హిందుత్వంలో ద్వేషానికి చోటు లేదు: రాంమాధవ్‌

‘హిందుత్వం అంటే మతం కాదు. ఒక జీవన విధానం, మనందరికీ తెలిసిన మార్గం ’అని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందని

Updated : 12 May 2022 19:56 IST

సింగపూర్‌: ‘హిందుత్వం అంటే మతం కాదు. ఒక జీవన విధానం, మనందరికీ తెలిసిన మార్గం’ అని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందని భాజపా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. ఆయన రచించిన ‘ది హిందుత్వ పారడైమ్’ పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 10కి పైగా స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత డా.రాంమాధవ్ మాట్లాడుతూ... ‘హిందుత్వం అనేది ఇప్పుడు భారతదేశంలో చాలా సాధారణ విషయం. ప్రధాన స్రవంతి. రాజకీయ నాయకులు గతంలో కంటే మరింత స్పష్టంగా బహిరంగంగా తమ హిందుత్వాన్ని చాటుకుంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా హిందువులమని చెప్పుకోవాలని అనుకుంటున్నారు. 1995లో ఎన్నికల పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ‘హిందుత్వం మతం కాదు. హిందుత్వం అంటే ఒక జీవన విధానం, మనందరికీ తెలిసిన మార్గం’అని చెప్పింది. ప్రతి హిందువు ఇతరుల పట్ల ద్వేషభావాన్ని వీడాలి. ఎందుకంటే హిందుత్వంలో ద్వేషానికి చోటులేదు’’ అని పేర్కొన్నారు.

అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘సాంస్కృతిక కళాసారథి’ సంస్థని స్థాపించాక మొదటిసారి ఇలాంటి కార్యక్రమం జరగడం, అది విజయవంతమవడంపై నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్, రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుంచి దీక్ష తదితరులకు ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేశారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను  గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని