Pravasi Bharatiya Divas: ఊరి కోసం ఉదారత

ఆయన సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచే ఎన్నో

Updated : 09 Jan 2022 12:02 IST

ప్రకాశం జిల్లాలో నెప్పల సుబ్బారాయుడి సేవా కార్యక్రమాలు
పేదలకు ఇళ్లు..  రైతుల కోసం ఎత్తిపోతల పథకాలు
28 ఏళ్లుగా కొనసాగుతున్న సేవాయజ్ఞం

ఈనాడు డిజిటల్, ఒంగోలు: ఆయన సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, ఫార్మా రంగంలో ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి... ఏకంగా అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకుడి స్థాయికి ఎదిగారు. తన సొంతూరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఛారిటుబుల్‌ ట్రస్టు ప్రారంభించి భారీస్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే ప్రవాసాంధ్రుడు నెప్పల సుబ్బారాయుడు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు వాసి. 1994లో నెప్పల సుబ్బారాయుడు-శారద ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో 28 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ.12 కోట్ల వరకూ వెచ్చించారు. తద్వారా గ్రామానికి ఆయన సృష్టించి ఇచ్చిన ఆస్తి విలువ... ఇప్పుడు అంతకు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది. 

పేదల కోసం ఇళ్ల నిర్మాణం

మద్దిరాలపాడులో ఎస్సీల కోసం 5 ఎకరాల భూమి కొని, అందులో 124 పక్కా గృహాలు నిర్మించి పంపిణీ చేశారు. ‘నెప్పల సుబ్బారాయుడు-శారద’ కాలనీగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. రోడ్డు పక్కన గుడారాల్లో ఉంటున్న 25 మందిని గుర్తించి వారి కోసం స్థలం కొని ఇల్లు కట్టించి ఇచ్చారు.  అక్కడ ఓ ఆడిటోరియం నిర్మించారు. కల్యాణ  మండపం  కోసం స్థలం కొన్నారు.

ఎత్తిపోతలకు చేయూత

చేకూరుపాడులో తన సొంత నిధులు రూ.1.20 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించారు. దాని కింద ప్రస్తుతం 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. చీర్వానుప్పలపాడు, మద్దిరాలపాడులో ప్రభుత్వ నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు ఆర్థిక సాయం అందించారు. వాటిద్వారా 150 ఎకరాలకు సాగునీరు అందుతోంది. 

విద్య, వైద్యానికి చేయూత

> మద్దిరాలపాడులో పీహెచ్‌సీ భవనం, చేకూరుపాడు హైస్కూలుకు రెండు గదులు నిర్మించి ఇచ్చారు. మద్దిరాలపాడులో వంద మరుగుదొడ్లు నిర్మించారు. 

> పాఠశాలలకు సామగ్రితో పాటు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించారు. 

> మద్దిరాలపాడు, చదలవాడలో సిమెంటు రహదారులు నిర్మించారు. మద్దిరాలపాడు, కె.బిట్రగుంటలో బస్సు షెల్టర్లు నిర్మించారు. 

> వృద్ధులకు దుస్తుల పంపిణీ, అంధత్వ నివారణ కోసం రెడ్‌క్రాస్‌ సొసైటీకి రూ.కోట్ల ఆర్థికసాయం అందజేశారు. 

> సుబ్బారాయుడు సేవలకు గుర్తింపుగా 2003లో అప్పటి నాటి మంత్రి దామచర్ల ఆంజనేయులు, 2004లో అప్పటి ఆర్థిక మంత్రి కె.రోశయ్య రాష్ట్రప్రభుత్వ పురస్కారాలు అందించారు. 

మా గ్రామ ప్రజలంతా బాగుండాలి

నేనే కాదు.. మా గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని, వారి జీవితాలు మెరుగుపడాలని, వారు అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. అందుకే సొంతూరికి నా వంతు సాయంగా ఇవన్నీ చేశాను. సమాజానికి నా వంతుగా సేవ చేయాలనేదే నా తపన. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను. - నెప్పల సుబ్బారాయుడు, ప్రవాసాంధ్రుడు


బడి బాగుకు రూ.20 లక్షలు
ఉన్నత పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన మురళీ దామోదర్‌ 

గుడ్లవల్లేరు (కృష్ణా), న్యూస్‌టుడే: అమెరికాలో స్థిరపడిన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన కానూరి మురళీ దామోదర్‌.. తన స్వగ్రామంలో ఉన్నత పాఠశాల అభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు. ట్రస్టు ఏర్పాటు చేసి.. దాని ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కౌతవరంలోని కానూరి దామోదరయ్య జడ్పీ హైస్కూలు అభివృద్ధిలో భాగంగా.. కంప్యూటర్ల కోసం రూ.10 లక్షలు, సైకిల్‌ స్టాండు ఏర్పాటుకు రూ.3 లక్షలు, వంటగది, డైనింగ్‌ టేబుళ్ల కోసం రూ.3 లక్షలు, సైన్స్‌ ల్యాబ్‌లలో పరికరాల కొనుగోలుకు మరో రూ.4 లక్షలు కేటాయించారు. తమ సొంత ఊళ్లో తాత పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలను చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలన్నింటినీ ఒకేసారి తొలగించేందుకు అవసరమైన సహాయం మురళీ దామోదర్‌ అందజేశారు. 


జన్మభూమి రుణం తీర్చుకోవాలని..
నెల్లూరు జిల్లాలో ప్రవాసాంధ్ర వైద్యుడు ఎన్‌.ప్రేమసాగర్‌ రెడ్డి సేవలు

వెంకటాచలం, న్యూస్‌టుడే: ఆయన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పల్లె నుంచి ప్రస్థానం ప్రారంభించి పట్టుదలతో చదివి అమెరికాలో ప్రముఖ వైద్యునిగా ఎదిగారు. తన ఉన్నతికి కారణమైన జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకుని సొంతూళ్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనే ప్రవాసాంధ్రుడు డా.ననమాల ప్రేమసాగర్‌ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం వాసి. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆయన తన గ్రామంలోని పాఠశాలకు వసతులు కల్పించటంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. దీని కోసం ఇప్పటివరకూ కోట్ల రూపాయలు వెచ్చించారు. 

పాఠశాల అభివృద్ధికి అండగా...​​​

నిడిగుంటపాలెం ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆయన అండగా నిలిచారు. పన్నెండేళ్లుగా అవసరమైన సందర్బాల్లో నిధులు ఇస్తూనే ఉన్నారు. పాఠశాల, బాలికల వసతిగృహాల భవనాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2.50 కోట్లు వెచ్చించారు. భవనాలకు కావల్సిన భూమినీ సొంత డబ్బులతో కొన్నారు.

> పాఠశాలకు బెంచీలు, ఇతర సామగ్రి అందించారు. ప్రధానరోడ్డు నుంచి పాఠశాల వరకూ సీసీ రహదారి నిర్మించారు.

సీసీ రోడ్లు.. మురుగునీటి కాలవలు

> రూ.1.60 కోట్లు వెచ్చించి గ్రామమంతా పూర్తిగా సీసీ రోడ్లు నిర్మించారు. రూ.75 లక్షలతో ఇరువైపులా మురుగునీటి కాలవల నిర్మాణం చేపట్టారు. 

> గ్రామంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో 12 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వెచ్చించి ప్లాంటు ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి నెలా దాని నిర్వహణ వ్యయమంతా భరిస్తున్నారు. 

పేదలకు ఇళ్ల కోసం సాయం​​​​​​

> ప్రభుత్వ పథకాలతో ఇళ్లు కట్టుకుంటున్న పేదలకు తనవంతుగా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. గ్రామంలోని మొత్తం 330 మంది లబ్ధిదారులకు రూ.33 లక్షల మేర సాయం చేశారు. 


పిల్లలకు పుస్తకాలు..గ్రామ ప్రజలకు తాగునీరు

తవణంపల్లి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం అరగొండ గొల్లపల్లిలో తాగునీటి ప్లాంటు ఏర్పాటుతోపాటు పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాల్ని అందిస్తోంది పాపుదేశి ఫౌండేషన్‌. గ్రామానికి చెందిన వేణుగోపాల నాయుడి కుమారుడు ప్రసాద్‌.. 2010లో ఫౌండేషన్‌ ప్రారంభించారు. తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఏటా రూ.2 లక్షల విలువైన పుస్తకాలు, పెన్నులు, విద్యా సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదును అందిస్తున్నారు. తవణంపల్లె మండలంలోని ఎంఈవో కార్యాలయానికి రెండు కంప్యూటర్లు, అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో నీటి నిల్వకు సంపు, విద్యుత్‌ మోటారు ఇచ్చారు. జన విజ్ఞాన వేదిక ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రజలకు మంచినీటిని అందించేందుకు యోగీశ్వర్‌ నాయుడు, పాపుదేశి ఫౌండేషన్‌ సంస్థ రూ.10 లక్షలతో సాయితీర్థం పేరుతో మినరల్‌ వాటర్‌ ప్లాంటును నిర్మించారు.


తండ్రి స్ఫూర్తి.. సేవాదీప్తి

రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు

విద్యార్థులకు ప్రోత్సాహం.. ప్రముఖులకు పురస్కారాలు

​​​​​​

గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తన తండ్రి రామినేని అయ్యన్నచౌదరి లక్ష్యాన్ని.. తనయుడైన ధర్మప్రచారక్‌ స్వీకరించారు. రహదారులు, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేశారు. మరెన్నో వసతులు కల్పించారు. తమ సేవలను గ్రామానికి పరిమితం చేయకుండా.. జిల్లావ్యాప్తంగా విస్తరించి పేద విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నారు. గురువులను సత్కరిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన అయ్యన్న చౌదరి ఆమెరికాలోని ఒహాయోలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడైన ధర్మప్రచారక్‌.. గ్రామాభివృద్ధికి సేవలదించే ఆలోచనతో ‘డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌’ ద్వారా రూ.2 కోట్లు కేటాయించారు. దీనికి జిల్లాపరిషత్తు ఎన్‌ఆర్‌ఐ విభాగం ద్వారా రూ.3 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వడంతో రూ.5 కోట్లతో సిమెంటు రోడ్లు, పశు వైద్యశాల, ఆధునిక వసతులతో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, గ్రామస్తులకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఓవర్‌హెడ్‌ ట్యాంకును నిర్మించారు. రామాలయం, పెదవడ్లపూడిలో వినాయకుడి గుడికి నిధులు సమకూర్చారు. గుంటూరులో పోలీసు కంట్రోల్‌ రూమ్, సీసీ టీవీ కెమెరాలకు రూ.20 లక్షలు అందించారు. 

> స్మార్ట్‌ విలేజ్‌ పథకంలో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.20 లక్షలతో 263 మరుగుదొడ్లను నిర్మించారు. కరోనా సమయంలో 1,500 మందికి చైతన్య కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించారు. 

విద్యార్ధులకు ప్రోత్సాహం.. గురువులకు సత్కారం

అయ్యన్న చౌదరి 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పిల్లలు 1999 అక్టోబరు 12న రామినేని ఫౌండేషన్‌ని భారతదేశంలో ప్రారంభించారు. నాటి నుంచి కళలు, విజ్ఞాన, మానవీయ శాస్త్రాల్లో ప్రముఖులను విశిష్ఠ, విశేష పురస్కారాలతో సన్మానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ముగ్గురికి, మండలస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచినవారికి ప్రతిభ పురస్కారాలను అందజేస్తున్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన జడ్పీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను గురు పురస్కారాలతో సన్మానిస్తున్నారు.

భావితరాలకు మంచి సందేశం

‘పేద విద్యార్థులకు చేయూత అందించాలని నాన్న ఆలోచించేవారు. అందుకే వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. గురువులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను గుర్తించి పురస్కారాలివ్వడం మా బాధ్యతగా భావిస్తున్నాం. భావితరాలకు దీని ద్వారా మంచి సందేశం ఇవ్వవచ్చు’ అని ధర్మప్రచారక్‌ పేర్కొన్నారు. 


సొంత ఊరు కాకున్నా.. తనవంతు సాయం

 పార్వతీపురంలో ప.గో. ప్రవాసాంధ్రుడి సేవలు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆయనది ఆ ప్రాంతం కాదు.. కానీ పల్లెలో తన సేవలు అవసరమని భావించి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రవాసాంధ్రుడు మోహన్‌ సుధీర్‌ పట్టా. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా. ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఉంటున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల గ్రామంలో మౌలిక వసతుల కల్పన, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ.36 లక్షల వరకూ వెచ్చించారు.

జలశుద్ధి కేంద్రం.. గ్రంథాలయం

> గ్రామంలో రూ.20 లక్షలు వెచ్చించి రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కింది భాగంలో జల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్నుంచి గ్రామమంతటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నారు. 

> గ్రంథాలయం, నైపుణ్య శిక్షణకేంద్రాల ఏర్పాటు కోసం రెండో అంతస్తు నిర్మించారు. గ్రంథాలయం త్వరలో ప్రారంభం అవుతోంది. వృత్తి విద్యల్లో యువతకు శిక్షణ కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 

> గ్రామంలోని పాఠశాలకు మరమ్మతులు చేయించారు. కాలవల్లో పూడికతీత పనులు చేయించారు. పాఠశాల కోసం ఇప్పటివరకూ రూ.4-5 లక్షలు వెచ్చించారు.

అనారోగ్యం బారిన పడకూడదని..

‘రక్షిత నీరు అందుబాటులో లేక అనారోగ్యాల బారిన పడుతున్న ఉదంతాల్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో జలశుద్ధి  కేంద్రాన్ని ఏర్పాటు చేశాను. విద్య, వైద్య సదుపాయాలు అందించాలనేది నా ఉద్దేశం’ అని ప్రవాసాంధ్రుడు మోహన్‌ సుధీర్‌ పట్టా వివరించారు. 


తన కష్టం ఎవరికీ రాకూడదని..

 నాడు ట్యూషన్లు చెబుతూ చదువు.. నేడు ఉపకార వేతనాలతో చేయూత

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల మధ్యే ఆయన చదువుకున్నారు. ట్యూషన్లు చెబుతూ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఆపై ఉన్నతస్థాయికి ఎదిగి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తాను పడిన కష్టాలు మరెవరూ పడకూడదని.. చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని భావించారు. అలాంటి వారికి సాయం అందించేందుకు ప్రతిభా స్కాలర్‌షిప్‌ ట్రస్టును ప్రారంభించారు. ఆయనే ప్రవాసాంధ్రుడు చెక్కపల్లి రమేష్‌. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వాసి. 2008 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన ట్రస్టు ద్వారా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు తొమ్మిదేళ్లుగా ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్, మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంటెక్, ఎంబీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఈ ఉపకార వేతనం అందిస్తారు. తొలుత ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వారిలో అర్హులు, ప్రతిభావంతుల్ని గుర్తిస్తారు. విద్యార్థులకు అవసరాన్ని బట్టి రూ.15-30 వేల వరకూ ఆర్థికసాయం అందిస్తారు. గత తొమ్మిదేళ్లలో రూ.13.87 లక్షల ఉపకారవేతనం అందించారు. ఇప్పటివరకూ ఈ ట్రస్టు నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు ఉపకారవేతనాలు పొందారు. వారిలో కొందరు ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. 

పిల్లలను ఆదుకోవాలనే...

 

‘చాలా మంది పేద విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు మానేస్తున్నారు. అలాంటి వారికి సాయం అందించాలనే ప్రతిభా స్కాలర్‌షిప్‌ ట్రస్టు ఏర్పాటు చేశాను’ అని చెక్కపల్లి రమేష్‌ వివరించారు. 


‘ఊపిరి’ అందించిన వైద్యులు

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ రెండో దశలో.. ఆక్సిజన్‌ కొరత తీవ్రస్థాయిలో వచ్చింది. విజయవాడలోనూ ప్రభుత్వాసుపత్రులు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సిద్దార్ధ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి రూ.3 కోట్లతో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటులో భాగస్వాములయ్యారు. విదేశాల్లో వైద్యులుగా స్థిరపడిన పలువురు ప్రముఖులు దీనికి రూ.35 లక్షల వరకు సాయం అందించారు. రెండు ప్లాంట్లు కలిపి నిమిషానికి 3,500 లీటర్ల ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. ఆక్సిజన్‌ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ట్యాంకుల్లో నింపాల్సిన అవసరం లేకుండా.. నేరుగా గాలిలో నుంచి తీసుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. తాము చదువుకున్న కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్‌ కొరతను శాశ్వతంగా నివారించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులంతా కలిసి చేపట్టినట్టు కార్యక్రమానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ అమ్మన్న తెలిపారు. 


చదువుల కోసం రూ.కోటి!

ఇన్ఫోవిజన్‌ సీఈవో సత్య శ్రీనివాస్‌ సేవలు


విజయవాడ (కానూరు), న్యూస్‌టుడే: అమెరికాలోని అగ్రశేణి సీఈవోల్లో ఇన్ఫోవిజన్‌ సీఈవో యలమంచిలి సత్యశ్రీనివాస్‌ ఒకరు. ఉన్నతస్థానానికి ఎదిగిన ఆయనకు చదువుల విలువేంటో తెలుసు. అందుకే పేద విద్యార్థుల చదువుకు చేయూత అందిస్తున్నారు. కృష్ణాజిల్లా యలమర్రుకు చెందిన ఆయన.. 30 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. పేద విద్యార్థులకు తనవంతు సాయం అందించాలనే లక్ష్యంతో.. 2012లో తల్లి జ్ఞాపకార్థం యలమంచిలి వెంకాయమ్మ ట్రస్టును ఏర్పాటుచేశారు. పేదరికం, ప్రతిభ ఆధారంగా జిల్లాలోని పీజీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్, పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఏటా ఆగస్టు 25న ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఇందుకోసం సత్యశ్రీనివాస్‌ కోటి రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. దీనిపై ఏటా రూ.8 లక్షల వడ్డీ వస్తుంది. దీనికి మరో రూ.2 లక్షలు కలిపి.. ఏటా రూ.10లక్షల వరకు ఉపకారవేతనాలుగా ఇస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న శ్రీనివాస్‌ తండ్రి రామ్మోహనరావు ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. 


పీహెచ్‌సీకి నిధులిచ్చి.. భూములు సమకూర్చి

కడప (చినముండెం), న్యూస్‌టుడే: కడప జిల్లా చినమండెం మండలం మొత్తానికి ఒకప్పుడు ఒక్కటే ఆరోగ్య కేంద్రం ఉండేది. బెల్లం శిద్దారెడ్డి కుటుంబీకుల చొరవతో కొత్తపల్లెకు మరో పీహెచ్‌సీ వచ్చింది. అమెరికాలో స్థిరపడిన శిద్దారెడ్డి కుమారులు చంద్రశేఖర్‌రెడ్డి, ఆదిశేషారెడ్డి, మురళీధర్‌రెడ్డి, కుమార్తె పద్మ వైద్యసేవల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే తమ గ్రామవాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో తొలుత తమ సొంత భవనాన్ని పీహెచ్‌సీ ఏర్పాటుకు ఇచ్చారు. 2007లో ప్రభుత్వానికి రూ.10 లక్షల డిపాజిట్‌ చేయడంతో.. తల్లిదండ్రులైన బెల్లం లక్ష్మమ్మ, శిద్దారెడ్డి పేరుతో పీహెచ్‌సీని ప్రభుత్వం మంజూరుచేసింది. తర్వాత వారే చొరవ తీసుకుని పక్కా భవనాల నిర్మాణానికి 1.20 ఎకరాల స్థలం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ నిధులతో 2014లో భవనాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాడు-నేడు కింద భవనాల అభివృద్ధి, ప్రహరీ పనులు జరుగుతున్నాయి. ఒకప్పుడు వైద్యం కోసం పొరుగూరికి వెళ్లే ఆ గ్రామంలో ఇప్పుడు ఇద్దరు వైద్యులున్నారు. ఆరు గ్రామాల పరిధిలోని ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. ఈ పీహెచ్‌సీకి నీటి శుద్ధి కేంద్రం, పాఠశాలకు కంప్యూటరును కూడా శిద్దారెడ్డి కుటుంబీకులే అందించారు.  

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts