
20కి ముందే ట్రంప్‌పై వేటు!
కేబినెట్లో మంతనాలు
సొంత పార్టీ నేతల నుంచే అధ్యక్షుడిపై వ్యతిరేకత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్ని త్వరలో వీడనున్న డొనాల్డ్ ట్రంప్... సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అధికార బదిలీపై కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న సమయంలో, క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. దీంతో పదవీ కాలం ముగియడానికి ముందే ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కేబినెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పదవీకాలం ముగియడానికి ముందు ట్రంప్ విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా అమెరికా క్యాపిటల్ భవనంలోకి ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లి, బీభత్సం సృష్టించడాన్ని డెమోక్రాట్లతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తప్పు పడుతున్నారు. అధ్యక్షుని పిలుపుతోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారని ఆరోపిస్తున్నారు. దీంతో పదవి నుంచి ట్రంప్‌ను తొలగించే విషయంలో సాధ్యాసాధ్యాలను కేబినెట్ సభ్యులు పరిశీలిస్తున్నట్టు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.
సాధ్యమేనా?
అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి అభిశంసన తీర్మానం. రెండోది అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికారం. ప్రస్తుతం 25వ సవరణ అధికారంపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం.
భంగపాటు తప్పదా!
కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ ఈనెల 20న బాధ్యతలు చేపడతారు. ఆయన గెలుపును అడ్డుకునేందుకు ట్రంప్ చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో... బైడెన్ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్ నేతల మద్దతు కూటగట్టే ప్రయత్నం చేశారు. కానీ, అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఈ తరుణంలోనే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేయడంతో ఆయనపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. దీంతో జనవరి 20 కంటే ముందే ఆయనను పదవి నుంచి తొలగించాలని కేబినెట్ మంతనాలు జరుపుతోంది.
అభిశంసన ఎలా?
అధ్యక్షుడిని తొలగించేందుకు మార్గం... అభిశంసన తీర్మానం. నిజానికి ఈ అవకాశం కాంగ్రెస్ ప్రతినిధుల సభకు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు దుశ్చర్యలకు, నేరాలకు పాల్పడినప్పుడు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. సాధారణ మెజార్టీతో ఈ తీర్మానం నెగ్గితే దాన్ని ఎగువసభకు పంపుతారు. అక్కడ అధ్యక్షుడి తప్పిదంపై విచారణ జరుగుతుంది.ఆ తర్వాత సెనెట్‌లో 2/3 వంతు మెజార్టీతో అధ్యక్షుడిని తొలగించొచ్చు. ఇదంతా ఒక్క రోజులోనే జరగొచ్చు.
ట్రంప్‌పై గతంలోనూ..
2019లో ట్రంప్‌పై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం చేశారు. జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్‌పై దర్యాప్తు జరపాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారంటూ దిగువ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డెమొక్రాట్ల బలం ఎక్కువగా ఉండటంతో అక్కడ అభిశంసన నెగ్గింది. అయితే, 2020 ఫిబ్రవరిలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్న సెనేట్‌లో ట్రంప్ నిర్దోషిగా తేలడంతో అభిశంసన వీగిపోయింది.
ఏమిటీ 25వ సవరణ?
1963లో అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణ తీసుకొచ్చారు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, పదవిని స్వచ్ఛందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని అమలు చేయవచ్చు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించే స్థితిలో లేరంటూ ఉపాధ్యక్షుడు, మెజార్టీ కేబినెట్ నిర్ణయించడం ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే వీలుంటుంది.
విధ్వంస కారకుడు డొనాల్డ్‌ను సాగనంపాల్సిందే: అమెరికా మీడియా
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన దేశద్రోహ వ్యాఖ్యలే క్యాపిటల్ భవనంపై దాడికి పురిగొల్పాయని స్థానిక మీడియా విమర్శించింది. దేశానికి ఆయన ఒక పెద్ద బెడద అని, పదవిలో కొనసాగడానికి అనర్హుడని పేర్కొంది. ఆయనను తక్షణం తొలగించాలంది. ఆయన ఉద్వాసనకు చర్యలు ప్రారంభించడం లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను మొదలుపెట్టడం ద్వారా.. జరిగిన విధ్వంసానికి ఆయనను బాధ్యుడిని చేయాలని కోరింది. హింసకు దిగిన ట్రంప్ అనుచరులపై కూడా చర్యలు చేపట్టాలని ‘ద న్యూయార్క్ టైమ్స్’ తన సంపాదకీయంలో పేర్కొంది. ఈ దాడిపై ముందస్తు సంకేతాలు ఉన్నప్పటికీ పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టడంతో విఫలమైన క్యాపిటల్ పోలీసుల తీరుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. తాజా దాడికి పురిగొల్పింది ట్రంపేనని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తన సంపాదకీయంలో రాసింది. ఈ దేశద్రోహ చర్యకు పూర్తి బాధ్యత ఆయనదేనని పేర్కొంది.
ట్రంపరి తనానికి మైక్ పెన్స్ చెక్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా వ్యవహరిస్తుంటే.. ఆయన పార్టీకే చెందిన సహచరుడు, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం తిరుగులేని నైతిక విలువలతో తన నిబద్ధతను చాటుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరులూదారు. బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడానికి బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ సమావేశానికి ఉపాధ్యక్షుడి హోదాలో పెన్స్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల ఫలితాలను తిరస్కరించే అధికారం పెన్స్‌కు ఉందంటూ ట్రంప్ సమావేశానికి ముందే ట్వీట్ చేశారు. అందుకు సంబంధించి సరైన చర్య తీసుకోవాలంటూ పెన్స్‌కు పరోక్షంగా సూచించారు. కానీ పెన్స్ మాత్రం తన ఆత్మసాక్షికే కట్టుబడ్డారు. కాంగ్రెస్ సభ్యులకు ఆయన రాసిన లేఖతో అది స్పష్టమైంది. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆ ఫలితాలను తిరస్కరించాలని కొందరు సూచించారు. అభ్యంతరాలపై తగిన సాక్ష్యాధారాలను సమర్పించే చట్టబద్ధమైన హక్కును నేను గౌరవిస్తాను. అయితే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి హోదాలో రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తానని ప్రమాణం చేశాను. ప్రజాస్వామ్య విధానంలో నమోదైన ఎలక్టోరల్ ఓట్లను తిరస్కరించే అధికారం నాకు లేదు. అందుకే వారి అభ్యర్థనను నేను అమోదించకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ పెన్స్ ఆ లేఖలో స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో డెమొక్రాట్లదే ఆధిపత్యం!
అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది! జార్జియా సెనెట్ ఎన్నికల్లో ఇప్పటికే ఓ సీటును గెలుచుకున్న డెమొక్రాట్లు తాజా ఫలితాల్లో మరో సీటును కైవశం చేసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి మద్దతుదారు, గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్న 71 ఏళ్ల రిపబ్లికన్ డేవిడ్ పెర్డ్యూను... డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 33 ఏళ్ల జాన్ ఓసోఫ్ ఓడించారు. ఇంతకుముందు రిపబ్లికన్ సెన్ కెల్లీ లోయ్ఫ్లర్పై డెమొక్రాట్ రాఫెల్ వార్నోక్ విజయం సాధించారు. ఓసోఫ్ విజయంతో 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ఉభయ పార్టీలకు 50-50 సీట్లు వచ్చాయి. ఓటింగ్ సందర్భంగా ఎటూ తేలని పరిస్థితుల్లో... కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సెనెట్ ఛైర్పర్సన్ హోదాలో తన నిర్ణాయక ఓటును డెమొక్రాట్లకు వేయవచ్చు. దీంతో ఇప్పటికే ప్రతినిధుల సభలో మెజార్టీ బలమున్న డెమొక్రాట్లకు ఇక కాంగ్రెస్‌లో పూర్తి ఆధిపత్యం లభించనుంది.