
బ్రిటన్ ప్రయాణికులకు ‘కొత్త’ మార్గదర్శకాలు
ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపాలి
భారత్‌లో దిగిన తర్వాత పరీక్ష చేయించుకోవాలి
స్పష్టం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
ఈనాడు, దిల్లీ: బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి 30వ తేదీ మధ్య యూకే నుంచి వచ్చే ప్రయాణికులంతా 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దాన్ని న్యూదిల్లీ ఎయిర్పోర్ట్ పోర్టల్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ అప్లోడ్ చేయాలని పేర్కొంది. ప్రయాణికులు బయలుదేరడానికి 72 గంటల ముందు ఆన్లైన్ ద్వారా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం సమర్పించాలని స్పష్టం చేసింది. నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్న వారినే విమానంలోకి ప్రవేశించేలా ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్రిటన్ నుంచి భారత్‌లోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే ప్రయాణికులందరూ సొంత ఖర్చుతో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. పాజిటివ్ తేలిన వారిని వెంటనే ఐసోలేషన్ చేయాలని సూచించింది. ప్రామాణిక నిర్వహణ నిబంధనల (ఎస్ఓపీ) అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని విమానాశ్రయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో నడుస్తున్న సంస్థాగత ఐసోలేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. ఇలాంటి వారి నుంచి తీసుకున్న నమూనాలను జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబ్‌లకు పంపి పరీక్షించాలని సూచించింది. ఒకవేళ వారికి పాత కరోనా వైరస్ రకం సోకినట్లు తేలితే వైరస్ తీవ్రతను బట ప్రస్తుత చికిత్స విధానాలే కొనసాగించాలని పేర్కొంది. యూకే రకం వైరస్ సోకినట్లు వెల్లడైతే మాత్రం ఏకాంతవాసంలో కొనసాగిస్తూనే ఇప్పుడు అమల్లో ఉన్న ప్రొటోకాల్స్ ప్రకారమే చికిత్స చేయాలని తెలిపింది.
మార్గదర్శకాలు...
* ఎయిర్ పోర్టుల్లో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి.
* దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల్లో దిగే బ్రిటన్ విమాన ప్రయాణికుల వివరాలను అక్కడి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాంకి అందించాలి. ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా లభించే ఆన్లైన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లతో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఇచ్చిన సమాచారాన్ని సరి పోల్చుకోవాలి.
* జనవరి 8 నుంచి 30 మధ్య వివిధ ఎయిర్‌పోర్టుల్లో దిగిన ప్రయాణికుల్లో పాజిటివ్‌గా తేలిన వారిని సంస్థాగత క్వారంటెయిన్లో ఉంచి పరీక్షించాలి. ఇలా పాజిటివ్‌గా తేలిన వారి పక్క సీట్లలో కూర్చున్న వారితో పాటు, ముందు, వెనుక మూడు వరుసల్లో కూర్చున్న వారిని కూడా గుర్తించి పరీక్షించాలి.
* ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే ప్రయాణికులెవరైనా ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఉంటే ఆ విషయాన్ని తక్షణం ఆ రాష్ట్ర వైద్య అధికారులకు సమాచారం అందించాలి.
6 నుంచి భారత్ నుంచి బ్రిటన్‌కు విమానాలు
* కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ
దిల్లీ: భారత్ నుంచి బ్రిటన్‌కు విమాన సర్వీసు సేవలు ఈ నెల 6 నుంచి మొదలు కానున్నట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. అదేవిధంగా బ్రిటన్ నుంచి భారత్‌కు ఈ నెల 8 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రతి వారం దాదాపు 30 సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ విమానాలకు సంబంధించిన షెడ్యూల్ జనవరి 23 వరకు వర్తిస్తుందని.. తదుపరి సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ట్విటర్లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.