Pravasi Bharatiya Divas: పుట్టిన గడ్డ..మురిసెను బిడ్డా!

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

Updated : 09 Jan 2022 12:00 IST

సర్కారు బడుల బాగుకు ఎన్నారైల చేయూత
రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాలలు
ఇతర అభివృద్ధి పనులకూ రూ.కోట్లలో నిధులిస్తూ దాతృత్వం

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము’’

అంటూ కవి రాయప్రోలు సుబ్బారావు నినదించినట్టు...ప్రవాసీయులు మాతృభూమి సేవలో తరిస్తున్నారు. ఏ దేశంలో స్థిరపడినా తాము పుట్టి పెరిగిన ప్రాంతంపై మమకారాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కువ మంది తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తూ భావిభారత పౌరుల భవిష్యత్తుకు బాటలు వేస్తుండగా, మరికొందరు గ్రామం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో స్థిరపడిన వారు సేవలో ముందుంటూ రోగాలకే కాదు..సొంతూరి సమస్యకూ చికిత్స చేస్తామంటున్నారు. ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా అలాంటి కొందరి సేవలపై ‘ఈనాడు’ కథనం.


రూ.కోటిన్నరతో బడి నిర్మాణం.. ఐటీ విద్యకు శ్రీకారం!

రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం తోల్కట్టలో భాస్కర్‌రావు సమకూర్చిన నిధులతో నిర్మిస్తున్న పాఠశాల భవనం

అమెరికాలోని హోస్టన్‌లో ఇంజినీరుగా స్థిరపడిన మంత్రిప్రగడ భాస్కర్‌రావు రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం తోల్కట్ట గ్రామంలో బడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఊరిలో ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం కేటాయించగా, అందులో రూ.కోటిన్నరతో 12 తరగతి గదులను నిర్మిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు ఐటీని వినియోగించే సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో అందుకు అనుగుణమైన సదుపాయాలను కల్పించేందుకు వనరులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, హాజరు తదితర వాటిని తల్లిదండ్రులు తెలుసుకునేలా వెబ్‌సైట్‌ను ఇప్పటికే రూపొందించారు. డిజిటల్‌ బోధనకు వీలుగా అన్ని తరగతుల పాఠాలను డిజిటలీకరించే పనులూ పూర్తిచేశారు. అంతేకాదు గత రెండేళ్లుగా ఆయన అమెరికా నుంచి తరచూ పాఠశాల ఉపాధ్యాయులతో జూమ్‌ ద్వారా మాట్లాడుతూ పాఠశాల, పిల్లల పురోభివృద్ధిని తెలుసుకుంటూ సూచనలు ఇస్తున్నారు.

భాస్కర్‌ రావు


సొంతింటినే బడిగా మార్చిన డాక్టర్‌ గండ్ర విద్యాధర్‌రావు

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం  సాతారంలో ప్రాథమిక పాఠశాలగా మారిన గండ్ర విద్యాధర్‌రావు ఇల్లు

అమెరికాలోని డ్రాన్‌ఫోర్ట్‌లో గుండె వైద్యుడిగా స్థిరపడిన గండ్ర విద్యాధర్‌రావుది జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామం. గత పాతికేళ్లుగా ఆ గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పటివరకూ కోటి రూపాయాలకు పైగా సాయం చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు సరైన తరగతి గదులు, వసతులు లేకపోవడాన్ని గుర్తించి..1995లోనే లక్షల విలువైన సొంత ఇంటిని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. ఆ రోజుల్లోనే బడిలో కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా కంప్యూటర్‌ ల్యాబ్‌ను సమకూర్చారు. ఇప్పటికీ అదే ఇంట్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆట స్థలం లేదని తెలుసుకుని గ్రామ శివారులో రెండు ఎకరాలు కొనిచ్చారు. ప్రస్తుతం ఇదే స్థలంలో నూతనంగా జడ్పీ ఉన్నత పాఠశాలను ఏర్పాటుచేసి తరగతులను బోధిస్తున్నారు.

విద్యాధర్‌రావు


దయగల ‘హృదయం’ డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి సొంతం

తొర్రూరు మండలం చెర్లపాలెంలో ప్రాథమిక పాఠశాల. (అంతరచిత్రంలో) కంప్యూటర్‌ ల్యాబ్‌

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయ దంపతులు అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీరెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. గత 35 ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెవైద్య నిపుణులుగా పనిచేస్తున్న రాజేందర్‌రెడ్డి చర్లపాలెంలో రూ.10 లక్షలతో ప్రాథమిక పాఠశాల, మరో రూ.10 లక్షలతో గ్రంథాలయాన్ని నిర్మించారు. అదే ఊరిలోని ఉన్నత పాఠశాలలో రూ.2 లక్షలతో సైన్స్‌ల్యాబ్‌, డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలం కాచికల్‌ గ్రామంలో రూ.10 లక్షలతో, ములుగు మండలం పందికుంటలో రూ.25 లక్షలతో పాఠశాల భవనాలు నిర్మించారు. ఝాన్సీరెడ్డి తన స్వగ్రామం ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో రూ.25 లక్షలతో బడి నిర్మించారు. ఇంకా ఆసుపత్రి, కమ్యూనిటీ భవనాల్లాంటివి అనేకం నిర్మించారు.

అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీరెడ్డి


తండ్రి పేరిట తరగతి గదులు

సిరిసిల్లలో విఠల్‌ దాతృత్వంతో నిర్మించిన పాఠశాల (అంతరచిత్రంలో) తరగతి గదిలో ప్రొజెక్టర్‌, తెర

సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కుసుమ విఠల్‌ అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. ఇదే పట్టణంలోని శివనగర్‌ ఉన్నత పాఠశాలలోనే పాఠశాల విద్య పూర్తిచేసిన ఆయన..దాదాపు ఏడేళ్ల క్రితం ఆ బడికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తండ్రి కుసుమ రామయ్య పేరిట రెండు తరగతి గదులను నిర్మించారు. రెండేళ్ల క్రితం మరో రూ.4 లక్షలు సమకూర్చారు. వాటితో తొమ్మిది ప్రొజెక్టర్లు, తెరలు కొనుగోలు చేశామని ప్రధానోపాధ్యాయుడు పరబ్రహ్మమూర్తి తెలిపారు.

విద్యార్థులతో విఠల్‌


చదువుల గుడి రూపు మారుస్తోన్న డాక్టర్‌ మాధవి దంపతులు

మెదక్‌ జిల్లా మాసాయిపేటలో ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో బల్లలు.

మెదక్‌ జిల్లా మాసాయిపేటకు చెందిన మాధవి ప్రస్తుతం లండన్‌లో వైద్యురాలిగా స్థిరపడ్డారు. సొంతూరికి వచ్చినప్పుడల్లా తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించేవారు. తాను అక్షరాలు దిద్దిన చదువుల గుడి రూపుమార్చాలని సంకల్పించారు. భర్త డాక్టర్‌ శ్రీకాంత్‌ సహకారంతో ఇటీవలే రూ.4.50 లక్షలు ఖర్చుచేసి 120 బల్లలు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ సమకూర్చారు. ఎనిమిది గదుల భవనానికి రంగులు వేయించారు. ఇంకా ఉన్నత పాఠశాలలో రూ.1.50 లక్షల ఖర్చుతో సైన్స్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయించారు. త్వరలోనే పాఠశాలలో డిజిటల్‌ తరగతి గది, కంపూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయిస్తామని ఇటీవల పాఠశాలలను సందర్శించిన డాక్టరు దంపతులు హామీ ఇచ్చారు.

మాధవి, శ్రీకాంత్‌


ఎగిరిపోతాం.. ఏ దేశానికైనా!
తెలంగాణ వాసుల్లో ప్రవాసానికి పెరుగుతున్న ఆదరణ
విద్య, ఉద్యోగాల కోసం భారీగా విదేశాలకు పయనం
గతంలో గల్ఫ్‌కే.. ఇప్పుడు అన్ని దేశాలకూ

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గతంలో ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకే ఎక్కువ మంది వెళ్లేవారు. ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు తెలంగాణ వాసులు తరలిపోతున్నారు. ముఖ్యంగా యువత విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్య కోసం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. రాష్ట్రం నుంచి 1970 ప్రాంతంలోనే గల్ఫ్‌ దేశాలకు వలసలు మొదలయ్యాయి. 1980 నుంచి వైద్య, ఇతర వృత్తి నిపుణులు అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్లడం అధికమైంది. 1990 తర్వాత ఐటీ రంగం పురోగమనంతో యువత ఉన్నత విద్య కోసం ఎక్కువగా అమెరికా బాట పట్టింది. అప్పట్నుంచి ఎమ్మెస్‌, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యా, ఇంగ్లండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ‘‘ప్రస్తుతం ఏటా తెలంగాణ నుంచి సరాసరిన 60 వేల మంది విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్నారు. అందులో ఎక్కువ మంది అమెరికాను ఎంచుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల కోసం తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ఏటా వెయ్యి మందికి రూ.20 లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చాక మధ్య తరగతి నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య బాగా పెరిగింది’’ అని ప్రవాసీ తెలంగాణ సంఘాలు పేర్కొంటున్నాయి. అలా వెళ్లిన వారిలో 80% మంది ఉద్యోగాలు పొంది అక్కడే స్థిరపడుతున్నారని తెలిపాయి. ఇదే కాదు ఇటీవల ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసే తెలంగాణ వాసుల సంఖ్యా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి అన్ని దేశాల్లో కలిపి 1.80 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత వైద్యరంగంలో 90 వేల మంది వైద్యులు, ఫార్మాసిస్టులు, నర్సులుగా విదేశాల్లో స్థిరపడ్డారు. గల్ఫ్‌లో ఎక్కువ మంది సాధారణ అర్హతల (బ్లూకాలర్‌)తో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా తెలంగాణ ప్రవాసులు సంఘాలను ఏర్పాటుచేసి వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.

కరోనా వచ్చినా...

రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా ప్రపంచాన్ని అతలాకులతం చేసింది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌ ఇతర దేశాలు తల్లడిల్లిపోయాయి. ఇది విమాన ప్రయాణాలు, చదువులపై ప్రభావం చూపింది. ఈ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయి గల్ఫ్‌ దేశాల నుంచి దాదాపు లక్ష మంది స్వగ్రామాలకు తిరిగివచ్చారు. కొత్తగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గలేదు. ఇంకా పెరిగింది. 2020లో 49 వేల మంది ఇక్కణ్నుంచి కొత్తగా విదేశాలకు వెళ్లగా, 2021లో ఆ సంఖ్య 51 వేలకు పెరిగింది. ఈ రెండేళ్లలో మరో 80 వేల మంది విద్యార్థులు చదువుల కోసం వెళ్లారు.

రాజకీయంగానూ పాగా..పెట్టుబడుల ఆకర్షణలో భూమిక

విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు ఆయా దేశాల రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానికంగా జరిగే ఎన్నికల్లోనూ పాల్గొంటున్నారు.  ఇటీవలే ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని స్ట్రాట్‌ పీడ్స్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్లోల్ల సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. న్యూసౌత్‌వేల్స్‌లోని బ్లాక్‌టౌన్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యునిగా సికింద్రాబాద్‌ వాసి చెట్టిపల్లి లివింగ్‌స్టన్‌ ఎన్నికయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా, పరిశ్రమలు స్థాపించేలా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలోనూ ప్రవాసీయులు కీలక భూమికి పోషిస్తున్నారు. కరోనా సమయంలో భారీ వితరణ చేశారు. విదేశాల్లో రాష్ట్ర వాసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో..వారి సంక్షేమం, చేయూత కోసం ప్రత్యేక విధానాన్ని(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.-ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు యంత్రాంగం

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts