ఘనంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి వేడుకలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి(సింగపూర్) వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మభూషణ్‌ దేవులపల్లి

Published : 03 Nov 2021 19:51 IST

సింగపూర్‌: శ్రీ సాంస్కృతిక కళాసారథి(సింగపూర్) వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మభూషణ్‌ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతి కార్యక్రమం అంతర్జాల వేదికపై ఘనంగా నిర్వహించారు. 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికాల నుంచే కాకుండా భారత్‌ నుంచి కూడా అతిథులు పాల్గొన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాల నుంచి 250 మంది కవయిత్రులు రచించిన కవితలతో రూపొందింపబడిన ‘కవితా మేఘమాల’ అనే కవితా సంకలనం ఈ సభలో దేవులపల్లి వారి స్మృతిలో ఆవిష్కరించటం విశేషం.  శాసన మండలి సభ్యులు సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలనాటి ప్రముఖ నటీమణి జమునా రమణారావు, దేవులపల్లివారి సినిమా పాటలను తలచుకుంటూ ప్రసంగించారు.

గౌరవ అతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఆవుల మంజులత విచ్చేసి కవితా సంకలనాన్ని సమీక్షించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శుభోదయం సంస్థ నిర్వాహకులు కలపటపు లక్ష్మీ ప్రసాద్,  దేవులపల్లి వారి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు, 12 మంది ప్రముఖ వక్తలు, 8 మంది  ప్రసిద్ధ గాయనీమణులు పాల్గొన్నారు.  శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ సింగపూర్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షులు  రామరాజు మాట్లాడుతూ దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్థిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామన్నారు.

శారద అశోకవర్ధన్, డా.బాలాంత్రపు లావణ్య, డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, డా.రామసూరి, డా.దామరాజు కామేశ్వరరావు, సుబ్బు వి పాలకుర్తి, యస్ వేణుగోపాలరెడ్డి, శ్రీదేవి లేళ్ళపల్లి, రామనాథ్, చంద్ర రెంటచింతల, డా.నిడమర్తి నిర్మలా దేవి, డా.వైదేహి శశిధర్aiల దేవులపల్లి గురించి పరిశోధనాత్మక ప్రసంగాలను అందించారు. వేదవతి ప్రభాకర్, దివాకర్ల సురేఖ మూర్తి,  వేదాల శశికళ స్వామి,  యస్ పి వసంత,  హిమబిందు,  శాంతి శ్రీ, శ్రేయ రామనాథ్, ధర్మరాజు వంశీ ప్రియలు కృష్ణశాస్త్రి రచించిన పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు. సింగపూర్ నుంచి గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని