Afghanistan: భారతీయుల తరలింపులో ఇబ్బందులు

అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడమే తమ ముందు ఉన్న

Updated : 20 Aug 2021 08:59 IST

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ 

న్యూయార్క్, మాస్కో: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడమే తమ ముందు ఉన్న తక్షణ లక్ష్యమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశానికి అధ్యక్షత వహించేందుకు ఇక్కడికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాబుల్‌ విమానాశ్రయం పరిస్థితి ఏమిటన్నది తెలియకపోవడంతో భారతీయులను తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. అఫ్గానిస్థాన్‌లోని మజర్‌-ఎ-షరీఫ్‌ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించే రెండు రోజుల ముందే అక్కడ ఉన్న 50 మంది భారత కాన్సులేట్‌ సిబ్బందిని భారత వాయుసేన విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చారు. తాలిబన్లు దాడులు చేస్తారని అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమయింది. కాందహార్‌లోని కాన్సులేట్‌ సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా కాబుల్‌ తీసుకొచ్చారు. అక్కడ ఉన్న మొత్తం రాయబార కార్యాలయ ఉద్యోగులను ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చారు. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తరువాత కూడా మరో 180 మందిని తెచ్చారు. ఇంకా అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి స్థానిక అధికారులు, అమెరికా భద్రత దళాల సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాలు దిగడానికి అనుమతి లభిస్తేనే ఇది సాధ్యం కానుండడంతో ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారు. అఫ్గాన్‌ పరిస్థితిపై బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌తో జైశంకర్‌ చర్చలు జరిపారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, తదితర విషయాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

ఆకలి కేకలు తప్పవు: ఐరాస

అనిశ్చితి పరిస్థితుల కారణంగా అఫ్గాన్‌లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కనీసం 1.40 కోట్ల మంది తీవ్రమైన ఆకలి బాధను ఎదుర్కొంటారని తెలిపింది. ప్రపంచ ఆహార కార్యక్రమం డైరెక్టర్‌ మేరీ ఎల్లెన్‌ మెక్‌ గ్రోర్తీ మాట్లాడుతూ ‘‘కరవు కారణంగా దేశంలో 40 శాతం పంటలు పోయాయి. పెద్ద సంఖ్యలో పశువులు చనిపోయాయి. తాలిబన్ల రాకతో వేలాది మంది చెల్లాచెదురయ్యారు. శీతకాలం కూడా సమీపిస్తుండడంతో పంటలు వేయడానికి అనువైన సమయం కూడా కాదు. దీంతో ఆహార సంక్షోభం ఏర్పడనుంది. ఆహారం అందించడానికి పరుగు మొదలవాలి’’ అని వ్యాఖ్యానించారు. 

రుణాలు ఇవ్వం: ఐఎంఎఫ్‌

అఫ్గానిస్థాన్‌కు ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. కొత్త ప్రభుత్వాన్ని అన్ని దేశాలు గుర్తించి, స్పష్టత వచ్చే వరకు ఆర్థిక సాయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొంది.

రహస్య సంభాషణలు కొనసాగించాం: రష్యా

తాలిబన్లతో దీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగించామని, అందుకే ఇప్పుడు వారి మద్దతు పొందామని రష్యా తెలిపింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ‘‘తాలిబన్లతో గత ఏడేళ్లుగా రహస్య సంభాషణలు కొనసాగించాం. అందుకే వారి మద్దతు పొందుతున్నాం. కాబుల్‌ను వారు ఆక్రమించుకున్నప్పుడు అన్ని దేశాలూ రాయబార కార్యాలయాలను మూసివేశాయి. మేం మాత్రం అలా చేయలేదు. మా రాయబారి వెళ్లి వారితో మాట్లాడారు. కార్యాలయానికి భద్రత కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘ఫరవాలేదు.. మంచి కుర్రాళ్లే’’ అని తాలిబన్లను ఉద్దేశించి కాబుల్‌లో రష్యా రాయబారి దిమిత్రీ ఝిర్నోవ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

గుర్తింపు ఇవ్వడంలో తొందరపడం

తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడంలో తొందరపడబోమని రష్యా విదేశాంగ మంత్రి చెప్పారు. మొత్తం అఫ్గాన్‌ వారి ఆధ్వర్యంలోకి రాలేదన్న విషయాన్ని తాలిబన్లు గుర్తించాలని తెలిపారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి, శాంతి నెలకొల్పాలని సూచించారు.
ప్రపంచానికి ఉగ్రవాదుల ముప్పు
బ్రిటన్‌ రక్షణ మంత్రి హెచ్చరిక

లండన్‌: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వ్యాలెస్‌ హెచ్చరించారు. ముఖ్యంగా అల్‌ఖైదా ముష్కరులు దీనిని అవకాశంగా మలచుకొని బలపడే ప్రమాదం ఉందని తెలిపారు. అభివృద్ధి సాధించలేని దేశాల్లో పేదరికం విజృంభిస్తుందని, ఉగ్రవాదం బలపడడానికి, విస్తరించడానికి ఇదే ప్రధాన వనరుగా మారుతుందన్నారు. ఇస్లామిక్‌ మత తత్వవాదులు అఫ్గానిస్థాన్‌ పరిణామాలను తమ విజయంగా ప్రచారం చేసుకుంటారని, ఇది ఇతర ఉగ్రవాద ముఠాలకు ప్రేరణగా మారుందని అభిప్రాయపడ్డారు. కాబుల్‌ విమానాశ్రయం నుంచి బ్రిటిష్‌ పౌరులు, దౌత్య సిబ్బంది, సహాయపడిన అఫ్గాన్ల తరలింపు కొనసాగుతోందన్నారు. నిత్యం 7 నుంచి 10 వరకు రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని