Published : 20 May 2021 20:26 IST

శాస్త్రీయ కళలకు అండగా సిలికానాంధ్ర ‘సంపద’

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాల్లో నివసిస్తూ కర్ణాటక, హిందుస్థానీ సంగీతంతో పాటు శాస్త్రీయ నృత్య కళలైన కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతన్న విద్యార్థులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరీక్షలు నిర్వహించి అకడమిక్ క్రెడిట్స్‌తో జూనియర్, సీనియర్‌ సర్టిఫికెట్స్‌ అందిస్తోంది సంపద (SAMPADA- Silicon Andhra Music Performing Arts and Dance Academy). ఆయా కోర్సుల్లో శిక్షణ పొందుతూ ‘సంపద’లో నమోదు చేసుకున్నవారికి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మార్చి-ఏప్రిల్‌ నెలల్లో పరీక్షలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ పరీక్షలు జరిపారు. సుమారు 1800 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. పరీక్షా ఫలితాలను మే నెలలో ప్రకటించారు. 98 శాతం మంది ఉత్తీర్ణలయ్యారు. వారికి జూనియర్‌, సీనియర్‌ ధ్రువీకరణ పత్రాలను అందించారు. విద్యార్థులెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండానే పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. పరీక్షలు సజావుగా నిర్వహించడంలో ‘సంపద’ కీలక సభ్యులు ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ రెడ్డి శ్యామల నాయకత్వంలోని అధికారుల బృంద సభ్యులైన డాక్టర్‌, హనుమంతరావ్ కోట్ల, డాక్టర్‌ పద్మప్రియ, డాక్టర్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ శ్రీనివాసాచారి, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణలో డాక్టర్‌, వనజ ఉదయ్, డాక్టర్‌ విజయపాల్, డాక్టర్‌ రాధ సారంగపాణి విశేష సేవలందించారు. వారి కృషిని ‘సంపద’ డీన్‌, అధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల కొనియాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.

అలాగే, ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకున్న సమయంలోనూ ‘సంపద’ అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల పిల్లలు, పెద్దల మనసుకు సాంత్వన చేకూర్చేందుకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇక్కడి చిన్నారులకు కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద అభిరుచిని పెంచడానికి అన్నమయ్య, రామదాసు, పురందర దాసు లాంటి వాగ్గేయ కారుల గొప్పతనాన్ని వారికి పరిచయం చేయడానికి అంతర్జాలం వేదికగా వారు రచించిన కీర్తనల మీద పోటీలను నిర్వహించింది. ఈ పోటీల గురించి ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా వ్యాప్తంగా ఎందరో ఆసక్తితో నమోదు చేసుకున్నారు. తొలి విడతగా జూన్‌లో ఐదు నగరాల్లో నిర్వహించబోయే ప్రాంతీయ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జూన్ నెలాఖరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని సిలికానాంధ్ర వాగ్గేయకార ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ల తెలిపారు. ఈ పోటీలకు అత్యంత కీలకమైన సాంకేతిక నిర్వహణ నాయకత్వ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org  వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చని, ఈ రెండు కార్యక్రమాలు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని ‘సంపద’ అధ్యక్షుడు దీనబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

‘సంపద’ నిర్వహిస్తున్న వాగ్గేయకార వైభవం కార్యక్రమం విజయవంతం కావడానికి, వర్జీనియా నుంచి సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుబ్రహ్మణ్యం, న్యూజెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి, రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, ఒహాయో నుంచి సుధ అవసరాల, దుర్గ మంతా, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ల, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ల తదితరులు సహకారం అందిస్తున్నారని సంపద అధ్యక్షులు దీనబాబు తెలిపారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts