చావుబతుకుల మధ్య 54 రోజులు: దుబాయ్‌లో కోలుకున్న భారతీయుడు

అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఇనెఫెక్షన్‌ బారిన పడిన భారతీయుడు

Updated : 07 Dec 2021 13:26 IST

దుబాయ్‌: అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ఇనెఫెక్షన్‌ బారిన పడిన భారతీయుడు ఒకరు, 54 రోజులపాటు చావుబతుకుల మధ్య పోరాటం చేసి చివరకు విజయవంతంగా మృత్యువు కోరల నుంచి బయటపడ్డారు. గోవాకు చెందిన 42 ఏళ్ల నితేశ్‌ సదానంద్‌ మడ్గావ్‌కర్‌ దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడగా వైద్యులు పరీక్షలు చేశారు. అత్యంత ప్రాణాంతకమైన సెపేషియా సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో దాదాపు 75 శాతం మంది మరణిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 27 ఏళ్ల నుంచి యూఏఈలో ఉంటున్న నితేశ్‌ ఈ ఏడాది ఆగస్టు నెలలో సెలవుల నిమిత్తం గోవా వచ్చారు. అనంతరం ఆగస్టు చివరి వారంలో అబుదాబీ వెళ్లిపోయారు. 

ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉండగా జ్వరం రావడంతోపాటు బాగా నీరసించిపోయారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిమోనియా ఉన్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో అతని శరీరంపై వివిధ భాగాల్లో గడ్డలు రావడం మొదలైంది. ఎడమ మోకాలి వద్ద నీరు చేరింది. ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వివిధ రకాల పరీక్షలు  చేయగా.. బుర్ఖోల్డేరియా సెపేషియా బ్యాక్టీరియానే ఇందుకు కారణం అని తేలింది. దీంతో సెపేషియా సిండ్రోమ్‌ బారిన పడినట్లు నియాస్‌ ఖలీద్‌ నేతృత్వంలోని వైద్యులు నిర్ధారించారు. అనంతరం నితేశ్‌ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. యాంటీ ఫంగల్‌ ఔషధాలు, స్టెరాయిడ్లు, డబుల్‌ 4 యాంటీబయాటిక్స్‌ అందిస్తూ చికిత్స కొనసాగించారు. అలా 54 రోజుల పోరాటం అనంతరం నితేశ్‌ వ్యాధిని సంపూర్ణంగా జయించారు. బయట ప్రపంచాన్ని చూడగలిగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని