Published : 03/06/2021 20:06 IST

కళాకారులకు సాంస్కృతిక కళాసారథి, జీవీహెచ్‌ చేయూత

సింగపూర్‌లోని ప్రముఖ సాంస్కృతిక కళాసంస్థ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం ఛారిటబుల్ ఫౌండేషన్’(జీవీహెచ్‌)తో కలిసి కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘సంప్రదాయక మరియు జానపద కళారూపాలు’ అనే ఒక అంతర్జాల కళా ప్రదర్శనను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు రచయిత తనికెళ్ళ భరణి, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు, వంశీ సంస్థల వ్యవస్థాపకులు శిరోమణి డా.వంశీ రామరాజు గౌరవ అతిథులుగా విచ్చేశారు. మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌, సింగపూర్ తదితర దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, ‘జనరంజని- ముంబయి’ తదితర భారతీయ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి ఆలవాలమైన సంప్రదాయ కళలు, జానపద కళారూపాలకు చేయూతనివ్వాలి. నేటి కరోనా పరిస్థితుల్లో సరైన అవకాశాలు, వేదికలు లేక ఇబ్బంది పడుతున్న కళాకారులను ఆదరించి ఆర్థిక సాయం చేయాలి. ఈ విషయంలో జీహెచ్‌వీ వారి ప్రయత్నం మాకెంతో నచ్చి ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని అందించాం. అన్ని ప్రాంతాలలోనూ వివిధ సంస్థల వారు అక్కడి కళాకారులకు ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

జీహెచ్‌వీ ఛారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం జానపద కళాకారుల కోసం తాము విజయనగరంలో వేదికను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నాం. కరోనా వల్ల దాన్ని నిర్వహించలేకపోయాం. సింగపూర్ సంస్థ వారు ముందుకు వచ్చి అంతర్జాల వేదిక ఏర్పాటుచేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆనందంగా ఉంది. విజయనగరంలోని కళాకారుల ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంస్థల వారికి తెలియడానికి చక్కటి అవకాశం లభించింది’ అని హర్షం వ్యక్తం చేశారు.

రేలారేరేలా జానకీరావు, గజల్ వినోద్‌ల హుషారైన గీతాలు, నీలబోను సత్యం కుటుంబ బృందం ‘తప్పెటగుళ్ళు’, ఆదిభట్ల రవి భాగవతార్ హరికథాగానం, అనిల్ తెలికిచెర్ల, సౌమ్య, శ్రీతోధ్భవ్‌ల లఘు నాటిక, మోడేకుర్తి వెంకట కామేశ్వరరావు మురళీ వాదన, దాసరి తిరుపతినాయుడు మాస్టారి రంగస్థల పద్యాలు, బుజ్జి కుటుంబ బృందం ‘చెక్కభజన’, ‘నర్తనశాల’, ‘భగవతి నృత్య కళామందిర్’ నృత్య విద్యార్థినుల నృత్యాలు తదితర అంశాలు మూడు గంటల పాటు అతిథులను, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులను, సింగపూర్, విజయనగర సంస్థల సభ్యులను, పుర ప్రముఖులను అద్భుతంగా అలరించాయి. జీహెచ్‌వీ ఛారిటబుల్ ఫౌండేషన్ రూ.27 వేలు ఈ కార్యక్రమం ద్వారా సేకరించి కళాకారులకు అందించారు. మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాల సంస్థల ప్రతినిధులు మరి కొన్ని విరాళాలను ప్రకటించడం అందరికీ ప్రత్యేక ఉత్సాహాన్ని ఇచ్చింది.

జీహెచ్‌వీ సంస్థ ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, సింగపూర్ నుంచి ఊలపల్లి భాస్కర్, రామాంజనేయులు చామిరాజు, కుమారి మౌక్తిక మంగిపూడి, సాంకేతిక సహాయం అందించారు. గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహణలో యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ కార్యక్రమం ప్రసారమైంది.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని