ఎగిరిపోతున్నారు.. ఆంక్షల సడలింపులతో ఊపందుకున్న విదేశీయానం

 అంతర్జాతీయంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటం.. వ్యాక్సినేషన్‌లో వేగం.. ఇతర దేశాల్లో విద్యాసంస్థలు ప్రత్యక్ష

Published : 24 Oct 2021 13:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటం.. వ్యాక్సినేషన్‌లో వేగం.. ఇతర దేశాల్లో విద్యాసంస్థలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తుండడం.. తదితర సానుకూల పరిస్థితుల మధ్య అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు వెళ్లే, వచ్చే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనాకు ముందు పరిస్థితులతో పోల్చితే 70-75శాతం రద్దీ కనిపిస్తోంది.

గతంలో 1.50 లక్షలు.. ఇప్పుడు 1.13 లక్షలు

కొన్ని రోజులుగా అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు సడలిస్తూ వస్తోంది. ఈ నెల 25 తర్వాత విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆమోదిత టీకాలు తీసుకుని ఉంటే 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనను ఎత్తివేసింది. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి పునరుద్ధరించేందుకు అనుసరించాల్సిన విధానాలపై సలహాలు, సూచనలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల కిందట అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. అనంతరం మెజార్టీ దేశాలకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా కసరత్తు ప్రారంభించే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎయిర్‌బబుల్‌ ఒప్పందాలలో భాగంగా కొన్ని దేశాలకే సర్వీసులు నడిపిస్తుండగా.. తాజాగా అన్ని దేశాల నుంచి సర్వీసులు అనుమతించే వీలుందని వివరిస్తున్నారు. గతేడాది కరోనా ప్రబలడానికి ముందు నెలకు 1.50లక్షల మంది రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం 1.13లక్షల మంది ప్రయాణిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 

దేశాలకు సర్వీసులు ఇలా..

ప్రస్తుతం దోహా, మాల్దీవులు, షికాగో, బహ్రెయిన్, దుబాయి, షార్జా, మస్కట్, జెడ్డా, కువైట్, అబుదాబి, లండన్, కొలంబోకు సర్వీసులు నడుస్తున్నాయి. షికాగో, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌ తదితర దేశాలకు త్వరలోనే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts