పేదల వైద్యానికి.. ప్రవాస సాయం

బాధలో ఉన్నవారికి సాయమందించే వారుంటారు. తమకు చేతనైనంతగా తృణమో.. పణమో అందిస్తుంటారు. ఒక్కసారో.. రెండుసార్లో చేస్తారు. కానీ నిరంతరాయంగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి తమ

Updated : 30 Jan 2022 09:27 IST

ఎంఎన్‌జేకు అనుబంధంగా రూ.4 కోట్లతో ఐదంతస్తుల వసతిగృహ నిర్మాణం
త్వరలో అందుబాటులోకి.. డాక్టర్‌ గోవిందరావు ఉదారత

ఈనాడు - హైదరాబాద్‌: బాధలో ఉన్నవారికి సాయమందించే వారుంటారు. తమకు చేతనైనంతగా తృణమో.. పణమో అందిస్తుంటారు. ఒక్కసారో.. రెండుసార్లో చేస్తారు. కానీ నిరంతరాయంగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి తమ సొంత డబ్బు నుంచి రూ.కోట్లు ఖర్చు చేసేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి అరుదైన దార్శనికుల్లో ప్రవాస తెలంగాణవాసి డాక్టర్‌ గోవిందరావు చామకూరు(90) ఒకరు. అమెరికా న్యూయార్క్‌ రాష్ట్రంలోని అమ్‌స్టర్‌డామ్‌లో నివాసముంటున్నారు. వైద్యవిద్య చదువుతున్న కుమార్తె 20 ఏళ్ల వయసులో కళ్ల ముందే ప్రమాదవశాత్తూ కన్నుమూస్తే.. ఆ బాధను దిగమింగుకొని.. కుమార్తె పేరు మీదనే ‘నీనారావు ఛారిటబుల్‌ ట్రస్టు’ను స్థాపించారాయన. ఫలానా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలనే అంశం ఆయన దృష్టికి వస్తే చాలు.. మరో ఆలోచన లేకుండా ఆ పని పూర్తి చేయడంలో మహదానందాన్ని వెతుక్కుంటారు. సర్కారు దవాఖానాల్లో రోగులకు బాసటగా నిలవాలనే సంకల్పమే గత 18 ఏళ్లుగా ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. ఆయనతో సహా గోవిందరావు కుటుంబంలో 9 మంది పిల్లల వైద్యనిపుణులే. ఇక్కడ హైదరాబాద్‌లో ఆయన తమ్ముడు చామకూరు హరనాథరావు(85) ఈ ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.

రోడ్డు పక్కనే పడుకున్న వారిని చూసి చలించి..
ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి రేడియోథెరపీ, కీమోథెరపీ చికిత్సల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే రోగులు.. ఆసుపత్రి వెలుపలే రాత్రీపగలు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ సుమారు 300 మంది రేడియోథెరపీ పొందుతుంటారు. వారిలో 100 మందికి మాత్రమే ఆసుపత్రిలో వసతి ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన వారు ఆసుపత్రి ఆవరణలోనో.. రోడ్ల పక్కనో.. చెట్ల కిందో, వరండాల్లోనో తలదాచుకుంటున్నారు. వారి అవస్థలను ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ జయలత.. నీనారావు ట్రస్టు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన డాక్టర్‌ గోవిందరావు రోడ్ల పక్కన, చెట్ల నీడలో తలదాచుకుంటున్న వారిని చూసి చలించారు. భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. రూ.4 కోట్ల వ్యయాన్ని పూర్తిగా భరించారు. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. వారం రోజుల్లోనే ఈ భవనాన్ని క్యాన్సర్‌ రోగులకు వసతిగృహంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంచాలకులు డాక్టర్‌ జయలత తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనంలో ఏకకాలంలో 350 మంది రోగులు ఉండడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.


ప్రభుత్వ వైద్యంలో మెరుగైన సేవలే లక్ష్యం
- డాక్టర్‌ గోవిందరావు, నీనారావు ఛారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌

మాది హైదరాబాద్‌. మా నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఆయన నుంచే వచ్చింది. అమెరికాలో పిల్లల వైద్య నిపుణుడిగా స్థిరపడ్డా. సామాజిక సేవలో భాగంగా ‘నీనారావు ఛారిటబుల్‌ కార్పొరేషన్‌ యూఎస్‌ఏ’ను స్థాపించా. క్యాన్సర్‌ రోగులు పడుతున్న అవస్థలను కళ్లారా చూశాక.. వారికి ఊరట కలిగే విధంగా నిర్మాణానికి ఎంత ఖర్చైనా భరించాలని ముందే అనుకున్నా. నా లక్ష్యం నెరవేరి, త్వరలోనే ఇది అందుబాటులోకి రానుండడం ఆనందాన్నిస్తోంది.


అ‘పూర్వ’ విద్యార్థులు

ఈనాడు, వరంగల్‌: వీరంతా కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు. వైద్య నిపుణులుగా వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డారు. తాము అనుభవపూర్వక విద్యనభ్యసించిన ఎంజీఎం ఆసుపత్రికి ఎంతో కొంత సేవ అందించాలని సంకల్పించారు. కొవిడ్‌ సమయంలో రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు. కాళోజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వారిని సమన్వయపరిచారు. బైపాప్‌ యంత్రాలు, 125 ఆక్సిజన్‌ ఫ్లోమీటర్లు, ఎముకల శస్త్రచికిత్సలో ఉపయోగపడే అత్యాధునిక ‘సీ ఆర్మ్‌’ పరికరం వంటివి అందజేశారు. ఈ పరికరాలు అందుబాటులోకి వచ్చాక.. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో రూ.2 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు జరిగాయని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సుమారు రూ.3 లక్షల విలువైన వైద్య పరికరాలను ములుగు జిల్లా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు, జనగామ ఆసుపత్రికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.


ఎన్నెన్ని సేవలో...

* ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్‌ గోవిందరావు 15 ఏళ్ల కిందట నిలోఫర్‌ పిల్లల ఆసుపత్రిలో వెంటిలేటర్లు సహా ఆధునిక వైద్య పరికరాలనూ, శస్త్రచికిత్స థియేటర్‌ను సమకూర్చారు. 14 పడకల అత్యవసర చికిత్స విభాగాన్ని ఏర్పాటుచేశారు. సమావేశ గదిని, గ్రంథాలయాన్ని నిర్మించారు.
* ఉస్మానియా ఆసుపత్రిలో 12 వార్డుల ఆధునికీకరణ చేపట్టారు. ఉస్మానియా వైద్యకళాశాలలో సమావేశ గదినీ, రెండు గ్రంథాలయాలనూ నిర్మించారు. మహిళలు, పురుషులు చదువుకోవడానికి వేర్వేరు గదులను నెలకొల్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని