శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు ఇంకా పెరగాలి

ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీశ్‌ ఎన్నికయ్యారు. ఈ నెల 26న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగేళ్లపాటు ఆయన ఈ

Updated : 18 May 2022 11:06 IST

ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడు చెన్నుపాటి జగదీశ్‌ సూచన

ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగుతేజం

ఈ నెల 26న బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీశ్‌ ఎన్నికయ్యారు. ఈ నెల 26న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌, మెటీరియల్‌ ఇంజినీరింగ్‌ విభాగం విశిష్ట ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వల్లూరుపాలెంకు చెందిన ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. ఆంధ్రా, నాగార్జున, దిల్లీ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. అటు ఆస్ట్రేలియాలో.. ఇటు భారత్‌లో శాస్త్ర, సాంకేతిక (సైన్స్‌, టెక్నాలజీ) రంగాలకు ఉన్న ప్రాధాన్యాలు ఏంటి? రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు అవసరం? మన దేశ విద్యా విధానంలో ఉన్న పరిస్థితులపై ఆయన ‘ఈనాడు’ తో మాట్లాడారు.. వివరాలివి..

ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కార్యకలాపాలేంటి? అక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌కి, ప్రభుత్వానికి శాస్త్ర (సైన్స్‌) అంశాలపై ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సలహాలిస్తుంది.

మీరు చాలా కాలంగా ఆస్ట్రేలియాలో ఉన్నారు? అక్కడి ప్రభుత్వం శాస్త్ర సాంకేతికత విషయంలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోంది?
ఆస్ట్రేలియాలో సైన్స్‌, సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రజలు, ప్రభుత్వం సైన్స్‌ వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసుకోగలిగారు. తక్కువ సమయంలో ఇన్ని వ్యాక్సిన్లు తయారు చేయగలిగామంటే ప్రపంచం మొత్తం సైన్స్‌, సాంకేతిక రంగాల్లో 40 ఏళ్లుగా పెట్టుబడి పెట్టడంతోపాటు పరిశోధనల కారణంగానే సాధ్యమైంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా అవసరం.

కొవిడ్‌ పరిస్థితుల వల్ల శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవసరమైన పరిశోధనలకు ఉన్న ప్రాధాన్యమేంటి?ఎలాంటి ముందుచూపు అవసరమని గుర్తించారు? ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్‌లో ప్రభుత్వాలు సైన్స్‌, సాంకేతికతకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నాయి?
భారత ప్రభుత్వం నూతన ఐఐటీలను ప్రారంభించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించడం మంచి పరిణామమే. ప్రపంచంలోని అన్ని దేశాలూ సైన్స్‌ను వ్యాపారాత్మకంగా మార్చాలన్న దానిపై దృష్టి పెట్టాయి. ముందు ఫండమెంటల్‌, బేసిక్‌ సైన్స్‌కు మద్ధతు తెలపాలి.

దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు తగినంత ప్రాధాన్యం కన్పిస్తోందా?  
మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలపై పెట్టుబడి పెడుతోంది. భారత దేశం జనాభాపరంగా పెద్దది కాబట్టి పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులతో మాట్లాడుతుంటాను. శాస్త్ర సాంకేతిక రంగంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం పెట్టుబడి పెడితే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పరికరాలకు డబ్బు ఇస్తోంది కానీ వాటి నిర్వహణకు ఇవ్వడం లేదని, దాంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. భారత ప్రభుత్వం సౌకర్యాలు కల్పించిన తరువాత నిర్వహణకు డబ్బు ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. తద్వారా యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు లబ్ధి పొందుతారన్నది నా అభిప్రాయం.

కొవిడ్‌ సమయంలో హైదరాబాద్‌ నుంచి అద్భుతమైన వ్యాక్సిన్లు వచ్చాయి? ఇంకా తగినంత ప్రాధాన్యం కావాలని అర్థం చేసుకోవచ్చా?
సంవత్సర కాలంలో వ్యాక్సిన్‌ తయారు చేయగలిగామంటే అంతకుముందు 30ఏళ్ల పాటు పరిశోధనలు జరిగాయి. అవి చేయలేకపోతే రాత్రికి రాత్రే మనం ఆ వ్యాక్సిన్‌ తయారు చేసి ఉండేవాళ్లం కాదు. దీనికి దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం.

మన దేశంలో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంది?
పిల్లలకు ఉద్యోగం రావాలని తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది. అందుకే ఇంజనీరింగ్‌ చదవండి, ఎంబీబీఎస్‌ చదవండని బలవంతం చేస్తాం. అది కాదు.. పిల్లలకు ఏదీ ఇష్టమైతే అది చదివించగలిగితే వాళ్లు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. పిల్లలకు ఇష్టమైన వాటిని ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మేధో సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేం.

ఆస్ట్రేలియాలో చాలా యూనివర్సిటీలపై మీకు అవగాహన ఉంది. భారత్‌లో కూడా ఐఐఎమ్‌, ఐఐటీలపైన అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ కోర్సుల రూపకల్పన, విద్యా బోధన విధానంలో ఏవైనా లోపాలు గుర్తించారా? ఎలాంటి మార్పులు అవసరమని భావిస్తున్నారు?
మన దేశంలో వివిధ రకాల విశ్వవిద్యాలయాలు ఉండటంతో విద్య అద్భుతంగా ఉంది.  ఆస్ట్రేలియాలో తరగతి గదిలోకి వెళ్లి బోధించకుండా ఫ్లిప్‌ క్లాసెస్‌ నిర్వహిస్తున్నాం. లెక్చరర్‌ బోధనను రికార్డింగ్‌ చేస్తే విద్యార్థులు ఎన్నిసార్లు వినాలన్నా వినవచ్చు. విద్యార్థులు పాఠాన్ని ఒకటికి రెండుసార్లు వింటే అవగాహన పెంపొందుతుంది. క్లాస్‌కు వచ్చి చర్చ పెడితే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయవచ్చు.

శాస్త్ర, సాంకేతిక పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సుల్లో పాల్గొన్నారు? ఈ రంగంలో  ఏ దేశంలో మంచి విధానాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వాటి నుంచి భారత్‌ నేర్చుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?
మన దృష్టి అంతా భవిష్యత్తు తరాలపై ఉంది. ఆస్ట్రేలియాలో అయినా.. భారత్‌లో అయినా యువతకు అవకాశాలు కల్పిస్తే వాళ్లు వాటిని సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి యువతరం మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో యువతకు ఫెలోషిప్స్‌తో పాటు ఫండ్‌ కూడా ఏర్పాటు చేశారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, హాంకాంగ్‌ వంటి దేశాల్లో ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. యువతను లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలు రూపొందిస్తే ఇక్కడ కూడా పరిస్థితి బాగు పడుతుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా అనేక దేశాలకు విద్యనభ్యసించేందుకు ఎంతోమంది వెళుతున్నారు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియాకూ చాలామంది వస్తుంటారు. అక్కడి యూనివర్సిటీలను ఎంచుకునేందుకు ఇక్కడి విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి?
ఆస్ట్రేలియాకు తెలుగువాళ్లు చాలామంది వస్తున్నారు.  విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకుంటే ఇష్టంతో చదువుతారు. కాబట్టి జీవితంలో పైకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం వస్తుందని చదవడం కంటే.. మనకు నచ్చింది ఎంచుకోవాలి.

యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్సల్టెన్సీలు చాలా విషయాలు చెబుతుంటాయి.

ఉత్తమమైన యూనివర్సిటీకి వెళితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరున్న యూనివర్సిటీలో చదివితే అవకాశాలు త్వరగా వస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా మారుమూల పల్లెటూరు నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. నేటి యువత కోసం ఏమి చేయనున్నారు?
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు ఏ గ్రామం నుంచి ఏ స్థాయి నుంచి వచ్చామన్నది మరిచిపోకూడదు. హైస్కూల్‌లో ఉన్నప్పుడు నాకు ఇద్దరు ఉపాధ్యాయులు సహాయం అందించారు. నేను నా సొంత డబ్బుతో యువ శాస్త్రవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తా. ప్రతి ఒక్కరూ ఉన్నతస్థితికి వెళ్లాక తమ వంతు సహకారం అందిస్తే యువతతో పాటు దేశం అభివృద్ధి చెందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు