దేశం దాటాలంటే పరీక్షలెన్నో!.. ఆంక్షల కఠినతరంతో అయోమయం

యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా

Updated : 18 Sep 2021 09:54 IST

ఈనాడు - హైదరాబాద్‌

యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరాక ఆ ఎయిర్‌లైన్స్‌ నుంచి వెళ్లే వారికి వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం లేదని ప్రయాణానికి అనుమతించబోమని చెప్పారు. దీంతో ఆ టికెట్‌ రద్దు చేసుకుని రూ. 1.3 లక్షలు పెట్టి ఎమిరేట్స్‌ టికెట్‌ కొనుక్కోవలసి వచ్చింది. 

* ఖతార్‌ వెళ్లేందుకు మరో ప్రయాణికుడు విమానం బయలుదేరే సమయానికి 3 గంటల ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సిబ్బంది విమానం బయలుదేరే సమయానికి 5-6 గంటల ముందుగానే వచ్చి కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని, ఇప్పుడు సమయం లేనందున అనుమతించబోమని చెప్పారు. సమయం మార్చిన విషయం తెలియకపోవడంతో టికెట్‌ రద్దు చేసుకున్నారు.

వివిధ దేశాల్లో కరోనా ఆంక్షలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పనులపై స్వదేశానికి వస్తున్నవారికి తిరిగి వెళ్లే సమయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. తిరుగు ప్రయాణానికి ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నా ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి కనీస సమాచారం అందకపోవడం, మారుతున్న నిబంధనల్ని ప్రయాణికులు తెలుసుకోకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. కరోనా పరీక్ష ప్రమాణాలు, ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టు నిబంధనలు తెలియక పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 

భారీగా రుసుం.. 

ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్ష రుసుంలు భారీగా ఉంటున్నాయి. విమాన ప్రయాణానికి 6 గంటల ముందుగా చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.4,500 చెల్లించాల్సి వస్తోంది. 

ఇలా చేస్తే మేలు.. 

- అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, వీసా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. 
‘వీసా ఆన్‌ అరైవల్‌’ సదుపాయం అన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు లేదు. అది ముందే తెలుసుకుని టికెట్లు బుక్‌ చేసుకోవాలి.
- ప్రయాణానికి ముందురోజు విమానయాన సంస్థ కాల్‌సెంటర్‌లో సంప్రదించి, నిబంధనల్లో మార్పులేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి 
- గతంలోలా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వనందున అప్రమత్తంగా ఉండాలి. 
- కరోనా నిబంధనలు, ఆంక్షల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, తేదీ మార్పులపై చేస్తున్న సవరణలు గమనించడం అవసరం.

ఆంక్షల కఠినతరంతో అయోమయం 

అంతర్జాతీయ ప్రయాణికులు రెండుసార్లు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవలసి వస్తోంది. ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు గమ్యస్థానం చేరుకునే సమయానికి (విమాన ప్రయాణ సమయాన్ని కలుపుకొని) 48 గంటల ముందుగా కొవిడ్‌ పరీక్ష రిపోర్టుతో రావాలని చెబుతున్నాయి. గతంలో ఇది 48-72 గంటలుగా ఉండేది. ఈ వివరాలు విమానయాన సంస్థల వెబ్‌సైట్లో అప్‌డేట్‌ కావడం లేదు. నిబంధనలు తరచూ మారుతుండడం, వివిధ దేశాలు ఆంక్షలను కఠినం చేస్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

6 గంటల ముందు మరోసారి

అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి 6 గంటల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకోవలసి వస్తోంది. గతంలో గంట ముందు వరకు చెక్‌-ఇన్‌కు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు 3 గంటల ముం దుగానే చెక్‌-ఇన్‌ అయిపోవాలని నిబంధన మార్చారు. అలాగే సరైన వీసా ఉంటే చాలు అంతర్జాతీయ ప్రయాణానికి అనుమతి ఉన్నట్లేనని భావించే పరిస్థితి లేదు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక అక్కడి సిబ్బంది ప్రయాణ పత్రాలన్నీ చూసి సత్వర ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు అనుమతి ఇస్తారు. పత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు  కరోనా పరీక్షకు అనుమతి ఇవ్వరు. ఈ పరీక్ష చేయించుకున్న 45-60 నిమిషాల్లో ఫలితం వస్తుంది. అది అనుకూలంగా ఉంటే చెక్‌ఇన్‌కు అనుమతి ఇస్తారు. వ్యతిరేకంగా ఉంటే ప్రయాణ రద్దవుతుంది. ప్రయాణ సమయానికి కనీసం 5 గంటల ముందుగా పరీక్షకు నమూనా ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని