Ida hurricane: ‘ఇడా’తో లూసియానా అంధకారం

ఇడా హరికేన్‌ అమెరికాలో బీభత్సం సృష్టించింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన

Updated : 31 Aug 2021 13:11 IST

హరికేన్‌ వల్ల విద్యుత్‌ సేవలకు తీవ్ర అంతరాయం
చీకట్లో మగ్గిన 10 లక్షల మంది

న్యూఅర్లీన్స్‌: ఇడా హరికేన్‌ అమెరికాలో బీభత్సం సృష్టించింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులతో విరుచుకుపడుతూ కల్లోలం రేపింది. ఐదో అత్యంత తీవ్రమైన హరికేన్‌గా నిలిచిన దీని ప్రభావం లూసియానాపై ఎక్కువగా కనిపించింది. అక్కడి న్యూఅర్లీన్స్‌ నగరంలో తుపాను ముంచెత్తడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఆదివారం రాత్రి(అక్కడి కాలమానం ప్రకారం) నగరం మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లూసియానా, మిసిసిపిల్లో మొత్తం మీద సుమారు 10 లక్షల మంది ఇళ్లలో కరెంటు లేక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్‌ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచ్చింది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ప్రయిరీవిల్లేలో చెట్టు తన మీద పడడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లూసియానాలో ఉన్న చిత్తడి నేలలపైనా హరికేన్‌ తన ప్రతాపం చూపింది. సమీపంలోనే ఉన్న పెట్రోకెమికల్‌ కారిడార్‌ను చుట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న 20 లక్షల మంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

మెక్సికోలో శాంతించిన నోరా

మెక్సికోలో కల్లోలం రేపిన నోరా తుపాను కూడా కాస్త శాంతించింది. ఆదివారం మధ్యాహ్నానికి తీవ్రత తగ్గింది. దీని ప్రభావంతో ప్యూర్టో వల్లార్టాలో హోటల్‌ భవనం పాక్షికంగా కూలి ఓ యువకుడు మరణించాడు. కారు కొట్టుకుపోవడంతో ఓ మహిళ గల్లంతైంది. ఆరుగురు జాలర్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడి ఇద్దరు గాయపడ్డారు. 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వెనక్కు ప్రవహిస్తున్న నది!

ఇడా హరికేన్‌తో ప్రచండ గాలుల ధాటికి లూసియానా రాష్ట్రంలోని న్యూ అర్లీన్స్‌ వద్ద మిసిసిపి నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది. దీన్ని అత్యంత అసాధారణమైన విషయంగా అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని