
ప్రతిభ చాటిన సింగపూర్ తెలుగు కవులు
సింగపూర్: ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా ‘తానా’ వారు ‘ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్‌కు చెందిన ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ తరపున పాల్గొన్న తెలుగు కవులు తమ ప్రతిభను చాటారు. చక్కటి కవితలతో, ఛందోబద్ధమైన పద్యాలతో, గేయాలతో ప్రేక్షకులందరినీ అలరించారు. రాధిక మంగిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని, సింగపూర్ తెలుగు కవులకు తనవంతు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వారు రచించిన ఒక పాటను స్వరపరిచి పాడి వినిపించడం అందరినీ అలరించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్య ధనుంజయ్ విశిష్ట అతిథిగా పాల్గొని కవులకు తమ విలువైన అభినందనలను అందించారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంలో తమ సంస్థ, సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్, చిగురుమళ్ళ శ్రీనివాస్, తోటకూర ప్రసాద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇటువంటి కార్యక్రమాలు ప్రవాసాంధ్ర రచయితలలో నూతనోత్సాహాన్ని నింపి తెలుగు సాహిత్య పరంపర కొనసాగేందుకు దోహదం చేస్తాయని ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ నిర్వాహక వర్గం పేర్కొంది. కవులుగా రాధాకృష్ణ రేగళ్ళ, గుడిదేని వీరభద్రయ్య, ఓరుగంటి రోజా రమణి, సుబ్బు వి.పాలకుర్తి, యడవల్లి శేషు కుమారి, ఊలపల్లి భాస్కర్, మల్లవరపు వేణుమాధవ్, శైలజ శశి ఇందుర్తి, శ్రీనివాస్ జాలిగామలు పాల్గొన్నారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా. eRemit (శ్రీహరి శిఖాకొల్లు), గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్థిక సమన్వయం అందించారు.