
5G in America: విమాన ప్రయాణికులకు 5జీ తిప్పలు
పలు సర్వీసుల రద్దుతో ఇక్కట్లు
న్యూయార్క్: అమెరికా విమానాశ్రయాల్లో టెలికాం సంస్థలు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాదలచిన కొత్త 5 జీ సేవల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనతో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాల రాకపోకలను నిర్ణీత దూరాలకు పరిమితం చేశారు. దీంతో ప్రణాళికలు అస్తవ్యస్తమై వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. వీరిలో భారత ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాతోపాటు ఇంకా పలు అంతర్జాతీయ విమాన సంస్థలు అమెరికాకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త 5 జీ ఫోను నుంచి వెలువడే సంకేతాలతో విమానాల్లోని నేవిగేషన్ వ్యవస్థలకు అంతరాయాలు ఉంటాయని ముందు జాగ్రత్తగా విమానాలు నిలిపివేశారు. ‘5జీ ఫోను సిగ్నళ్లతో విమానంలోని రేడియో ఆల్టీమీటర్ (ఎత్తును కొలిచే మాపకం) ప్రభావితమై ఇంజినులోని బ్రేకింగు వ్యవస్థ ల్యాండింగ్ మోడ్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా విమానం రన్‌వేపైన ఆగడం కష్టమవుతుంది’ అని అమెరికాలోని విమానయాన నియంత్రణ సంస్థ ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌ఏఏ) జనవరి 14న ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీసులు రద్దు చేసింది. దిల్లీ నుంచి వాషింగ్టన్‌కు మాత్రం యథావిధిగా సర్వీసులు నడుస్తున్నాయి. తదుపరి నోటీసులు వచ్చేవరకు విమానాల రద్దు కొనసాగుతుందని ఎమిరేట్స్ పేర్కొంది.
కొన్నిచోట్ల 5జీ సేవల వాయిదా
మరోవైపు.. ఎయిర్‌లైన్ల ఆందోళనలతో బైడెన్ సర్కారు చేపట్టిన చర్యల నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాల వద్ద 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ ప్రకటించాయి. కొన్ని ఎయిర్‌పోర్టుల రన్‌వేలకు సమీపంలో 5జీ సెల్‌టవర్లను ఏర్పాటు చేయబోమని ఏటీ అండ్ టీ తెలిపింది. విమానాశ్రయాల చుట్టూ 5జీ సేవలను పరిమితంగానే అందుబాటులోకి తెస్తామని వెరిజాన్ పేర్కొంది. తమ సాంకేతికత విమాన వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోదని రెండు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. అనేక దేశాల్లో దీన్ని సురక్షితంగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. 90 శాతం టవర్లను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ప్రయాణికుల ఆవేదన
‘నాలుగేళ్ల తర్వాత నేను ఇండియాకు వెళ్తున్నా. కరోనా వల్ల రెండేళ్లు ఇంటికి వెళ్లలేకపోయా. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు ట్రైను ద్వారా వెళ్తా. అక్కడి నుంచి టికెటు దొరికితే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని న్యూయార్క్‌లో ఉండే భారతీయుడు జయంత్ రాజా తెలిపారు. దాదాపు అయిదేళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుస్తున్నానని ఎంతో ఆరాటపడ్డానని ముంబయి ప్రయాణికురాలు ప్రియాంకా సేథ్ అన్నారు.