5జీ అభివృద్ధిలో కీలక పాత్ర.. డా.కల్యాణి బోగినేనికి ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలకు

Updated : 11 Jan 2022 11:11 IST

ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలకు పరిచయమైన ఈ టెక్నాలజీ త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. మొట్టమొదటగా ప్రపంచానికి 5జీని పరిచయం చేసింది వెరైజన్ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డెవలప్మెంట్ టీమ్‌లో మన తెలుగింటి ఆడపడుచు కీలక పాత్ర పోషించారన్న సంగతి అతి కొద్ది మందికే తెలుసు. 

5జీని ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజన్ ఆర్కిటెక్ట్‌లలో డాక్టర్‌ కల్యాణి బోగినేని ఒకరు.ఆ కంపెనీలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, ప్రతి సంవత్సరం వారి కంపెనీ నుంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక వెరైజన్ `మాస్టర్‌ ఇన్వెంట‌ర్` అవార్డును 2021 సంవత్సరానికి గాను ఆమెకుప్రకటించారు. అమెరికాలోని నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో ఈ తరహా అవార్డులు మహిళలకు రావడం చాలా అరుదు. చాలా మంది తెలుగు మహిళలు, భారతీయ మహిళలు పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో రాణిస్తున్నప్పటికీ.. నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో ఇటువంటి అవార్డు రావడం గర్వకారణం. ఈ సందర్భంగా.. శ్రీవేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్‌ కల్యాణిని ఆమె సహచరులు, అధ్యాపకులు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. ఆ యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కల్యాణి 1982లో బీటెక్‌(ఈఈఈ) విద్యను పూర్తి చేశారు.

1984లో ఐఐఎస్‌సీ నుంచి ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ పూర్తి చేశారు. డార్ట్ మౌత్ కాలేజీ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. 1990లో ఇంజినీరింగ్ సైన్సెస్‌లో డార్ట్ మౌత్ నుంచి ఎం.ఎస్ ప‌ట్టా పొందారు. 1993లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఎట్ బఫెలో నుంచి ఎల‌క్ట్రిక‌ల్ అండ్ కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ స‌మ‌యంలో  20కి పైగా  IEEE/ACM ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

వెరైజన్‌లో  నెట్‌వర్క్‌ అండ్ టెక్నాల‌జీ స్ట్రాట‌జీ అండ్ ప్లానింగ్‌లో 18 ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్నారు. త‌ను చేసే ప‌నిలో వ్యూహాత్మకంగా ఆలోచించడంతోపాటు సృజనాత్మకతకూ పెద్దపీట వేస్తారు. నాయ‌క‌త్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆమె  మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంకేతిక‌ రంగం, మ‌ల్టీ కంప్యూట‌ర్ ఆర్కిటెక్చర్‌‌, ఆప్టికల్, వైర్లెస్ విభాగాల్లో ఆమె అనుభ‌వం ఎంతో దోహ‌ద ప‌డింది.

2జీ నుంచి 5జీ వ‌ర‌కూ వైర్‌లెస్ నెట్‌వర్క్‌ డిజైనింగ్‌లోనూ అద్భుతమైన ప్రగతి చూపించారు. వ‌ర్చ్యువ‌లైజేష‌న్‌, సాఫ్ట్‌వేర్ ఆధారిత నెట్‌వ‌ర్కింగ్‌, కృత్రిమ మేధ, ఆటోమేష‌న్ వంటి విభాగాల్లో స‌త్తా చాటారు. IEEEలో  సీనియ‌ర్ స‌భ్యురాలే కాకుండా, సాంకేతిక క‌మిటీల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా పారిశ్రామిక   స‌ద‌స్సుల్లోనూ, జర్నల్స్‌లోనూ ఆమె అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. పారిశ్రామిక అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా అనేక సూచ‌న‌లు చేశారు.

IEEE/ACM  ప‌బ్లికేష‌న్స్‌లో ఇప్పటి వ‌ర‌కు దాదాపు 30 ఆర్టిక‌ల్స్ రాశారు. 70 పేటెంట్స్‌ను సొంతం  చేసుకున్నారు. ముఖ్యంగా వాయిస్ ఓవ‌ర్ ఐపీ, 4జీ, 5జీ టెక్నాల‌జీలలో అద్భుత ప్రతిభ క‌న‌బ‌రిచారు.IEEE టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డు-2019 స‌హా డాక్టర్‌ కల్యాణి త‌న ఉద్యోగ జీవితంలో అనేక అవార్డుల‌ను అందుకున్నారు. ఇందుకుగాను అమెరికాలోని తెలుగు వారంతా ఆమెను అభినందిస్తున్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts