సంస్కృతిని చాటేలా ప్రవాసాంధ్రుల ‘దీపావళి’

పరబ్రహ్మదీపం సర్వతమోపహమ్‌..దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమ్మోస్తుతే|| దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళిని నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో నరకచతుర్థశి మరుసటి రోజు జరుపుకుంటారు.

Updated : 03 Nov 2021 07:12 IST

చిలకలూరిపేట గ్రామీణ: దీపంజ్యోతిః పరబ్రహ్మదీపం సర్వతమోపహమ్‌..దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమ్మోస్తుతే|| దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళిని నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో నరకచతుర్థశి మరుసటి రోజు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ ప్రజలు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగే దివ్యదీప్తుల దీపావళి. ప్రవాసాంధ్రులు కూడా దీపావళిని వేడుకగా వివిధ దేశాల్లో కోలాహలంగా నిర్వహిస్తున్నారు.

సంస్కృతిని ప్రతిబింబిస్తూ..

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ విశిష్టత ఉట్టిపడేలా ఏటా దీపావళి ఘనంగా జరుపుకొంటున్నాం. ఇక్కడి ప్రవాసాంధ్రులందరం కలసి అంగరంగ వైభవంగా, కళ్లు మిరుమిట్లు గొలిపేలా, బాణసంచా వెలుగుల్లో నరకాసురుని వధ నిర్వహిస్తాం. అనంతరం మన భారతీయ పిండివంటలతో సహపంక్తి భోజనాలు చేస్తాం. ముందుగా ఇంటి వద్ద దీపాలు వెలిగించి పండుగ విశిష్టత, మన సంస్తృతి అందరికీ తెలియజేస్తున్నాం. -శ్రుతి, కృష్ణమోహన్‌, కాలిఫోర్నియా (మద్దిరాల, చిలకలూరిపేట మండలం)

బాణసంచాతో పాటు లక్ష్మీ పూజ

దుబాయిలో ఏటా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. దుబాయి తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో అందరం కలసి భారతీయ పండుగలను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటాం. దీపావళికి అత్యంత వైభవంగా లక్ష్మీపూజ చేస్తాం. బాణసంచా వెలుగులు నింగినంటే సంబరంగా జరుపుకుంటాం. - బాలకోటేశ్వరరావు, దుబాయ్‌ (బొప్పూడి)

భావితరాలకు తెలిసేలా..

ఈ సంవత్సరం కూడా అమెరికా ఫ్లోరిడాలో ఉన్న ప్రవాసాంధ్రులందరం ఆలయం వద్ద అత్యంత వైభవంగా దీపావళి నిర్వహిస్తాం. భారతదేశానికి దూరంగా ఉన్నా మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతితరానికి మన పండుగల విశిష్టతలు తెలియజేస్తూ వాటిలోని గొప్పదనాన్ని చాటుతున్నాం. అందరం కలిసి మెలసి ఆనందోత్సాహాలతో దీపావళి నిర్వహంచుకోవడం ఆనందాన్నిస్తోంది. -మద్దినేని చైతన్యభార్గవ్‌, దీప్తి, ఫ్లోరిడా (చిలకలూరిపేట)

లండన్‌లో అందరం కలిసి ఒకేచోట

లండన్‌లో అందరం కలసి ఒకే ప్రాంతంలో దీపావళిని పెద్దఎత్తున నిర్వహించుకుంటాం. ట్రాఫ్‌బ్లర్‌స్క్వేర్‌ ప్రాంతంలో దీనికోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయిస్తాం. ఆ రోజు అందరం అక్కడకు చేరుకుని మన సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అనంతరం బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటాం. -గుర్రం కిషోర్‌, నాగలక్ష్మి, లండన్‌(అమీన్‌సాహెబ్‌పాలెం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు