Updated : 29 Mar 2021 07:14 IST

ప్రవాసుల వెతలు తీరేదెన్నడు?

గల్ఫ్‌ కార్మికుల అగచాట్లు

ల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయ కార్మికుల కోసం జారీ చేసిన కనీస సిఫార్సు వేతనాల విధానాన్ని పునస్సమీక్షించేది లేదని- కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ ఇటీవల లోక్‌సభలో చెప్పిన సమాధానం లక్షలాది కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీరని వేదన కలిగించింది. ఆరు నెలల క్రితం కేంద్రం ఏకపక్షంగా జారీ చేసిన కనీస వేతనాల ఉత్తర్వులతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, బహరైన్‌ దేశాల్లో ప్రవాసులైన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. గల్ఫ్‌ దేశాలు భారత్‌కు చెందిన శ్రమజీవులకు అయిదు దశాబ్దాలుగా ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి లేమి, కరవు కాటకాలతో తల్లడిల్లే వారికి అక్కడ ఆసరా లభించింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాలు ఉన్నత విద్యావంతులను ఆకర్షించగా... ఎలాంటి విద్యార్హతలు,  నైపుణ్యాలు లేకపోయినా అక్కడ పనిచేసే అవకాశం ఉండటం సానుకూలంగా మారింది. రూపాయి మారక విలువ గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువగా ఉండటంతో మంచి వేతనాలు లభిస్తాయనే ఆశతో లక్షల మంది వలస వెళ్లారు. సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి వీసా, పాస్‌పోర్టులు తప్పనిసరి. కంపెనీల తరపున వీసాలు వస్తేనే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సందర్శక, పర్యాటక వీసాలను అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లోనూ కొందరు కార్మికులను గల్ఫ్‌కు పంపుతున్నారు.

తీవ్రమైన శ్రమ దోపిడి
గల్ఫ్‌లోని భారతీయ కార్మికులు ఆది నుంచి శ్రమదోపిడికి గురవుతున్నారు. చట్టాలు సైతం ఆయా దేశాల పౌరులకు ఒక రకంగా, ప్రవాసులకు మరో రకంగా ఉన్నాయి. ఏ కార్మికుడికైనా రోజువారీ లేదా నెలవారీ వేతనాలు ఇవ్వాలి. గల్ఫ్‌ దేశాల్లో ఇది అమలు జరగడం లేదు. ఏజెంట్లు- కంపెనీలతో కుమ్మక్కై అతి తక్కువ వేతనాలకు కార్మికులను పంపిస్తున్నారు. స్థిరమైన ఉద్యోగాలూ లభించడం లేదు. ఉద్యోగ భద్రత గగనమే. కంపెనీ వీసాలు కాకుండా... సందర్శక వీసాలపై వచ్చిన వారికి గడువు తీరాక కష్టాలు మొదలవుతున్నాయి. కంపెనీలు స్వార్థ ప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నాయి. వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని అతి తక్కువ వేతనాలు ఇస్తూ పనులు చేయించుకొంటున్నాయి. మరి కొన్ని కంపెనీలు వేతనాలివ్వడంలో నెలల తరబడి జాప్యం చేస్తున్నాయి. ఎక్కువ వేతనాలు అడిగితే వేధిస్తున్నాయి. వీసాలు, పాస్‌పోర్ట్‌లు లేకుండా అక్రమంగా ఉన్నారంటూ- ప్రవాస భారతీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసి జైళ్లకు పంపిస్తున్నాయి. పదేళ్లుగా ఏటా సగటున 12 వేల మందికి పైగా జైళ్లలోనే ఉంటున్నారు. జరిమానాలను పెద్దయెత్తున చెల్లించాల్సి వస్తోంది. పస్తులుండటం, మానసిక, శారీరక సమస్యల వల్ల ఏటా అయిదు లక్షల మందికి పైగా అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం రెండున్నర వేల మందికి పైగా భారతీయ కార్మికులు ఆయా దేశాల్లో మరణిస్తున్నారు. మొదట్లో కార్మికులు తమ కుటుంబాలకు డబ్బులను గల్ఫ్‌ దేశాల నుంచి పంపించే వారు. ఇప్పుడు వారికే ఇక్కడి నుంచి డబ్బు పంపాల్సిన దుస్థితి నెలకొంది. మన దేశం నుంచి కార్మికులు రుసుములు చెల్లించి, విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నా... గల్ఫ్‌లో వారి నమోదు ప్రక్రియ జరగడం లేదు. అక్కడ వారికి బీమా లేదు. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటే భయం. ఆయా దేశాల్లోని రాజధాని నగరాల్లోనే రాయబార కార్యాలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాల కార్మికులు రాయబార కార్యాలయాలకు వెళ్లితే అక్కడ భాషాసమస్యలు ఎదురవుతున్నాయి తప్ప బాధలు తీరడం లేదు. 

ఉత్తర్వులపై నిరసనలు
భారత ప్రభుత్వం గతంలో జారీ చేసిన కనీస వేతన ఉత్తర్వులు వికటించి, కార్మికులను మరింత ఇబ్బందులకు గురిచేయడంపై- దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై కార్మిక సంఘాలతోపాటు, ప్రవాసుల కుటుంబాలు సైతం ఆందోళన చేశాయి. తెలంగాణ ప్రవాస వ్యవహారాల మంత్రి కేటీ రామారావు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సమస్య తీవ్రతపై కేంద్రానికి లేఖ రాశారు. పార్లమెంటులోనూ దీన్ని పలు పార్టీల ఎంపీలు ప్రస్తావించారు. ఈ తరుణంలో కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందని భావించినా- అలాంటిదేమీ కనిపించడంలేదు. వేతనాల విధానంలో మార్పుల ప్రసక్తే లేదని కేంద్రమంత్రి లోక్‌సభలో స్పష్టం చేయడం అందరికీ అశనిపాతమయింది. గల్ఫ్‌లో కరోనా అనంతర పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో కార్మికుల జీవితాలు దయనీయంగా మారాయి. కార్మికుల తొలగింపు ప్రక్రియలూ ప్రారంభమయ్యాయి. కార్మికులు సమస్యల్లో ఉండి, విమాన టికెట్లు కొనడానికి డబ్బుల్లేక విదేశాల్లోనే ఉండిపోతున్నారు. వేతనాలు తగ్గడంతో సెప్టెంబరు నుంచి చాలా మంది స్వదేశాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కరవై, జీవితాలు దుర్లభంగా మారి దాదాపు 25 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇందులో ఎనిమిది లక్షల మంది తెలుగు రాష్ట్రాల వారు. ప్రవాస కార్మికుల పొట్టగొట్టే విధానాలు ఏ మాత్రం శ్రేయస్కరం కావు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. వేతనాల ఉత్తర్వులను వెంటనే సవరించాలి. దీని కోసం అవసరమయితే నిపుణుల బృందాన్ని నియమించాలి. ఉత్తర్వుల మార్పిడిపై ఆరు దేశాలతో కూడిన గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ)ని ఒప్పించడం సాధ్యం కాదనుకుంటే వారందరినీ స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నించాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక విధానం అమలు చేయాలి.

అధ్యయనం లేని నిర్ణయాలతో అనర్థం

రు గల్ఫ్‌ దేశాల్లోని రాయబార కార్యాలయాలకు ఏటా 15 వేలకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో అధికశాతం వేతనాల చెల్లింపులకు సంబంధించినవే. ఇందులో పరిష్కారమవుతున్నవి అయిదు శాతం కంటే తక్కువే. వేతన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, ఎంపీల నుంచి కేంద్రానికి ఎన్నోసార్లు ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం గల్ఫ్‌ దేశాలతో సంప్రతింపులు జరిపి- గత ఏడాది సెప్టెంబరు 9, 21వ తేదీల్లో కనీస సిఫార్సు వేతనాలపై రెండు ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలోని కనీస వేతనాల ప్రాతిపదికన గల్ఫ్‌ దేశాల్లోని కార్మికులకు ఈ ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి గల్ఫ్‌లో పరిస్థితులు వేరు. వాటిని అధ్యయనం చేసి, ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. రాయబార కార్యాలయాలను సైతం సంప్రదించకుండానే నేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. అవి అక్కడి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపాయి. అప్పటి వరకు ప్రవాసులైన కార్మికులను వేధిస్తున్న గల్ఫ్‌ కంపెనీల యాజమాన్యాలకు- ఆ ఉత్తర్వులు మరింత ఊతమిచ్చినట్లయింది. కార్మికుల వేతనాలు 30శాతం నుంచి 50శాతం తగ్గాయి.

- ఆకారపు మల్లేశం

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని