Updated : 21/01/2021 05:13 IST

భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలో బైడెన్‌ సర్కారు కొలువుదీరడంతోనే భారతీయ వృత్తి నిపుణులకు మేలుచేసే చర్యలు చేపట్టనుంది! అమెరికా సంస్థల్లో పనిచేసే విదేశీయులకు గ్రీన్‌కార్డులను జారీచేసే విషయంలో... ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న పరిమితులను ఎత్తివేయనుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర వలస బిల్లును కాంగ్రెస్‌ ఆమోదం కోసం పంపనుంది. ఇది అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయ ఐటీ తదితర వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం సుసాధ్యమైనట్టే!
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బైడెన్‌ ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే... వలస వ్యవస్థను సంస్కరిస్తామని, వీసా నిబంధనలను సరళతరం చేస్తామని, తద్వారా శాశ్వత నివాసం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని అందులో పేర్కొన్నారు.
‘‘వృత్తి నిపుణులకు, ప్రత్యేక ఉద్యోగులకు తాత్కాలిక వీసాలను జారీచేసే వ్యవస్థను సంస్కరించేందుకూ... వారి ఉపాధి, వేతనాలకు భద్రత కల్పించేందుకూ... గ్రీన్‌కార్డుల జారీలో విదేశాలపై ఉన్న పరిమితులను తొలగించేందుకూ బైడెన్‌ సానుకూలంగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే- వలస వ్యవస్థను ఆధునికీకరిస్తూ కొత్త ప్రభుత్వం ‘యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ యాక్ట్‌-2021’ను తీసుకొస్తోంది’’ అని శ్వేతసౌధం అధికారులు బుధవారం వెల్లడించారు.
ఈ బిల్లుతో ప్రయోజనమేంటి?
ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వీలు కల్పించడం, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సరిహద్దులను బాధ్యతాయుతంగా నిర్వహించడం, మధ్య ఆఫ్రికా నుంచి వలసలకు దారితీస్తున్న పరిస్థితులను చక్కదిద్దడం, హింసను   తప్పించుకోవడానికి వచ్చేవారికి ఆశ్రయం కల్పించడం వంటి అంశాలకు ఈ బిల్లులో ప్రాధాన్యమిచ్చారు.
* అమెరికాలోనే పనిచేస్తూ, అమెరికాలోనే జీవనం సాగిస్తున్నవారికి పౌరసత్వ మంజూరును సులభతరం చేస్తారు.
* ఇకపై వీసాల కోసం దీర్ఘకాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.
* అనధికారికంగా ఏళ్ల తరబడి అమెరికాలోనే ఉంటున్నవారి పౌరసత్వ సమస్యలకూ ఈ బిల్లు పరిష్కారం చూపనుంది.
* అమెరికా విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) కోర్సులను పూర్తిచేసే విదేశీ విద్యార్థులు... ఆ తర్వాత కూడా దేశంలోనే ఉండేందుకు వీలు కల్పిస్తుంది.
* తక్కువ వేతనాలుండే రంగాల ఉద్యోగులూ గ్రీన్‌కార్డు అందుకోవడం సులభమవుతుంది.
తొలిరోజే 15 కార్యనిర్వాహక ఆదేశాలు
అమెరికా 46వ అధ్యక్షునిగా ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే... కీలకమైన 15 కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్‌ సంతకం చేయనున్నారు. వీటిలో చాలామటుకు ట్రంప్‌ సర్కారు నిర్ణయాలను నిలుపుదల చేస్తూ తీసుకున్నవే.
* పారిస్‌ వాతావరణ ఒప్పందంలో అమెరికాను మళ్లీ భాగస్వామ్యం చేయడం. కాలుష్య నియంత్రణకు చర్యలు, ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఆమోదం.
* కరోనా మహమ్మారి నియంత్రణకు కీలక చర్యలు. పౌరులంతా వంద రోజుల పాటు తప్పనిసరిగా మాస్కును ధరించడం, దూరం పాటించేలా నిబంధనలు. మహమ్మారి స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యక్షునికి సమాచారం అందించేలా ‘కొవిడ్‌-19 రెస్పాన్స్‌ కోఆర్డినేటర్‌’ పోస్టును సృష్టిస్తూ నిర్ణయం.
* ముస్లిం దేశాల నుంచి వలసలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేయడం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలగుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం నిలిపివేత. సాంక్రమిక వ్యాధుల ఆంటోనీ ఫౌసీ నేతృత్వంలోని బృందం డబ్ల్యూహెచ్‌వో సమావేశాలకు ప్రాతినిధ్యం వహించడం.
* జాతి వివక్ష నిర్మూలన దిశగా... బ్లాక్‌, లాటినో, నేటివ్‌, ఏషియన్‌, పసిఫిక్‌ ద్వీపాల, ఎల్‌జీబీటీక్యూ, మతపరమైన మైనార్టీ వ్యక్తులకు సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వు.
* మెక్సికో గోడ నిర్మాణం నిమిత్తం నిధుల సమీకరణకు ట్రంప్‌ సర్కారు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ నిలిపివేత.
* బాల్యంలోనే అమెరికాకు వలస వచ్చి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వం కల్పించడం.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని