మనోళ్లు.. విశ్వగురువులు

మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి.

Updated : 23 Jan 2022 06:19 IST

అమెరికా, యూకేలో భారీగా ప్రవాస భారతీయ ఆచార్యులు

డీన్లు, విభాగాధిపతులుగానూ వందల మంది

 కొన్ని వర్సిటీలకు అధ్యక్షులుగా బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి. అంతేకాదు పరిపాలనా వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. తాజాగా తెలుగు మహిళ నీలి బెండపూడి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్‌గా నియమితులు కావడం గమనార్హం.

భారత్‌ నుంచి విద్యార్థులు 1980 ప్రాంతంలో అమెరికాతోపాటు యూరప్‌ దేశాల్లో ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీ చేసేందుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అలాంటి వారు ఎంతో మంది అక్కడే బోధనా వృత్తి వైపు ఆసక్తి చూపారు. 990 వరకు అదే పరిస్థితి కొనసాగింది. అలా ఆచార్యవృత్తిలో రాణిస్తున్నవారిని ఆయా వర్సిటీలు ముఖ్యమైన స్థానాల్లో నియమిస్తూ మనవారికి సముచిత స్థానాలు కట్టబెడుతున్నాయి. ఇలా ఎంతో మంది ప్రవాస భారతీయులు(ప్రవాసాంధ్రులు/ప్రవాస తెలంగాణీయులు) మంచి హోదాల్లో నిలుస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్‌ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి విశ్లేషించారు.


మెరికాలో 2010లోనే దాదాపు 300-400 మంది తెలుగు ఆచార్యులు పలు వర్సిటీల్లో వివిధ హోదాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. వారు ఆచార్యులుగా, విభాగాధిపతులుగా, డీన్లుగా, ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంచనా. తాజాగా వైజాగ్‌కు చెందిన నీలి బెండపూడి పెన్సిల్వేనియా రాష్ట్ర వర్సిటీ ప్రెసిడెంట్‌గా తాజాగా నియమితులయ్యారు.


యూలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన జేఎన్‌ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒకటైన టెక్సాస్‌ ఏ అండ్‌ ఎంలోని సెంటర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ మెకానిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.


ఇంద్రా కె.రెడ్డి టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం వర్సిటీలోని ఫార్మసీ కళాశాల వ్యవస్థాపక డీన్‌గా ఉన్నారు. కాకతీయ వర్సిటీలో ఆయన బీఫార్మసీ చదివారు.


* అమెరికాలో ఇంజినీరింగ్‌ విద్యకు అత్యంత ప్రసిద్ధి చెందిన కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన సుబ్ర సురేష్‌ 2013లో ఎన్నికయ్యారు. ఆసియా దేశాలకు చెంది ఎంఐటీ డీన్‌గా పనిచేసిన మొదటి వ్యక్తి ఆయనే. బ్రౌన్‌ వర్సిటీలో అత్యంత చిన్న వయసులో ఆచార్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు కూడా ఆయనే.

* ప్రవాస భారతీయుడైన ప్రదీప్‌ ఖోస్లా కాలిఫోర్నియా వర్సిటీ ఛాన్స్‌లర్‌గా పనిచేయడం విశేషం.

* యూకేలోని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అమర్త్యసేన్‌, సుగతా మిత్ర, కుమార్‌ భట్టాచార్య, సుమంత్ర బోస్‌ తదితరులు, కేంబ్రిడ్డి వర్సిటీలో జైదీప్‌ ప్రభు తదితరులు పనిచేశారు.

* ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, మాంచెస్టర్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ తదితర ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పదుల సంఖ్యలో భారతీయులు గురువులుగా వ్యవహరిస్తున్నారు.

* కొలంబియా విశ్వవిద్యాలయంలోని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2011లో విడుదల చేసిన సర్వే ప్రకారం 5.4 శాతం ఆసియన్లు బోధనా వృత్తిలో ఉంటే వారిలో 2-3 శాతం శాతం మంది భారతీయులే ఉంటారని అంచనా వేశారు.

* ఆచార్య అఖిల్‌ బిల్‌గ్రామి అగ్రదేశానికి చెందిన కొలంబియా వర్సిటీలోని ఫిలాసఫీ విభాగంలో 1985 నుంచి పనిచేస్తున్నారు. ముంబయికి చెందిన ఆయన అంతకు ముందు మిషిగన్‌ వర్సిటీలో సేవలందించారు.


ఎందరో తెలుగు వాళ్లు...

* ఓయూలో చదివిన రవి బెల్లంకొండ కొద్ది నెలల క్రితమే ఎమొరి వర్సిటీ అకడమిక్‌ వ్యవహారాలకు ప్రోవోస్ట్‌గా, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

* హైదరాబాద్‌లోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌(ఐఎస్‌బీ) డీన్‌గా నియమితులైన మదన్‌ పిల్లుట్ల కూడా లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆచార్యుడే. అక్కడ పనిచేస్తూనే ఇక్కడకు వచ్చారు.

* గణితం, సాంఖ్యక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సీఆర్‌ రావు ఇప్పటికీ అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీలో ఎమిరిటీస్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

* ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ముఖ్య ఆచార్యుడు చెన్నుపాటి జగదీష్‌ వచ్చే మే నెలలో ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

* అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్‌ వర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌లో కరుణ మంతెన సహ ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆమె హార్వర్డ్‌ వర్సిటీ నుంచి 2004లో పీహెచ్‌డీ పొందారు. ఆమె రచించిన పలు పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి.  


* అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీలో రాములు మామిడాల సీనియర్‌ ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన ఓయూలోనే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఆయన 1985-86లోనే ఆ వర్సిటీలో టాప్‌ టెన్‌ ఆచార్యుల్లో ఒకరిగా పురస్కారం పొందారు. 2012లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.


* యూఎస్‌లోని ది న్యూ స్కూల్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌లో సంజయ్‌ జి రెడ్డి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆ వర్సిటీలో ఇండియా-చైనా ఇన్‌స్టిట్యూట్‌కు కో అకడమిక్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు పలు భాషాల్లోకి అనువాదమయ్యాయి. ఆయన హార్వర్డ్‌ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు.


యూకేలో భారతీయ గురువులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని