Updated : 29 Sep 2021 06:58 IST

తానా మాతృభాష సాహిత్య సదస్సు విజయవంతం

అట్లాంటా, జార్జియా: ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా..ఆంగ్లభాషపై ఎంత పట్టున్నా.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని పలువురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెలనెలా తెలుగు వెలుగు’ సాహిత్య సమావేశం సెప్టెంబర్‌ 26న విజయవంతంగా జరిగింది. తానా పాలక మండలి అధిపతి డా.బండ్ల హనుమయ్య తన స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్‌ తోటకూర ఈ 18వ అంతర్జాతీయ దృశ్య మాద్యమం ద్వారా ‘వ్యక్తిత్వ వికాస మార్గం మాతృభాష’ అనే అంశంపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు అతిథులను ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా పలువురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు మాట్లాడుతూ.. పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోవడం వల్ల వారికి అవగాహనా శక్తి పెరుగుతుందన్నారు. ఒక మంచి పునాది ఏర్పడి ఆలోచనా విధానం మెరుగుపడుతుందని తెలిపారు. అవసరాన్ని బట్టి ఎన్ని భాషలనైనా సులభంగా నేర్చుకోగలుగుతారని పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని, అయితే తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పారు.  

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ అవసరాన్ని బట్టి తెలుగు నేర్చుకుంటున్నారని తెలిపారు. పసితనంలో మాతృభాషలో చదువుకున్న వారి మానసిక వికాసం మెరుగ్గా ఉంటుందనే విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు ధ్రువీకరించారని అన్నారు. ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, సంస్థలు, విద్యాలయాలు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు అందరూ కలసి పిల్లలకు బాల్యదశ నుంచి తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి‌, మాజీ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ మేడిశెట్టి తిరుమల కుమార్‌, జిల్లా మాజీ కలెక్టర్‌ నందివెలుగు ముక్తేశ్వరరావు‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (తమిళనాడు) పోలూరి రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (పశ్చిమ్‌బెంగాల్‌) డా.బొప్పూడి నాగరమేష్‌, మాజీ చీఫ్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ గాది వేణుగోపాలరావు‌, ఈడీ టొబాకో బోర్డు (గుంటూరు) అద్దంకి శ్రీధర్‌బాబు, విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు డా.కరణం అరవిందరావు, డా.పట్నాల సుధాకర్‌, విద్యావేత్త, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts