నువ్వొస్తానంటే.. నేను రానిస్తానా!

ఉప్పల్‌కు చెందిన యువతి బీటెక్‌ పూర్తిచేసి క్యాంపస్‌ కొలువు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్న అబ్బాయితో పెళ్లిచేస్తే కుమార్తె జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు భావించారు.

Updated : 23 Nov 2021 09:24 IST

ప్రవాసులను పెళ్లాడిన యువతులకు వీసా చిక్కులు

నిబంధనలు, మోసాలతో పలువురు పుట్టింటికే పరిమితం

* ఉప్పల్‌కు చెందిన యువతి బీటెక్‌ పూర్తిచేసి క్యాంపస్‌ కొలువు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్న అబ్బాయితో పెళ్లిచేస్తే కుమార్తె జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు భావించారు. మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం నచ్చడంతో ఘనంగా పెళ్లి చేశారు. మూడు నెలల తర్వాత అల్లుడు అగ్రరాజ్యం చేరాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లాలని అడుగుతుంటే.. వీసా నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాత్కాలిక వీసాపై అక్కడ ఉంటున్న అతను ఆర్థిక అవసరాల కోసమే పెళ్లి చేసుకున్న విషయం వెలుగుచూడటంతో భోరుమన్నారు.

* విజయవాడ యువతికి నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఉంటున్న యువకుడితో పెళ్లయింది. హెచ్‌1 వీసా ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. తాను ప్రాసెస్‌ చేస్తున్నానంటూ భర్త చెబుతూ వచ్చాడు. 2019 తర్వాత కొవిడ్‌ నిబంధనలతో మరో రెండేళ్లు గడిచాయి. ఆమె తాజాగా మూడోసారి ప్రయత్నాలు ప్రారంభించింది..

లక్షలు సంపాదించే ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. తమ కుమార్తె సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవాస వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతుంటారు. కోరినన్ని లాంఛనాలిచ్చి అట్టహాసంగా వివాహం చేస్తారు. అయితే, మూడుముళ్లు పడ్డాక కాపురానికి వెళ్లే విషయంలో కొందరికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనలతో పలువురు ఆగిపోతుండగా.. అల్లుళ్ల మోసాలతో మరికొందరు పుట్టింటికే పరిమితం అవుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్‌, ఐర్లాండ్‌, కెనడా, డెన్మార్క్‌ తదితర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న జీవిత భాగస్వామి వద్దకు వెళ్లేందుకు ఏపీ, తెలంగాణల నుంచి సుమారు 3000-4000 మంది వరకు యువతులు వీసాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. వీరిలో నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉన్న వారు 500-600 మంది వరకూ ఉన్నట్టు పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.

విదేశీ అల్లుళ్ల నాటకాలెన్నెన్నో..

కెనడాలో ఉంటున్న యువకుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పి వరంగల్‌ యువతిని వివాహమాడాడు. భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా ఏవో కారణాలు చెబుతున్న అల్లుడి గురించి అత్తింటివారు ఆరా తీయగా.. తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తేలింది. ఐర్లాండ్‌లో ఉంటున్న హైదరాబాద్‌ యువకుడు గుంటూరు యువతిని పెళ్లాడాడు. విజిటింగ్‌ వీసాపై ఉన్న అతడు పర్మనెంట్‌ రెసిడెన్సీ ఉందంటూ మోసం చేసి రూ.లక్షల్లో లాంఛనాలు గుంజాడు. తెలంగాణలో ఐదేళ్ల వ్యవధిలో విదేశీ పెళ్లికొడుకుల మోసాలు, వేధింపులకు సంబంధించి సుమారు 500 కేసులు నమోదయ్యాయి. అధికశాతం బాధితులు వివాహ పరిచయ వేదికలు/మధ్యవర్తులు చెప్పిన వివరాలనే గుడ్డిగా నమ్ముతున్నారని.. ఇది సరికాదని ఐర్లాండ్‌కు చెందిన ప్రవాస శాస్త్రవేత్త తాటి రమేశ్‌ పేర్కొన్నారు.  


అన్నీ పరిశీలించాకే ముందుకెళ్లాలి

- బి.సుమతి, డీఐజీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం

ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా జీవిత భాగస్వామికి వీసా మంజూరు చేస్తుంటారు. కొన్నిసార్లు సహజంగానే ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రవాస పెళ్లికొడుకుల మోసాలూ వెలుగు చూస్తున్నాయి. అలాంటప్పుడు జీవిత భాగస్వామికి వీసా రావటం కష్టమవుతుంది. మధ్యవర్తుల మాటలను నమ్మకుండా పెళ్లికి ముందే యువకుడి పాస్‌పోర్టు రెన్యువల్‌, వీసా, ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని