Updated : 08 Feb 2021 10:46 IST

ప్రవాసీ.. పల్లెపై ముద్రేసీ

సంపాదించిన సొమ్ములో కొంత భాగం సమాజసేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన కొందరు ప్రవాస భారతీయులు. జన్మ భూమిపై మమకారంతో తాము చదువుకున్న పాఠశాలల్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు తమ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. అలాంటి వారిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

విద్యాభివృద్ధికి రూ.5 కోట్లు

ఘంటసాల,  న్యూస్‌టుడే :ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయుడు గొర్రెపాటి రంగనాథబాబు అప్పట్లోనే ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివి వ్యాపార రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సొంతూరులోని ప్రతిభ గల పేద విద్యార్థులకు తోడ్పడాలనే ఆశయంతో తల్లిదండ్రులైన గొర్రెపాటి వెంకట్రాయులు-ఉదయభాస్కరమ్మ పేరిట 1987లో గొర్రెపాటి విద్యాట్రస్టు నెలకొల్పి ఘంటసాల జడ్పీ పాఠశాల, చల్లపల్లి విజయ అకాడమి హైస్కూల్‌లో పదో తరగతి చదివే 20 మంది ప్రతిభ గల పేద విద్యార్థులను ఏటా ఎంపిక చేసి వారికి పీజీ వరకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉపకార వేతనాలను మూడు దశాబ్దాలుగా ఇంతవరకూ రూ.76 లక్షలు అందజేశారు. 

సాగునీటి సంరక్షణకు రూ.50 లక్షలు.. ఘంటసాల పరిసర ప్రాంతాల రైతులు సాగునీరు అందక అష్టకష్టాలు పడేవారు. రైతుల అభ్యర్థనతో గుండేరు నుంచి వృథాగా సముద్రంలోకి పోయే నీటిని ఆపి సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా రూ.50 లక్షల విరాళం అందజేశారు. దానికి తోడు 2007లో అప్పటి ప్రభుత్వం రూ.67లక్షలు మంజూరు చేసింది. లక్ష్మీపురం కేసీపీ, రైతుల భాగస్వామ్యం కలిపి రూ.1.25 కోట్లతో బెడ్‌రెగ్యులేటర్‌ నిర్మించారు. దీంతో ఘంటసాల, చల్లపల్లి మండలాల గుండేరు ఆయకట్టు దాదాపు 13,000 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందుతోంది. 

బుద్ధవిహార్‌కు 2 ఎకరాల భూరి విరాళం.. తను జన్మించిన ప్రాచీన శైవ, బౌద్ధ చరిత్ర కలిగిన ఘంటసాలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు గ్రామంలో తనకున్న 4 ఎకరాల్లో రూ.కోటి విలువ చేసే 2 ఎకరాల పొలాన్ని 2017లో పర్యాటక శాఖకు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగించారు. అందులో బుద్ధ విహార్‌ నిర్మాణంలో భాగంగా 100 అడుగుల శయన బుద్ధుని విగ్రహాన్ని 60 అడుగుల ఎత్తులో నిర్మించేందుకు కృషి చేశారు. అప్పటి ప్రభుత్వం బుద్ధ విహార్‌ నిర్మాణానికి రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఘంటసాల తదితర ప్రాంతాల్లో పాఠశాలలు, సామాజిక భవనాలు, పేదలకు ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందజేశారు.

రూ.50 లక్షలతోమౌలిక సౌకర్యాలు

కూచిపూడి, న్యూస్‌టుడే: మొవ్వ గ్రామానికి చెందిన ప్రవాసభారతీయుడు దివంగత మండవ బాబూరావు (యూఎస్‌ఏ) సొంత గ్రామం అభివృద్ధికి దాదాపు రూ.50 లక్షల సహకారం అందించారు. తొలిగా 2003లో రూ.3 లక్షల కాంట్రిబ్యూషన్‌ బాబూరావు చెల్లించగా ప్రభుత్వం అందించిన నిధులతో మండవ కనకయ్య, సీతారత్నం పంచాయతీ సముదాయం నిర్మించారు. అనంతరం మరో రూ.13 లక్షలతో మండవ సీతారామబ్రహ్మం పంచాయతీ దుకాణ సముదాయం, అనంతరం రూ.8 లక్షలతో సీతారత్నం కాంప్లెక్స్‌ నిర్మించారు. దాని ద్వారా పంచాయతీకి ఏటా రూ.18 లక్షల ఆదాయం వస్తోంది. గ్రామంలో మండవ కనకయ్య జిడ్పీ పాఠశాల భవన సముదాయానికి, సైన్స్‌ ల్యాబ్‌ అభివృద్దికి, కార్పస్‌ ఫండ్‌గా దాదాపు రూ.10 లక్షలు అందించారు. గ్రామంలో మసీదు, రామాలయం అభివృద్ధికి రూ.1.50 లక్షలు, పేదలకు వ్యక్తిగత సాయం కలపి దాదాపు రూ.50 లక్షలకుపైగా సహాయం చేశారు. 

సొంతఊరికి కొంత మేలు

మైలవరం, న్యూస్‌టుడే: మైలవరం మండలం వెల్వడంకి చెందిన లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆయన సోదరులు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. సొంతూరిపై మమకారంతో రెండు దశాబ్దాలుగా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు, అభివృద్ధి పనులు నిర్వహించారు. దశాబ్దం కిందటే సొంత నిధులతో గ్రామంలో సీసీ రహదారులు వేయించారు. ఆలయాలను అభివృద్ధి చేశారు. గత ఏడాది కాలంగా హనిమిరెడ్డి ప్రభుత్వ నిధులకు తోడు తన సొంత నిధులు రూ.1 కోటి వెచ్చించి గ్రామంలో అధునాతన రెవెన్యూ కార్యాలయంతో పాటు, మురుగు కాల్వలపై దిమ్మెలు కట్టించారు. గ్రామ ప్రధాన కూడలిలో బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలోని వందలాది మంది పేదలకు పింఛన్లు, ఏటా వృద్ధులకు నూతన వస్త్రాలను వితరణగా అందజేస్తున్నారు.

తండ్రి పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి

ఘంటసాల, న్యూస్‌టుడేసామాన్య రైతు కుటుంబంలో పుట్టి అమెరికాలో ప్రముఖ వైద్యునిగా స్థిరపడ్డారు డాక్టర్‌ పిన్నమనేని లెనిన్, డాక్టర్‌ కవిత దంపతులు. ఘంటసాల మండలం చినకళ్లేపల్లిలో రైతు వెంకయ్య-నాగమల్లి కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు లెనిన్, అతని భార్య విజయవాడకు చెందిన కవిత గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పట్టాలు పొందారు. తను చదువు కున్న పాఠశాలలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో తండ్రి పేరుతో పిన్నమనేని వెంకయ్య మెమోరియల్‌ ట్రస్టు ఏర్పాటు చేశారు. 1997లో గోగినేనిపాలెంలో రూ.4 లక్షల వితరణ, అప్పటి ప్రభుత్వం నిధులు రూ.6 లక్షలతో జడ్పీ పాఠశాలలో 5 తరగతి గదుల సముదాయాన్ని నిర్మించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి 2012లో రూ.9.67 లక్షలు శ్రీకాకుళం ఆంధ్రాబ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో ఎనిమిదేళ్లుగా ఏటా పదో తరగతిలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఆరుగురికి రూ.10,000 చొప్పున అయిదేళ్లపాటు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ఆరేళ్ల క్రితం జడ్పీ పాఠశాల భవనం శ్లాబు శిథిలమైతే రూ.6 లక్షలతో పాఠశాలలో 5 తరగతి గదుల శ్లాబును నూతనంగా నిర్మించారు. విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం కోసం పాఠశాలకు రూ.లక్ష విలువ చేసే కంప్యూటర్‌ అందజేశారు. మూడేళ్లుగా కంప్యూటర్‌ విద్య నేర్పే ఉపాధ్యాయినికి నెలకు రూ.6,000 చొప్పున గౌరవ వేతనం అందజేస్తున్నారు. చందర్లపాడులో తను పదో తరగతి చదివిన జడ్పీ పాఠశాల అభివృద్ధికి రూ.50,000 విరాళం అందజేశారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో హీల్‌ ప్యారడైజ్‌ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌గా ఉన్న లెనిన్‌ గోగినేని జడ్పీ పాఠశాలను 2018లో దత్తత తీసుకొని 6 నుంచి 10 తరగతి చదివే విద్యార్థులకు దుస్తులు, రాత పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌లతోపాటు రూ.10,000 విలువ గల ఆట పరికరాలు అందజేశారు.

పాఠశాల భవనానికి రూ.72 లక్షలు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉంగుటూరులోని జడ్పీ ఉన్నత పాఠశాల ను 1946లో స్థాపించారు. అక్కడ చదివిన ఉంగుటూరు, గన్నవరం పరిసర ప్రాంత విద్యార్థులు ఎంతో మంది దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారిలో బొబ్బా వెంకటాద్రి ఒకరు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వెంకటాద్రి.. తను చదివిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో  రూ.72 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దాంతోపాటు ఎస్‌ఎస్‌ఏ, ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు సుమారు రూ.48 లక్షలతో పనులు ప్రారంభమయ్యే సమయానికి కరోనా లాక్‌డౌన్‌ రావడంతో కొంత జాప్యం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పాఠశాలలో 270 మంది విద్యార్థులు చదువుతుండగా వారి తాగునీటి అవసరత దృష్ట్యా దిఫర్‌గాటెన్‌ ఇంటర్నేషనల్‌-యూఎస్‌ఏ, కుటుంబ సభ్యుల పేరుతో సురక్షత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు.  

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని