అదనపు రుసుము చెల్లిస్తే.. గ్రీన్‌ కార్డు ప్రాధాన్యం

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నవారి ఆశలు ఫలించే అవకాశముంది! వారికి చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కల్పించేందుకు దోహదపడే కొత్త బిల్లును ‘ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ’ ...

Updated : 14 Sep 2021 04:36 IST

అమెరికాలో కొత్త బిల్లు ప్రతిపాదన
వేల మంది భారతీయులకు లబ్ధి!

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నవారి ఆశలు ఫలించే అవకాశముంది! వారికి చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కల్పించేందుకు దోహదపడే కొత్త బిల్లును ‘ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ’ ప్రతిపాదించింది. సప్లిమెంటల్‌ ఫీజు చెల్లించిన వారికి శాశ్వత నివాస హోదా కల్పనలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. దరాఖాస్తుల రుసుముకు అదనంగా దీన్ని వసూలు చేయాలని పేర్కొంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్‌ ముందుకు వస్తుందని భావిస్తున్నారు. ‘‘ప్రాధాన్య తేదీ రెండేళ్ల కంటే ముందు ఉన్నవారికి.. అదనపు ఫీజు చెల్లిస్తే గ్రీన్‌కార్డు సదుపాయం కల్పించవచ్చు. ఇలాంటి ఉపాధి ఆధార దరఖాస్తుదారుల నుంచి సుమారు రూ.3.69 లక్షలు (5 వేల డాలర్లు); ఈబీ-5 విభాగం వారి (వలస పెట్టుబడిదారులు) నుంచి రూ.36.83 లక్షలు (50 వేల డాలర్లు) వసూలు చేయాలి. కుటుంబ ఆధార ఇమిగ్రేషన్‌ దరఖాస్తుదారుల నుంచి రూ.1.84 లక్షలు (2,500 డాలర్లు) సప్లిమెంటల్‌ ఫీజు తీసుకోవాలి. ఒకవేళ ప్రాధాన్య తేదీ రెండేళ్ల కంటే ముందు లేకపోయినా, అలాంటి దరఖాస్తుదారుల అవసరం దేశానికి ఉంటే... వారి నుంచి రూ.1.10 లక్షలు (1,500 డాలర్లు) మాత్రమే వసూలు చేయాలి. బిల్లును ఉద్దీపన ప్యాకేజీలో చేర్చి, 2031 వరకూ ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలి’’ అని బిల్లులో పేర్కొన్నట్టు ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ వెల్లడించింది. పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందే ఈ బిల్లు ప్రతిపాదనలకు జ్యుడీషియరీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది పార్లమెంటు, అధ్యక్షుడి ఆమోదం కూడా పొందితే... అమెరికాలో ఉంటున్న వేల మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నారు. చిన్న వయసులోనే దేశానికి వచ్చినవారు, తాత్కాలిక రక్షణ పొందుతున్నవారు, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు కూడా ఈ చట్టం కింద శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని