Updated : 10 Jan 2021 11:58 IST

బ్రాండ్‌ ఇండియాను ప్రోత్సహించండి

మన టీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది
అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్నీ ఆసక్తిగా గమనిస్తోంది
‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రోత్సహించడంలో కీలకభూమిక వహించండి
ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ

దిల్లీ: అంతర్జాతీయ ఔషధ రంగంలో అద్వితీయంగా నిలిచిన భారత దేశం ..కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి మానవాళిని రక్షించుకోవడానికి స్థానికంగా ఉత్పత్తిచేసిన రెండు టీకాలతో సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ టీకాల కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూడడంతో పాటు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మన దేశం ఎలా నిర్వహించబోతుందా అని ఆసక్తితో గమనిస్తోందన్నారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సునుద్దేశించి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ప్రజాస్వామ్య భారత్‌ సమైక్యంగా మనుగడ సాగించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు. ఇప్పుడు ప్రపంచంలో మరెక్కడాలేనంతగా మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా, సచేతనంగా ఉందని పేర్కొన్నారు. సాధ్యమైనంత ఎక్కువగా భారత్‌ తయారీ ఉత్పత్తులను వినియోగించాలని ఎన్‌ఆర్‌ఐలకు ప్రధాని సూచించారు. తద్వారా మన చుట్టూ ఉండే వారిలోనూ దేశీయ ఉత్పత్తుల వాడకంపై విశ్వాసం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా పురోగమిస్తున్నామని, ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహించాలని కోరారు. కరోనాపై పోరును వివరిస్తూ...మరణాల రేటు తక్కువగానూ వైరస్‌ సోకిన తర్వాత కోలుకున్న వారు అత్యధికంగానూ ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం మన దేశం ప్రపంచ ఆర్థిక రంగంలో న్యాయబద్ధమైన పాత్రను సాధించేందుకేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న అంతరాయాలను తొలగించి.. వస్తువులు, సేవలను మరింతగా అందుబాటులోకి తెస్తుందని వివరించారు.


తక్కువ ధరకే టీకా: హర్షవర్దన్‌

ప్రపంచంలో మరెక్కడా లభించనంత తక్కువ ధరకే, ప్రభావవంతమైన టీకాలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సులో  తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం కీలక భూమిక వహించేలా చేసేందుకు జరుగుతున్న యత్నాల్లో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ కోరారు.


30 మందికి అవార్డులు

ఈ ఏడాది ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులను 30 మందికి ప్రదానం చేశారు. వీరిలో సురీనాం అధ్యక్షుడు చంద్రికాపెర్సాద్‌ సంతోఖి, క్యురసావో ప్రధాని యుజెన్‌ రుగ్‌నాథ్‌, న్యూజిలాండ్‌ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌, ముఖేశ్‌ అఘి(యూఎస్‌-ఇండియా స్ట్రాటెజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌ సీఈవో),  ప్రొఫెసర్‌ మురళీధర్‌ మిర్యాల(జపాన్‌), సుధాకర్‌ జొన్నలగడ్డ(యుఎస్‌) తదితరులు ఉన్నారు.Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని