లాటరీ విధానంలోనే హెచ్‌1-బి వీసాల ఎంపిక

హెచ్‌1-బి వీసాల జారీ నిమిత్తం ట్రంప్‌ హయాంలో ప్రతిపాదించిన కొత్త విధానాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టేసింది! కొన్నేళ్లుగా లాటరీ విధానంలో పరిమితి మేరకు హెచ్‌-1బి వీసాలను ఎంపిక చేస్తున్నారు.

Updated : 19 Sep 2021 04:56 IST

ట్రంప్‌ సర్కారు ప్రతిపాదనలను కొట్టేసిన అమెరికా న్యాయస్థానం

వాషింగ్టన్‌: హెచ్‌1-బి వీసాల జారీ నిమిత్తం ట్రంప్‌ హయాంలో ప్రతిపాదించిన కొత్త విధానాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టేసింది! కొన్నేళ్లుగా లాటరీ విధానంలో పరిమితి మేరకు హెచ్‌-1బి వీసాలను ఎంపిక చేస్తున్నారు. ఈ విధానం సరికాదని, వేతన స్థాయిని బట్టి వీటిని జారీ చేయాలని... అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) నాడు ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యతిరేకించింది. దీన్ని కొట్టేయాలంటూ కాలిఫోర్నియా నార్తెర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జాఫ్రీ వైట్‌ తీర్పు వెల్లడించారు. ‘‘ప్రతిపాదిత ఉత్తర్వులు జారీచేసిన నాటి తాత్కాలిక హోంలాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ చాద్‌ ఓల్ఫ్‌ చట్టబద్ధంగా వ్యవహరించలేదు. ఆ కారణం వల్ల ఆయన ప్రతిపాదించిన హెచ్‌1-బి కోటా ఎంపిక ప్రతిపాదనను కొట్టేస్తున్నాం’’ అని జడ్జి పేర్కొన్నారు.

భారతీయులే అధికం...

శాస్త్ర, సాంకేతిక, గణిత, ఇంజినీరింగ్‌ (స్టెమ్‌), ఇతర రంగాల్లో దేశీయ సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ.. అమెరికా హెచ్‌1-బి వీసాలను జారీ చేస్తుంది. వీటి ద్వారా అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసేవారిలో భారతీయులు, చైనా వారే ఎక్కువ. ఈ వీసాల కోసం ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అయితే, సాధారణ విద్యార్హతలున్న నిపుణుల్లో గరిష్ఠంగా 65 వేల మందిని, అదనపు విద్యార్హతలున్న మరో 20 వేల మందిని మాత్రమే హెచ్‌1-బి వీసాలకు ఎంపిక చేస్తున్నారు. ఇందుకు లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ట్రంప్‌ సర్కారు... అధ్యక్ష ఎన్నికలకు ముందు లాటరీ విధానాన్ని తొలగిస్తామని ప్రకటించింది. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుతూనే, అత్యంత నిపుణులైన విదేశీయులకు లబ్ధి చేకూర్చేలా ‘వేతన ఆధార హెచ్‌1-బి కోటా కేటాయింపు’ చేపడతామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాత్కాలిక హోంలాండ్‌ సెక్రటరీ ఓల్ఫ్‌ ఉత్తర్వులిచ్చారు. వీటిని 2021, మార్చి 9 నుంచి అమలు చేయాలని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. అయితే, గడువు తేదీని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఈ ఏడాది డిసెంబరు 31కి వాయిదా వేసింది. ఓల్ఫ్‌ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటుకావని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని