Published : 06/08/2021 09:57 IST

Green Cards At Risk:  లక్ష గ్రీన్‌కార్డులు వృథా?

అమెరికా ఆశావహులకు నిరాశే!
కొవిడ్‌ కారణంగా నత్తనడకన ఆమోదం

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌కార్డు చాలామందికి చిరకాల వాంఛ! వేలమంది భారతీయులు ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారు ఈ గ్రీన్‌కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. అత్యంత విలువైన ఆ కార్డులు... ఈసారి లక్ష దాకా వృథా కాబోతున్నాయి! అంటే లక్ష మందికి గ్రీన్‌కార్డు హోదా పొందే అవకాశం కోల్పోబోతున్నారు. కొవిడ్, తదనంతరం అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో నత్తనడకన సాగుతున్న పనులే ఇందుకు కారణం!

అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యహారాలు చూసే బాధ్యత సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ (యూఎస్‌సీఐఎస్‌)ది. 2020 అక్టోబరులో లక్షా 20వేల గ్రీన్‌కార్డుల జారీకి ఈ సంస్థ తన వార్షిక పని ఆరంభించింది. ఈ సెప్టెంబరుతో ఈ ఏడాది పని పూర్తి అవుతుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తయినట్లు లెక్క. మిగిలినవన్నీ వృథా అయినట్లే! ఇప్పటిదాకా ఎన్నింటిని పూర్తి చేశారనేదానిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేకపోయినా... జులైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో... విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీమ్‌ చెప్పిన సంగతి చాలామంది అమెరికా ఆశావహులకు ఆశనిపాతంలా తాకింది. ఈ సెప్టెంబరు చివరి నాటికి... సుమారు లక్ష గ్రీన్‌కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉండిపోతాయని చార్లీ స్పష్టం చేశారు. అంటే సెప్టెంబరు చివరినాటికి వాటిని జారీ చేయకుంటే మురిగిపోయినట్లే లెక్క! ఈసారి గ్రీన్‌కార్డు అవకాశం వచ్చీ... చేజారిన వారు వచ్చే ఏడాది కోటాలో వరుసలో ముందర ఉండరు. మళ్ళీ వారికి అవకాశం రావటానికి కనీసం ఐదేళ్ళయినా పట్టొచ్చని ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు.

నిధుల సమస్యను ఎదుర్కొంటున్న యూఎస్‌సీఐఎస్‌ను కొవిడ్‌ మరింత దెబ్బతీసింది. మహమ్మారి కారణంగా పనితీరు నెమ్మదించి, సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా... గ్రీన్‌కార్డుల జారీ మరింత ఆలస్యమవుతోంది. సగటున ఓ గ్రీన్‌కార్డు అప్లికేషన్‌ పరిష్కారానికి పదిన్నర నెలల సమయం పట్టేది. ఇప్పుడు... మరో రెండు నెలలు అదనంగా పడుతోందని చెబుతున్నారు. దేశాల ప్రాతిపదికన అమెరికాలో గ్రీన్‌కార్డుల జారీ చేస్తారు. భారతీయుల నుంచి ఎక్కువ దరఖాస్తులుండటంతో... పోటీ ఎక్కువ ఉండి... అవకాశం రావటానికి చాలా సంవత్సరాలు పడుతోంది. అదే తక్కువ మంది ఉండే దేశాల్లోని వారు వెనకాల వచ్చి దరఖాస్తు చేసినా గ్రీన్‌కార్డు వచ్చేస్తోంది. ‘‘2000 సంవత్సరంలో వచ్చా... 2010లో దరఖాస్తు చేసుకున్నా... ఈ ఏడాది దరఖాస్తు పరిశీలనలోకి వచ్చింది. వచ్చేస్తుందని సంబరపడుతున్నా... సెప్టెంబరుకల్లా ఆశ నెరవేరుతుందో లేదో తెలియని పరిస్థితి’’ అని అమెరికాలోని ఓ ఆశావాది ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా పరిస్థితి నేపథ్యంలో... గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులంతా సోమవారంనాడు మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ ఈ సెప్టెంబరులోగా తమ దరఖాస్తులు ఆమోదం పూర్తికాకుంటే... వచ్చే ఏడాది కోటాలో వరుసలో తమను ముందే ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలన్నది ఆ పిటిషన్‌ సారాంశం. డెమొక్రాటిక్‌ పార్టీ సెనెటర్లు కూడా ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని