ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలి

అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది.

Published : 15 Mar 2022 15:04 IST

సింగపూర్‌: అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది.  ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్’,‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’,‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శుభోదయం గ్రూప్స్’ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్‌, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుంచి గాయనీగాయకులు పాల్గొని ఘంటసాల గీతాలను ఆలపిస్తున్నారు. సింగపూర్‌లో జరగబోయే ముగింపు సభ, ‘ఘంటసాల శత జయంతి’ ఉత్సవాలకు సిద్ధమవుతున్నామని వంశీ సంస్థల అధ్యక్షులు డా. వంశీ రామరాజు తెలిపారు.

100వ రోజు సందర్భంగా ప్రముఖ సినీ కవి భువనచంద్ర, అమెరికా నుంచి ఇందుర్తి బాల రెడ్డి నిర్వాహక సంస్థల అధినేతలు డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్, డా లక్ష్మీ ప్రసాద్, సమన్వయకర్త ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఘంటసాల వారికి ‘భారతరత్న’ పురస్కారం లభించడం సమంజసమని ప్రముఖులందరూ కలసి అభిప్రాయం వ్యక్తం చేశారు. అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీగాయకులందరికీ ఇచ్చే ధ్రువ పత్రాలను వంశీ ఇంటర్నేషల్‌ సంస్థ ఆవిష్కరించింది.

ప్రముఖ గాయకుడు తాతా బాలకామేశ్వర రావు ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను, పద్యాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమాన్ని, శుభోదయం మీడియా ద్వారా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని