Updated : 21 Sep 2021 10:47 IST

అమెరికా ప్రయాణంపై ఆంక్షల సడలింపు

పూర్తిస్థాయిలో టీకాలు తీసుకుంటేనే అనుమతి
అలాంటి వారికి క్వారంటైన్‌ రద్దు
భారత్‌ తదితర దేశాలపై నిషేధం ఎత్తివేత
కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానం వెల్లడించిన బైడెన్‌ సర్కారు

వాషింగ్టన్‌: అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై ఆ దేశం ఆంక్షలను సడలించింది. తమ దేశం వచ్చే విమానం ఎక్కడానికి ముందే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని షరతు పెట్టింది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత అలాంటి వారికి క్వారంటైన్‌ అవసరం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు... భారత్‌ తదితర దేశాలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మేరకు కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానాన్ని సోమవారం ప్రకటించింది. నవంబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను శ్వేతసౌధం కొవిడ్‌ స్పందన సమన్వయకర్త జెఫ్‌ జియెంట్స్‌ వెల్లడించారు.

‘‘కరోనా వైరస్‌ నుంచి అమెరికన్లకు రక్షణ కల్పించడం, అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా... కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొచ్చాం. ఇకపై పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్న విదేశీయులే అమెరికా వచ్చే విమానాలను ఎక్కాల్సి ఉంటుంది. వారు టీకా ధ్రువపత్రాలతో పాటు... అమెరికా విమానం ఎక్కడానికి మూడు రోజుల్లోపు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ ఫలితం వచ్చినట్టు రిపోర్టు కూడా చూపించాలి. ఏయే వ్యాక్సిన్లు తీసుకున్నవారిని దేశంలోకి అనుమతించాలన్నది వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) నిర్ణయిస్తుంది. టీకాలు తీసుకోకుండా ఇతర దేశాల నుంచి తిరిగివచ్చే అమెరికన్లు కూడా విమానం ఎక్కడానికి ముందురోజు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. దేశానికి వచ్చిన తర్వాత కూడా వారికి మరోసారి టెస్ట్‌ తప్పదు.

ప్రతి వ్యక్తి నుంచి వివరాల సేకరణ...

అమెరికా వచ్చే ప్రతి వ్యక్తి నుంచి వారి ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌, ఇతర వివరాలను సేకరించేలా విమానయాన సంస్థలకు వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) ఆదేశాలు ఇవ్వనుంది. దేశంలోకి వచ్చిన తర్వాత వీరిలో ఎవరైనా కొవిడ్‌ బారిన పడితే... వారితో కాంటాక్టు అయినవారిని త్వరగా గుర్తించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. విమానాల్లో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు బైడెన్‌ ఇప్పటికే సూచించారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు’’ అని జియంట్స్‌ పేర్కొన్నారు. నిరుడు ప్రారంభంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని... నాటి ట్రంప్‌ సర్కారు భారత్‌, చైనా, బ్రిటన్‌, బ్రెజిల్‌ తదితర దేశాల నుంచి అమెరికా వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించింది. కొత్త విధానంలో వీటిని సడలించడం గమనార్హం.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని