దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. ఎన్నారైలతో భేటీలో నిర్మలా సీతారామన్‌

దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవాస భారతీయులను కోరారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌ కాలిఫోర్నియాలోని సిలికానాంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

Published : 24 Apr 2022 21:03 IST

కాలిఫోర్నియా‌: దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవాస భారతీయులను కోరారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్‌ కాలిఫోర్నియాలోని సిలికానాంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీ, స్టార్టప్‌ల గురించి మాట్లాడారు.

కొవిడ్ సమయంలో దేశంలో డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య భారీగా పెరిగిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్ ఎంతో ముందుకు సాగిందన్నారు. క్రిప్టో కరెన్సీలు అత్యంత ప్రమాదకరమని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులకు, మనీ లాండరింగ్‌కు ఈ కరెన్సీలను వాడుకునేందుకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ ద్వారానే వీటిని నియంత్రించడం సాధ్యమన్నారు. దేశంలో 5జీ టెక్నాలజీ పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. డిజిటల్ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలను, డిజిటల్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలన్నారు.

భారత్ ప్రస్తుతం అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌లో ఉన్న ప్రతి 4 స్టార్టప్‌లలో ఒకటి ఫిన్‌టెక్‌ అని, ఇవి యూనికార్న్‌లుగా వృద్ధి సాధిస్తున్నట్టు వెల్లడించారు. గత మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో 20 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయని తెలిపారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భార‌త దౌత్య కార్యాలయం కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ నేతృత్వం వహించారు. భార‌త దౌత్య కార్యాలయం నుంచి రాజేష్ నాయక్, డాక్టర్‌ అకున్ స‌భ‌ర్వాల్ సమన్వయపరిచారు. సిలికాన్ ఆంధ్ర చైర్మన్‌ ఆనంద్ కూచిభొట్ల‌, దిలీప్ కొండప‌ర్తి, రాజు చేమ‌ర్తి, దీనబాబు కొండుభట్ల, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని