అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త

అమెరికా వీసా దరఖాస్తుదారులకు సంతోషం కలిగించే విషయాన్ని అగ్రరాజ్యం చెప్పింది. ఈ మేరకు విద్యార్థులు, వృత్తి నిపుణులు సహా పలు రకాల వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని దౌత్య కార్యాలయాల్లో.....

Updated : 28 Feb 2022 07:03 IST

డిసెంబరు 31 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

వాషింగ్టన్‌: అమెరికా వీసా దరఖాస్తుదారులకు సంతోషం కలిగించే విషయాన్ని అగ్రరాజ్యం చెప్పింది. ఈ మేరకు విద్యార్థులు, వృత్తి నిపుణులు సహా పలు రకాల వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని దౌత్య కార్యాలయాల్లో ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూ రద్దు చేసినట్లు అమెరికా సీనియర్‌ దౌత్యవేత్త ఒకరు భారత సంతతి ప్రతినిధులకు తెలిపారు. విద్యార్థులు (ఎఫ్‌, ఎమ్‌, అకడమిక్‌ జె వీసాలు), వృత్తి నిపుణులు (హెచ్‌-1, హెచ్‌-2, హెచ్‌-3, వ్యక్తిగత ఎల్‌-వీసాలు), కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులు (ఓ, పీ, క్యూ వీసాలు) కింద వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపునకు అర్హులు. వీసా దరఖాస్తుదారులకు ఇది చాలా మేలు చేకూర్చుతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ సలహాదారుడు అజయ్‌  జైన్‌ భుటోరియా చెప్పారు. అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్‌ లూతో భేటీ అనంతరం అజయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌ వ్యాలీలో శుక్రవారం లూతో భేటీ సందర్భంగా భుటోరియా వీసాల వ్యవహారాన్ని ప్రస్తావించగా.. డిసెంబరు 31 వరకు కొన్ని రకాల వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. వీసా రద్దు కార్యక్రమం కింద ప్రయోజనం పొందాలంటే.. గతంలో ఏదైనా విభాగంలో అమెరికా వీసా పొంది ఉండాలి. ఏనాడూ వీసా తిరస్కరణకు గురై ఉండకూడదు. అదే సమయంలో వీసాకు సంబంధించి తగిన అర్హతలు లేని వారు మినహాయింపు పొందలేరు. వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు సౌలభ్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా త్వరలోనే దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయిల్లోని కాన్సులేట్‌లు 20,000 అదనపు అపాయింట్‌మెంట్లు జారీచేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఓ నోటీసు ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని