US: అగ్రరాజ్య పేదలకు అన్నదానమే ఆధారం

పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం

Updated : 14 Oct 2021 14:41 IST

దిగువ మధ్యతరగతి వారిని ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు 
 ‘డెల్టా’ విజృంభిస్తే సగటు జీవికి ఆహార బ్యాంకులే దిక్కు!

వాషింగ్టన్‌: పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు! కొవిడ్‌ ఉద్ధృతి నెమ్మదించి, టీకా కార్యక్రమం ఊపందుకోవడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. దీంతో ఆహార బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య ఆరు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ, కొవిడ్‌ ముందునాళ్లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి తీవ్రత 55% ఎక్కువగానే ఉన్నట్టు ‘ఫీడింగ్‌ అమెరికా’ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యనిర్వాహకురాలు కేటీ ఫిట్జరాల్డ్‌ చెప్పారు. అమెరికా వ్యాప్తంగా 200కు పైగా ఆహార బ్యాంకులను ఈ సంస్థ సమన్వయం చేస్తోంది. మహమ్మారి కారణంగా దేశంలో గడ్డు పరిస్థితులు తలెత్తడంతో ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయినవారిని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించకూడదని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ రక్షణల గడువు త్వరలో ముగియనుండటంతో చాలామంది పేదలకు మళ్లీ ఆహార బ్యాంకులే దిక్కవుతాయని భావిస్తున్నారు.
సర్కారీ ఆహార స్టాంపులు...
అల్పాదాయ, అసలు ఆదాయమే లేని కుటుంబాలకు బైడెన్‌ సర్కారు అనుబంధ పోషకాహార పథకం (శ్నాప్‌) కింద ఫుడ్‌ స్టాంపులు అందిస్తోంది. వాటిని ఉపయోగించి ఆహారం కొనుగోలు చేయవచ్చు. 2019లో ఈ స్టాంపులు అందుకున్నవారితో పోలిస్తే 2021లో వారి సంఖ్య 70 లక్షల మేర పెరిగింది. వ్యవసాయశాఖ అమలుచేసే ఈ పథకం కింద సౌకర్యాలను అక్టోబరు నుంచి 25% పెంచుతున్నట్టు అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. శ్నాప్‌ కింద 14% మంది వయోజనులు ఆహార స్టాంపులు పొందారనీ, వీరి సంఖ్య ఇటీవల 8 శాతానికి తగ్గిందని వ్యవసాయ మంత్రి టామ్‌ విల్సాక్‌ వివరించారు. ఈ పథకం కటిక పేదరికంలో మగ్గుతున్నవారి కోసం ఉద్దేశించింది కాబట్టి, ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు దీని కింద ప్రయోజనం పొందలేకపోతున్నారు. దీంతో వీరిని స్వచ్ఛంద, దానధర్మ సంస్థలు ఆదుకుంటున్నాయి. ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కారణంగా దుకాణాలు, పరిశ్రమలు, బడులు మళ్లీ మూతపడితే.. సగటు అమెరికన్లు చాలామంది అన్నదానంపై ఆధారపడక తప్పదని భావిస్తున్నారు.
మహిళలే అధికం... 
ఫీడింగ్‌ అమెరికా ఛత్రం కింద నడుస్తున్న ఆహార బ్యాంకులు గత ఏడాది మార్చిలో 110 కోట్ల పౌండ్ల ఆహారాన్ని పంపిణీ చేశాయి. ఈ ఏడాది మార్చిలో 60 లక్షల పౌండ్లు, ఆగస్టులో 46 లక్షల పౌండ్లు మేర ఆహారాన్ని అందించాయి. 2019 జూన్‌లో ఆహార బ్యాంకులు కేవలం 27 లక్షల పౌండ్ల ఆహారాన్నే పంపిణీ చేశాయని, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఆహార పదార్థాలను అందించాల్సి వస్తోంది. ‘‘ఆదాయాలు భారీగా తగ్గడం వల్ల చాలామంది మధ్యతరగతి వారు ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఇలాంటివారిలో ఎక్కువమంది మహిళలే. కొవిడ్‌ ఇప్పట్లో ముగిసేలా లేదు కాబట్టి అన్నదాన శిబిరాలను కొనసాగించక తప్పదు’’ అని వాషింగ్టన్‌ డి.సిలో క్యాపిటల్‌ ఏరియా ఫుడ్‌ బ్యాంకు నడుపుతున్న రాధా ముత్తయ్య చెప్పారు. 2019 జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 64% ఎక్కువగా ఆహారాన్ని పంపిణీ చేసినట్టు ఆమె వివరించారు. వచ్చే వేసవి వరకూ అన్నదాన శిబిరాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే బైడెన్‌ ప్రభుత్వం ఉచిత ఆహార బ్యాంకులను ప్రోత్సహిస్తోంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను భద్రపరిచేందుకు అవసరమైన శీతల గిడ్డంగులను, ట్రక్కులను సమకూర్చుకునేందుకు గత జూన్‌లోనే సుమారు 100 కోట్ల డాలర్లు కేటాయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని