Britain:కేర్‌ వర్కర్స్‌వీసా నిబంధనల సడలింపు

గృహాలు, ప్రభుత్వ కేంద్రాల్లో సేవలందించే సంరక్షణ కార్మికుల(కేర్‌ వర్కర్స్‌)కు వీసా 

Updated : 26 Dec 2021 10:49 IST

వార్షిక వేతనాలూ ఖరారు

లండన్‌: గృహాలు, ప్రభుత్వ కేంద్రాల్లో సేవలందించే సంరక్షణ కార్మికుల(కేర్‌ వర్కర్స్‌)కు వీసా నిబంధనల్లో సడలింపునిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌ సహా పలు దేశాల నుంచి వచ్చే వారు 12 నెలల పాటు ఇక్కడ నివసించేందుకు అవకాశం కల్పించేలా ‘యూకే హెల్త్‌ అండ్‌ కేర్‌ వీసా’లను జారీ చేస్తామని తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో సామాజిక సంరక్షణ సేవల అవసరం బాగా పెరిగిందని పేర్కొంది. ప్రభుత్వ సంరక్షణ గృహాలు, సొంత ఇళ్లలో ఉండే వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల ఆలనాపాలనాతో పాటు వివిధ సేవలు, సహాయ సహకారాలు అందించేందుకు వేల మంది సిబ్బంది అవసరమైనందున వారి నియామక నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న సంరక్షణ సేవల సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనిని తగ్గించుకునేందుకు వీసా నిబంధనల్లో సడలింపునిస్తున్నామని బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతీ పటేల్‌ తెలిపారు. వృత్తిదారుల కొరత జాబితాలో సంరక్షణ కార్మికులను చేర్చి వార్షిక కనీస వేతనాన్ని కూడా ఖరారు చేయనున్నారు. ఏడాదికి కనీసంగా రూ.20.67లక్షలు (20,480 బ్రిటన్‌ పౌండ్లు) వేతనంగా అందించే అవకాశం ఉంది. సామాజిక సేవల రంగంలో పనిచేసే సిబ్బంది తమపై ఆధారపడే భార్య లేదా భర్త, పిల్లలను బ్రిటన్‌కు తీసుకొని రావచ్చు. శాశ్వత నివాస అవకాశాన్నీ వీరికి కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 12 నెలల పాటు ఈ సడలింపునివ్వాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు వెల్లడించింది. బ్రెగ్జిట్‌ తర్వాత ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేసేందుకు వచ్చే శ్రామికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని