Updated : 21 Aug 2021 10:54 IST

Canada: కెనడా వెళ్లాలంటే కష్టాలే.. భారత విద్యార్థులకు తిప్పలు

భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కొనసాగుతున్న నిషేధం

ఇతర దేశాలకు వెళ్లి గమ్యస్థానానికి చేరాల్సిన పరిస్థితి

దిల్లీ: భారత్‌కు చెందిన లెరీనా అనే విద్యార్థిని కెనడాలోని ఓ యూనివర్సిటీలో చదువుతోంది. ఇటీవలే ఆమె అక్కడకు వెళ్లడానికి విమానం ఎక్కింది. ఆమె నేరుగా కెనడాకు వెళ్లి ఉంటే సుమారు 22 గంటల్లో ప్రయాణం ముగిసేది. అందుకయ్యే ఖర్చు రూ.1.5 లక్షల లోపే. కానీ నేరుగా వెళ్లే విమానం లేకపోవడంతో మొదట దిల్లీ నుంచి దుబాయికి వెళ్లింది. అక్కడ బార్సిలోనా విమానం కోసం 9 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మెక్సికో విమానం కోసం మరో 2 గంటలు వేచి చూసింది. తదుపరి మెక్సికోలో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఫలితాల కోసం రెండు రోజులు ఎదురు చూసింది. ఆ తర్వాత వాంకోవర్‌కు, అక్కడి నుంచి కెనడాకు చేరుకుంది. దీనికి ఆమెకు అయిన ఖర్చు రూ.5 లక్షలపైనే. ఇది ఒక్క లెరీనా సమస్యే కాదు.. కెనడాలో చదువుతున్న లక్షల మంది భారతీయ విద్యార్థులది. కరోనా నిబంధనల కారణంగా వారికి ప్రయాణంలో ముప్పుతిప్పలు ఎదురవుతున్నాయి.

ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లో బోధించిన కెనడా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నేరుగా తరగతి గది బోధనను ప్రారంభించాయి. దీంతో అక్కడకు వెళ్లడానికి విద్యార్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ భారత్‌ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా ఇంకా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉండడం వారికి సమస్యగా మారింది. రెండో ఉద్ధృతి సమయంలో విధించిన నిషేధాన్ని సెప్టెంబరు 21 వరకూ పొడిగించింది. దీనివల్ల కెనడాకు వెళ్లాలనుకునేవారు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తోంది. కెనడా ఆంక్షలు విధించని దేశానికి ముందు వెళ్లి, అక్కడి నుంచి కెనడాకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రయాణ దూరం పెరిగి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటులా దీనికి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల నిబంధనలూ తోడవుతున్నాయి.

భారత్‌లో చేయించుకునే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను కెనడా ఆమోదించడంలేదు. దీంతో కెనడా ధ్రువీకరించిన జాబితాలో ఉన్న దేశంలోనే పరీక్ష చేయించుకోవాల్సి వస్తోంది. ఆ ఫలితాలు వచ్చేవరకూ అక్కడే ఆగాల్సిన పరిస్థితి. దీనికి కనీసం రెండు రోజులు పడుతుండడంతో అక్కడే బస చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం అధికం కావడంతో పాటు ఖర్చులూ విపరీతంగా పెరిగిపోతున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కెనడా దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని చూపాలని అభ్యర్థిస్తున్నారు. ఇక్కడి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల నాణ్యతపై కెనడా ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే, ఫలానా ల్యాబ్‌లో చేయించుకొమ్మని సూచించవచ్చని, లేదా విమానాశ్రయాల్లో ఆ ఏర్పాట్లు చేసే దిశగా ఆలోచించాలని కోరుతున్నారు. రోజుకు లక్ష కేసులు వస్తున్న అమెరికా నుంచి విమాన ప్రయాణాలను అనుమతిస్తున్న కెనడా, భారత్‌పై మాత్రం నిషేధం కొనసాగిస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని