థికంగా సౌకర్యవంతమైన స్థితి లేదు. దేశంకాని దేశంలో... అడుగడుగునా అడ్డంకులు. అయినా కుంగిపోలేదామె. కష్టపడి తన భవిష్యత్తును నిర్మించుకున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ముఖ్య వ్యూహకర్తల్లో ఒకరుగా మారే అవకాశాన్ని పొందారు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు డైరెక్టర్‌గా ఆమెను బైడెన్ నియమించారు.
ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అనే మేథో సంస్థకు నీరా అధ్యక్షత వహిస్తున్నారు. బైడెన్ బృందంలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు డైరెక్టర్ హోదాలో బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే ఆర్థిక నిపుణులు, సలహాదారులకు నీరా నేతృత్వం వహించనున్నారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈమె ఆరోగ్యవిభాగానికి సంబంధించి సలహాదారురాలిగా బాధ్యతలు వహించారు.
భారతదేశం నుంచి అమెరికా వలస వెళ్లిన మాయాటాండన్ దంపతులకు బోస్టన్, బెడ్ఫోర్డ్లో 1970లో నీరా టాండన్ పుట్టారు. ఉన్నతోభ్యాసం చేసి, రాజకీయరంగంలో అడుగుపెట్టిన ఈమె క్లింటన్, హిల్లరీ క్లింటన్, ఒబామా వంటి ప్రముఖులెందరితోనో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకుని తన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. అయితే ఈమె బాల్యం మాత్రం వడ్డించిన విస్తరికాదు. కుటుంబంలో అందరిమధ్య ప్రేమగా పెరగాల్సిన వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన అయిదోఏటనే తండ్రికి దూరమయ్యారీమె. సోదరుడు రాజ్, తల్లితో మాత్రమే నీరా బాల్యం గడిచింది. భర్త నుంచి దూరమై, ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన నీరా తల్లి మాయా పిల్లలను పెంచడంలో చాలా ఇబ్బందులెదుర్కొంది. ఒంటరి మహిళలకు ప్రభుత్వం అందించే సాయాన్ని పొందుతూ, మరోవైపు ఉద్యోగవేటలో పడింది. అలా రెండేళ్ల తరువాత ట్రావెల్ ఏజెంట్‌గా చేరి పిల్లలను ఉన్నతవిద్య వైపు అడుగులేయించింది. తల్లి పడే ఇబ్బందులను గుర్తించేవారు నీరా. ఇదే ఆమెను బాగా చదువుకోవాలనే లక్ష్యంవైపు నడిపించింది. ఒంటరి తల్లితో ఉండే ఈమె, అక్కడే తానేంటో నిరూపించుకోవాలనుకునేవారు. దూకుడు స్వభావంతో ఉండే నీరా చదువులో కూడా అంతే వేగాన్ని కనబరిచేవారు. తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించడానికి వెనకాడేవారుకాదు. నీరా లాస్ఏంజిల్స్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ డిగ్రీ చేసి, తరువాత యాలే లా స్కూల్లో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత వాషింగ్టన్కు చేరుకున్నారు. డిగ్రీలో ఉన్నప్పుడు పరిచయమైన స్నేహితుడు, రచయిత, విజ్యువల్ ఆర్టిస్ట్ బెంజమిన్ ఎడ్వర్డ్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమెపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. బలమైన వ్యక్తిత్త్వం, అనుకున్నది సాధించడానికి కృషి చేయడం వంటివన్నీ తన తల్లి నుంచే నేర్చుకున్నా అని చెబుతారీమె. ‘అమ్మకు రాజకీయ రంగంతో అంతగా పరిచయం లేకపోయినా నేను వేసే ప్రతి అడుగులో తన ప్రోత్సాహం ఉండేది. నన్ను చూసి గర్వపడుతూ ఉంటుంది. నేను నా జీవితంలో సాధించిన విజయాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. లక్షలాదిమంది మహిళలకి ఆరోగ్యాన్ని అందించే దిశగా నేను చేస్తున్న కృషిని కొనియాడుతుంది. నా చిన్నప్పుడు తను ఓ వైపు ఉద్యోగం చేస్తూ, మా సంరక్షణ చూసుకుంటూనే, స్థానికంగా సొసైటీలో తనవంతు సేవలందించేది. ఆమెను చూస్తూ పెరిగిన నాకు అమ్మే స్ఫూర్తి’ అని చెబుతారు నీరా టాండన్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.