NRI: తిరిగివ్వడమే వారి నైజం..జన్మభూమి సేవలో ప్రవాసాంధ్రులు

వారిది పేద, మధ్య తరగతి కుటుంబాల నేపథ్యం. కష్టపడి చదువుకున్నారు. వైద్య నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉన్నతంగా 

Published : 30 Jan 2022 12:27 IST

ఆసుపత్రులు, పాఠశాలలకు ఇతోధిక సాయం

వారిది పేద, మధ్య తరగతి కుటుంబాల నేపథ్యం. కష్టపడి చదువుకున్నారు. వైద్య నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉన్నతంగా స్థిరపడ్డారు. జీవితాన్ని ఇచ్చిన జన్మభూమికి తమ సంపాదనలో నుంచి తిరిగి ఏమైనా ఇవ్వాలనే సదాశయంతో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. విద్య, వైద్యశాలల ఉన్నతీకరణకు నిధులు సమకూరుస్తున్నారు. విద్యార్థులు, మహిళలకు అండగా నిలుస్తున్నారు. 


బధిర బాలల ఆత్మబంధువు 

9 ఎకరాల భూమి కొని పాఠశాల నిర్మాణం

నాగుబడి సుబ్బారావు ఆదర్శం 

న్యూస్‌టుడే, పర్చూరు: ఆయన వైద్యుడు. బధిరులైన తన సోదరీమణుల కష్టాలను కళ్లారా చూశారు. తాను అనుభవించారు. ఆ బాధలు ఇంకెవరూ పడొద్దనే లక్ష్యంతో సొంతంగా రూ.కోట్లు ఖర్చుతో బధిరుల పాఠశాలను నిర్మించారు. అందులో చేరితే అన్నీ ఉచితమే. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బోధనతోపాటు దుస్తులు, ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పిల్లలు మున్ముందు సొంత కాళ్లపై నిల్చునేలా వృత్తివిద్యలో శిక్షణ ఇస్తున్నారు. వారి భవితకు బంగారు బాటలు చేస్తున్నారు. ఆయనే ప్రవాసాంధ్రుడు డాక్టరు నాగుబడి సుబ్బారావు. పర్చూరు మండలం కొమర్నేనివారిపాలెం వాసి డాక్టర్‌ సుబ్బారావు ఎంబీబీఎస్‌ అనంతరం లండన్‌ వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించారు. అక్కడే వైద్యవృత్తిలో చేరారు. అయిదు దశాబ్దాల కిందటే అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. వినికిడి సమస్యతో ఇద్దరు సోదరీమణులు చదువుకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని డాక్టర్‌ సుబ్బారావు నిర్ణయించుకున్నారు. బధిరుల పాఠశాల నిర్మాణానికి సంకల్పించారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలో 9 ఎకరాల భూమిని కొన్నారు. మూడు ఎకరాల్లో రూ.కోటితో భవనాలను నిర్మించారు. నిర్వహణకు తల్లిదండ్రులు నాగుబడి రంగయ్య, అచ్చమ్మల పేరిట ట్రస్టు ఏర్పాటుచేసి, మరికొన్ని డబ్బులు జమ చేశారు.

ట్రస్టు ఆధ్వర్యంలో అంతా ఉచితం 

పాఠశాలలో చేరే ప్రతి బధిర విద్యార్థికి ఉచితంగా విద్య, వసతి, పుస్తకాలు, దుస్తులను సమకూరుస్తారు. బాలబాలికలకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం ఉంటుంది. ఒకటి నుంచి పది వరకు విద్యాబోధన ఉంటుంది. 20 మందితో ప్రారంభమైన పాఠశాలలో... ప్రస్తుతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన 55 మంది చదువుకుంటున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన 8 మంది ఉపాధ్యాయులు, అయిదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రత్యేక పరికరాల ద్వారా బోధిస్తున్నారు. విద్యార్థులు కూర్చునే గ్రూపు హియరింగ్‌ మిషన్లను బళ్లలకు అమర్చారు. క్రీడలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. విద్యార్థులకు కుట్టు, ఇతర వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోనే కూరగాయలు పండిస్తున్నారు. సిబ్బంది జీతాలు, భోజనం తదితర ఖర్చులకు ట్రస్టు ద్వారా నెలకు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటారు. 

ఆత్మవిశ్వాసంతో జీవించేలా తీర్దిదిద్దుతాం

మా తల్లిదండ్రుల సూచనతోనే బధిరుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఇక్కడ చేరిన పిల్లలు... ఇతరులపై ఆధారపడకుండా ఆత్మస్థైర్యంతో జీవించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పాఠశాలలో విద్యార్థులతో ఉన్న సమయంలో దక్కే ఆనందం వెలకట్టలేనిది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎంత మంది వచ్చినా ఉచితంగా విద్య, వసతి తదితర సౌకర్యాలన్నీ కల్పిస్తాం.  -డాక్టర్‌ నాగుబడి సుబ్బారావు 



వైద్యో.. నారాయణో... ప్రసాద్‌ 
గుంటూరు ఆసుపత్రికి భారీ సాయం 
మరింత చేయూత అందించేందుకు సిద్ధం 


ఈనాడు - అమరావతి : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, సౌకర్యాల లేమి కారణంగా వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి గుర్తింపు, పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందంటూ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలు అమెరికాలో ఉంటున్న పొదిలి ప్రసాద్‌ను కదిలించాయి. ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు... తనవంతు చేయూతగా నూతన భవన నిర్మాణానికి రూ.5 కోట్లు అందించారు. అంతటితోనే ఆగకుండా మరింత సాయానికి ముందుకొచ్చారు. మాతాశిశు సంరక్షణ కేంద్రానికి రూ.1.80 కోట్లు ప్రకటించారు. ప్రభుత్వం సహకరిస్తే జీజీహెచ్‌లో తన పేరిట నిర్మించిన మిలీనియం బ్లాక్‌పై మరో రెండంతస్తులు నిర్మించేందుకు సిద్ధమని ప్రసాద్‌ చెబుతున్నారు. 

క్లిష్టమైన శస్త్రచికిత్సలకు నిలయం 

సత్తెనపల్లి మండలం పణిదం గ్రామానికి చెందిన పొదిలి ప్రసాద్‌... గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలోని న్యూమెక్సికోలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాల కొరతపై 2005 సంవత్సరంలో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలు ఆయన్ని ఆలోచింపజేశాయి. వెంటనే భవన నిర్మాణానికి రూ.5 కోట్లు అందించారు. వీటికితోడు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో జీజీహెచ్‌లో పొదిలి ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌ను నిర్మించారు. దీంతో 2013 నుంచి ఆసుపత్రిలో వైద్యసేవలు, బోధన విస్తృతమయ్యాయి. ఈ బ్లాక్‌లోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆపరేషన్‌ థియేటర్ల కారణంగా గుంటూరులో ఎంతో క్లిష్టమైన గుండె మార్పిళ్లు సాధ్యపడ్డాయని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికీ వివిధ రకాల శస్త్రచికిత్సలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి తొలి, మలి విడత కొవిడ్‌ ఉద్ధృతిలో ఎక్కువ మంది పేషంట్లకు మిలీనియం బ్లాక్‌ నుంచే వైద్యం అందించారు. 

సొంత గ్రామ అభివృద్ధికి చేయూత

తన స్వగ్రామమైన పణిదం అభివృద్ధికి ప్రసాద్‌ సాయం అందించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 2002-03 సంవత్సరంలో జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఎసీˆ్సకాలనీకి మొట్టమొదటి సిమెంటు రోడ్డును నిర్మించారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం, రథం పునరుద్ధరణ తదితర పనులకు ఆర్థిక సహాయం చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో జింఖానా ఆడిటోరియం నిర్మాణానికి ప్రసాద్‌ ఆర్థికసాయం చేశారు. 2002 సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి 30 వేల డాలర్లు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీసెస్‌ అనాథ పిల్లల ఆశ్రమానికి 10 వేల డాలర్లు అందజేశారు. 

విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తా 

 

మహాత్మాగాంధీ జన్మదినం రోజున... అదీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే నేను జన్మించా. గాంధీ, వివేకానందల ఆలోచనలు, ఆశయాల బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో ఎంతోకొంత సమాజానికి ఏదో రూపంలో వెచ్చించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. గుండె, మోకీళ్ల మార్పిళ్లు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు జీజీహెచ్‌లో చేయడం ఎంతో తృప్తినిచ్చింది. అవకాశమిస్తే జీజీహెచ్‌కు విజిటింగ్‌ వైద్యునిగా వచ్చి జీర్ణ, ఉదరకోశ వ్యాధులకు వైద్యసేవలు అందిస్తా. - డాక్టర్‌ పొదిలి ప్రసాద్‌
 


ఆయనది చదువుల ‘టీం’
విద్యార్థులకు అండగా అబ్బూరి శ్రీనివాస్‌ 
ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ 


న్యూస్‌టుడే, వినుకొండ: ఎవరైనా పిల్లలు ఆర్థిక సమస్యలతో చదువులకు దూరమైతే ఆయన తట్టుకోలేర[ు. చేతనైనంత మందికి చేయూతను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు ఊపిరి నిలిపేందుకు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లనూ అందించారు.  గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కొత్తలూరుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. అమెరికాలోని సియాటిల్‌ వాషింగ్టన్‌లో స్థిరపడ్డారు. టీం (టీమ్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ యాక్టివిటీస్‌ మేనేజ్‌మెంట్‌) పేరిట ట్రస్టును ఏర్పాటుచేసి 2016 నుంచి సేవలందిస్తున్నారు. కొత్తలూరులో ప్రతిభ చాటిన హైస్కూల్‌ విద్యార్థులకు ఏటా రూ.75 వేల ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నారు. ఏటా ముగ్గురు విద్యార్థులకు సుమారు రూ.లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్న బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన బాలుడు యశ్వంత్‌ వైద్య ఖర్చులకు రూ.లక్ష అందించారు. కరోనా సమయంలో రూ..10లక్షల విలువైన ఆక్సిజన్‌ సిలిండరు,్ల ఫేస్‌మాస్కులను వినుకొండ, శావల్యాపురం, గుడివాడతోపాటు తెలంగాణలో వివిధ ఆసుపత్రులకు అందజేశారు. ఈ ఏడాది రూ.4.50 లక్షలతో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. ఏటా సుమారు రూ.2లక్షల విలువైన కృత్రిమ కాళ్లు పంపిణీ చేస్తున్నారు. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం ప్రాధమిక పాఠశాల పిల్లలకు పుస్తకాల బ్యాగులు, కుర్చీలు, బళ్లలతోపాటు దివ్యాంగులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. శావల్యాపురం, కొత్తలూరు, గంటావారిపాలెం, ఏనుగుపాలెం, కొత్తపాలెం పాఠశాలలకు వాటర్‌ ఫిల్టర్‌లు, సీలింగ్‌ ఫ్యాన్‌లు అందజేశారు. 


మహిళా స్వావలంబనకు కృషి 
14 ఏళ్లుగా జిడుగు సుబ్రమణ్యం సేవ 
యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ శిబిరాలు


న్యూస్‌టుడే, బాపట్ల: అమెరికా న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడిన జిడుగు సుబ్రమణ్యం... 14 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం భీమావారిపాలెం ఆయన స్వగ్రామం. ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కలిగించేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి, కుట్టు యంత్రాలను ఉచితంగా అందజేస్తున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బాపట్ల, పొన్నూరు, రేపల్లెకు చెందిన 70 మంది పేద విద్యార్థులకు రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆసరా ప్రతిభా పురస్కారాల పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని