అమెరికా నిఘా వ్యవస్థకు ‘టీకా’ చిక్కులు!

అమెరికాలో టీకా తప్పనిసరి నిబంధన అమల్లో ఉండటంతో ఆ ప్రభావం నిఘా వ్యవస్థపై పడే పరిస్థితి నెలకొంది.

Published : 06 Nov 2021 13:53 IST

వ్యాక్సిన్‌ తీసుకోని 20% మంది ఉద్యోగాలకు ముప్పు!

వాషింగ్టన్‌: అమెరికాలో టీకా తప్పనిసరి నిబంధన అమల్లో ఉండటంతో ఆ ప్రభావం నిఘా వ్యవస్థపై పడే పరిస్థితి నెలకొంది. అక్టోబరు ఆఖరు నాటికి దేశంలోని పలు నిఘా ఏజెన్సీల్లో కనీసం 20% సిబ్బంది కొవిడ్‌ టీకాలు తీసుకోలేదని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్‌ కమిటీ సభ్యుడు క్రిస్‌ స్టీవర్ట్‌ వెల్లడించారు. గడువులోగా టీకాలు తీసుకోకపోతే తొలగించాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని.. దీంతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నిఘా వ్యవస్థలోని 18 ఏజెన్సీలకు గాను.. కొన్నింటిలో 40% సిబ్బంది వ్యాక్సిన్‌ వేయించుకోలేదని స్టివర్ట్‌ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంతా నవంబరు 22 నాటికి కచ్చితంగా టీకా తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికి చాలామంది టీకా తీసుకునే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. కాగా నిఘా వ్యవస్థలో పనిచేసే సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పిస్తే వారిని భర్తీ చేయడం కష్టమవుతుందన్నది రిపబ్లికన్ల ఆందోళన. ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఆలస్యంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నవంబరు 22 నాటికి వ్యాక్సిన్‌ తీసుకొని ఉద్యోగులను 14 రోజుల పాటు విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికీ తీసుకోకపోతే.. వారిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు