SPB మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌ ఏర్పాటు

ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరిట ఎస్పీబీ మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌ (SPBMI) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న..

Updated : 02 Jul 2021 21:22 IST

న్యూజెర్సీ: ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరిట ఎస్పీబీ మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌ (SPBMI) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా జూన్‌ 27న న్యూజెర్సీలో దీన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనల మధ్య 150 మంది నేరుగా, వేలాది మంది ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు శ్రీనివాస్‌ గూడూరు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అధ్యక్షుడిగా భాస్కర్‌ గంటి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్వరి బుర్రా, కార్యదర్శిగా లక్ష్మి మోపర్తి, కన్వీనర్‌గా ప్రవీణ్‌ గూడూరు, సలహా సంఘం సభ్యుడిగా దాము గేదెల వ్యవహరించనున్నారు. ఈ సంస్థ ద్వారా పాటల పోటీలు నిర్వహించి ఎస్పీబీ పేరుతో అవార్డు కూడా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పురోహితులు రఘు శంకరమంచి పూజా కార్యక్రమాలు నిర్వహించగా... ప్రముఖ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ రాసిన పాటను టాలీవుడ్‌ గాయకుడు రాము ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహేశ్‌ సలాది, రాజేశ్వరీ బుర్రా యాంకర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై AVని ప్రదర్శించారు. సంస్థ ఏర్పాటుపై బాలసుబ్రహ్మణ్యం సోదరి ఎస్పీ శైలజ సంతోషం వ్యక్తంచేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొల్పిన ఈ సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, అందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని సంస్థ ముఖ్య సలహాదారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, వడ్డేపల్లి కృష్ణ, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ద ప్రసాద్‌, న్యూజెర్సీ కమిషనర్‌ ఆఫ్‌ యుటిలిటీస్‌ ఉపేంద్ర చివుకుల, లీడ్‌ ఇండియా యూఎస్‌ఏ ఛైర్మన్‌ హరి ఎప్పనపల్లి, తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి, ఓమ్‌ స్టూడియో అధినేత అశోక్‌ బద్ది, రామాచారి, మాధవపెద్ది సురేశ్‌ తదితరులు పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ సంగీత ప్రియుల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. 

అలాగే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయకులు, నటులు మనో, సుమన్‌, మల్లికార్జున్‌, గోపిక పూర్ణిమ, పార్థు నేమాని, విజయ లక్ష్మి, వేణు శ్రీరంగం, దినకర్‌, శారద ఆకునూరి, రాము, వినోద్‌బాబు, ఝాన్సీ, విజయ కుమారి, జగన్నాథరావు, రాజీవ్‌, అనితా కృష్ణ, రాగిణి, సింహాద్రి ప్రసాద్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొని బాలుకు నివాళులర్పించారు. 

అమెరికాలోని తెలుగు సంఘాలకు చెందిన వేగేశ్న ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వంశీ రామరాజు, నాటా వైస్‌ ప్రెసిడెంట్‌ బాలా ఇందుర్తి, టీఎఫ్‌ఏఎస్‌ ప్రెసిడెంట్‌ శ్రీదేవి జాగర్లమూడి, జీఎస్‌కేఐ ప్రెసిడెంట్‌ మధు అన్నా, శ్రీనివాస్‌ చిమట తదితరులు జూమ్‌ ద్వారా పాల్గొని సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి హాజరైన వారికి సంస్థ కార్యదర్శి లక్ష్మి మోపర్తి ధన్యవాదాలు తెలిపారు. మన టీవీ, టీవీ ఏషియా తెలుగు, ఓమ్‌ స్టూడియో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని