గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 65కు పైగా తెలుగు సంఘాల

Updated : 16 Nov 2021 13:11 IST

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 65కు పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో.. 25 దేశాలలోని తెలుగు పిల్లలతో వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. "బాలల చేత - బాలల కోసం" అంటూ 12 గంటలపాటు నిర్విరామంగా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా  సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ సందేశాన్ని పంపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందజేసే క్రమంలో ముందుగా మన కట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలు, పబ్బాలను పిల్లలకు పరిచయం చేయాలని... దానికి బాలల దినోత్సవం లాంటి సందర్భాన్ని  వినియోగించుకోవడం సంతోషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మన సంస్కృతికి మూలమైన మాతృ భాషను పిల్లలకు నేర్పించాలని, మన శతక పద్యాలు, కథలు వారికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్థులను మనవైన విలువలతో తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియచేస్తూ పిల్లలందరికి ఉపరాష్ట్రపతి ఆశీస్సులు అందజేశారు.

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు పిల్లల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పిల్లల పండుగను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నా.. మన సంస్కృతి సంప్రదాయాలు, భాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించటం సంతోషమన్నారు. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచి పోయానన్నారు. మరొక అతిథిగా విచ్చేసిన వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామ రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం.. అన్నిరకాల ప్రదర్శనలు చేయటం అద్భుతమని కొనియాడారు.

ఇంకా అతిథులుగా మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పడు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్, శుబోదయం ఇన్‌ఫ్రా ఛైర్మన్‌ లక్ష్మీప్రసాద్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వాహకులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం రెండు గ్రూపులుగా (5 నుంచి 10 సంవత్సరాలు, 11 నుంచి 16 సంవత్సరాలు) నిర్వహించిన క్యిజ్ పోటీల విజేతలని ప్రకటించారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యపాత్రను పోషించిన విక్రం సుఖవాసి, వెంకప్ప భాగవతుల, ప్రదీప్ కుమార్, ఎం.బి. రెడ్డి, గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని భాగస్వామ్య సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్‌గా స్విఫ్ లెర్న్ సంస్థ, ప్లాటినం స్పాన్సర్‌గా శుబోదయం ఇన్‌ఫ్రా, గోల్డ్ స్పాన్సర్‌గా కుదరవల్లి ఫౌండేషన్ తమ సహాయ సహకారాలు అందించాయి. మీడియా భాగస్వాములుగా కువైట్ ఆంధ్రా, మాగల్ఫ్ వ్యవహరించగా.. సాంకేతిక సహకారాన్ని సింగపూర్ సంస్థ ఆర్కే మీడియా అందించింది.

తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపిక రావి, తెలుగు కళా సమితి ఒమన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కడించెర్ల, ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షులు సత్యనారాయణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాల అధ్యక్షులు వేద మూర్తి, తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమా అధ్యక్షులు వెంకట సురేశ్‌..  పిల్లలు జీవితంలో అలవర్చుకోవాల్సిన వివిధ అంశాలైన క్రమశిక్షణ, నిజాయతీ, ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం, సహాయం చేయడం, జ్ఞానము, ఏకాగ్రత లాంటి ప్రేరణ కలిగించే అంశాలమీద ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు. ఈ 12 గంటల కార్యక్రమానికి పిల్లలే వ్యాఖ్యాతలుగా ఉండటం ప్రతేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలచే వివిధ అంశాలమీద చర్చా వేదికలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని