
మిర్యాలగూడ వాసికి అమెరికాలో అరుదైన గౌరవం
కామ్స్కోప్ సంస్థ సీఐవోగా ప్రవీణ్
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: నెట్వర్కింగ్లో వైర్లెస్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సౌకర్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తున్న కామ్స్కోప్ సంస్థకు సీఐవో (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)గా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్ (45) నియమితులయ్యారు. గత 12 ఏళ్లకాలంలో ఆయన సంస్థలో డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. కామ్స్కోప్లో 50 మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యుడిగా ఉండటంతో సీఐవోగా అరుదైన గౌరవం లభించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక ప్రచురించింది. మిర్యాలగూడ మండలం గూడూరుకు చెందిన జొన్నలగడ్డ రంగారెడ్డి, విమలాదేవి దంపతుల సంతానం ప్రవీణ్. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, మిర్యాలగూడ ఎయిడెడ్ కళాశాలలో బీఎస్సీ(గణితం) చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2001లో అక్కడే కృత్రిమ మేథలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఎనిమిదేళ్లపాటు వేర్వేరు సంస్థల్లో పనిచేసిన ఆయన 12 ఏళ్ల కిందట కామ్స్కోప్లో చేరారు. అమెరికాలోని 250 ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్స్కోప్ సంస్థలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ తన శ్రమకు తగ్గ గుర్తింపు లభించిందన్నారు. సాంకేతిక ఆవిష్కరణలో మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.