
అమెరికా కలలపై అశనిపాతం
హెచ్-1బీ వీసాలపై మరో మూడు నెలల నిషేధం
ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు మరో అశనిపాతం లాంటి వార్త. హెచ్-1బీ వీసాలపై ఉన్న నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గ్రీన్‌కార్డులు, ఇతర వర్క్ వీసాలపైనా మార్చి 31 వరకూ నిషేధం కొనసాగనుంది. ఆ వీసాలపై గతేడాది ఏప్రిల్, జూన్ మాసాల్లో రెండు దఫాలుగా విధించిన ఆంక్షల గడువు డిసెంబరు 31తో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించేవారు హెచ్-1బీ వీసా స్టాంపింగ్ కోసం మరో మూడు నెలలు వేచిచూడక తప్పదు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రవాసుల మీదా దీని ప్రభావం ఉండబోతోంది. హెచ్-1బీ వీసా రెన్యువల్ చేయించుకోవడంలో వారికి జాప్యం జరిగే పరిస్థితి ఏర్పడింది. అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వీలు కల్పించే హెచ్-1బీ వీసాలపై నిషేధంతో భారతీయులపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఈ వీసాల ద్వారా లక్షల మంది భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా అమెరికా ఉద్యోగ రంగంపై కొవిడ్-19 ప్రభావం ఇంకా కొనసాగుతోందని, తమ దేశ ఉద్యోగుల భద్రత కోసమే వీసాల నిషేధాన్ని పొడిగించామని ట్రంప్ పేర్కొన్నారు. 20 రోజుల్లో గద్దె దిగిపోనున్న సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ విమర్శలు గుప్పించారు. ట్రంప్ వీసా విధానాలు క్రూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించిన బైడెన్, తాను పదవిలోకి వచ్చాక హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.